- కీసర ఇన్స్పెక్టర్ అర్కపల్లి అంజనేయులుపై అక్రమాస్తుల కేసు నమోదు
- ఇల్లు, కార్యాలయంతోపాటు ఆరు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు.. భూములు, ఇళ్ల పత్రాలు స్వాధీనం
- రూ.5 లక్షల లంచం కేసులో ఇప్పటికే జైలులో సీఐ.. ఆదాయానికి మించిన ఆస్తులపై దర్యాప్తు ముమ్మరం
సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్ : రూ.5 లక్షల లంచం కేసులో పట్టుబడి జైలుకెళ్లిన కీసర పోలీస్ ఇన్స్పెక్టర్ అర్కపల్లి అంజనేయులు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ఆయనపై తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసింది. శనివారం (అక్టోబర్ 17) ఆయన నివాసం, కార్యాలయంతోపాటు బంధువులు, సన్నిహితులు, బినామీలకు సంబంధించిన మరో నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఇళ్లు, స్థలాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలతోపాటు నగదు, బంగారు ఆభరణాలు, వాహనం, ఇతర విలువైన వస్తువులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువను సుమారు రూ.2.28 కోట్లుగా ప్రాథమికంగా అంచనా వేసింది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ మరింత ఎక్కువగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇళ్లు, స్థలాలు, వ్యవసాయ భూములు!
ఏసీబీ సోదాల్లో బయటపడిన ఆస్తుల వివరాలు చర్చనీయాంశంగా మారాయి. సరూర్‌నగర్ పరిధిలోని లింగోజిగూడలో చెరో 150 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన రెండు ప్లాట్లు, పాత ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.30 లక్షలుగా పేర్కొన్నారు. ఎల్బీనగర్ పరిధిలోని మన్సూరాబాద్ సీఆర్ ఎన్‌క్లేవ్‌లో 240 చదరపు గజాల్లో ఉన్న పాత ఇంటి విలువ రూ.40 లక్షలుగా లెక్కించారు. పెరూర్ గ్రామంలో 180 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న మరో ఇంటిని గుర్తించగా, దాని విలువ రూ.50 లక్షలుగా అంచనా వేశారు. మిర్యాలగూడ సమీపంలోని హాట్యా ప్రాంతంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. దీని విలువ రూ.80 లక్షలుగా వెల్లడించారు. ఇదే ప్రాంతంలో మరికొన్ని వ్యవసాయ భూములను కూడా అంజనేయులు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, వాటి వివరాలను సేకరిస్తున్నామని ఏసీబీ పేర్కొంది.
రూ.7 లక్షల నగదు.. 60 తులాల బంగారం!
స్థిరాస్తులతోపాటు సోదాల్లో రూ.7 లక్షల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలు, మారుతి విటారా బ్రెజ్జా కారు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఏసీబీ ప్రకటనలో బంగారు ఆభరణాల విలువను సుమారు రూ.5 లక్షలుగా, కారు విలువను రూ.6.50 లక్షలుగా, ఇతర వస్తువుల విలువను రూ.10 లక్షలుగా పేర్కొన్నారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ రూ.2,28,50,000గా అంచనా వేశారు. అయితే ఇవి ప్రాథమిక విలువలేనని, మార్కెట్ ధరల ప్రకారం మరింత పెరిగే అవకాశం ఉందని ఏసీబీ వెల్లడించింది.
రూ.8 లక్షల డిమాండ్.. రూ.5 లక్షలు తీసుకుంటూ పట్టుబడి!
అంజనేయులు గత సెప్టెంబర్ 16న కీసర పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సమయంలో అధికారిక పని చేసిపెట్టేందుకు రూ.8 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. తన కింద పనిచేసే డి.జ్ఞానేందర్‌రెడ్డి ద్వారా రూ.5 లక్షలు స్వీకరిస్తున్న వ్యవహారంలో ఏసీబీకి చిక్కినట్లు వెల్లడించింది. ఈ కేసులో సెప్టెంబర్ 17న అంజనేయులును అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో ఉన్నారు.
లంచం కేసు నుంచి అక్రమాస్తుల దర్యాప్తు వరకు!
లంచం కేసులో అరెస్టు అనంతరం అంజనేయులు సంపాదించిన ఆస్తులపై ఏసీబీ దృష్టి సారించింది. ఆయనకు ఉన్న అధికారిక ఆదాయ వనరులు, ఉద్యోగ కాలంలో సంపాదించిన ఆస్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల పేరిట ఉన్న ఆస్తుల వివరాలను పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 13(1)(బి), సెక్షన్ 13(2) కింద కేసు నమోదు చేసింది.
ప్రస్తుతం గుర్తించిన ఆస్తులతోపాటు మరిన్ని ఆస్తులు ఉన్నాయా? వాటి కొనుగోళ్లకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? బినామీల పేరిట పెట్టుబడులు ఉన్నాయా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అంజనేయులును పీటీ వారెంట్‌పై కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు ఏసీబీ ప్రకటించింది. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఆస్తుల వాస్తవ విలువ, వాటి మూలాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.