40 ఏళ్ల భూ వివాదం.. ‘69/1’ను ‘224’గా చూపి అనుమతులెలా?
- బిల్డర్లతో కుమ్మక్కయ్యారా?.. మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులపై తీవ్ర అనుమానాలు
- నాటి లేఅవుట్ రద్దు చరిత్రను పక్కనపెట్టి అనుమతులిచ్చిందెవరు?
- క్షేత్రస్థాయి తనిఖీ నివేదికలేవి?.. ఏసీపీ పాత్రపై విచారణకు డిమాండ్
సామాన్యుడి అస్త్రం / మియాపూర్ : హైదరాబాద్ మహానగరంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు చేరువలోని మియాపూర్, మదీనాగూడ ప్రాంతాల్లో స్థలాలకు భారీగా డిమాండ్ పెరిగింది. గజం భూమి కూడా లక్షల్లో పలుకుతున్న నేపథ్యంలో వివాదాస్పద స్థలాలపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడుతోంది. ఇదే అదనుగా కొందరు నిర్మాణదారులు పాత భూ వివాదాలను పక్కనపెట్టి నిర్మాణాలకు తెరలేపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని అడ్డుకోవాల్సిన మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగమే అనుమతులకు మార్గం సుగమం చేస్తోందా? క్షేత్రస్థాయిలో భూమి హద్దులను నిర్ధారించాల్సిన అధికారులు బిల్డర్లతో కుమ్మక్కవుతున్నారా? మియాపూర్ సర్వే నంబర్ 69/1 వివాదంలో ఇప్పుడు ఈ అనుమానాలే ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి.
నాలుగు దశాబ్దాల వివాదం.. కొత్తగా అనుమతులెలా?
మియాపూర్ సర్వే నంబర్ 69/1 భూ వివాదం ఇప్పటిది కాదు. సుమారు నాలుగు దశాబ్దాలుగా వివిధ న్యాయస్థానాల్లో కేసులు, రెవెన్యూ రికార్డులు, సర్వే హద్దులపై వివాదాలు కొనసాగుతున్నాయి. మదీనాగూడ సర్వే నంబర్ 224లోని పాత లేఅవుట్‌కు సంబంధించి 1981 జనవరి 15న ముసాయిదా అనుమతి, 1983 జూన్ 13న రద్దు జరిగినట్లు కోర్టు రికార్డుల్లో ప్రస్తావన ఉంది. దీనికి సంబంధించిన హుడా లేఖ నంబర్ 1061/MP2/H/2004 కూడా పరిశీలనకు కీలకంగా మారింది. అప్పట్లోనే లేఅవుట్ అనుమతులపై సందేహాలు తలెత్తినప్పుడు, ఇప్పుడు అదే ప్రాంతంలో నిర్మాణాలకు కొత్త అనుమతులు ఎలా వచ్చాయి. ఈ నిర్మాణం జరిగే స్థలం పై రెవెన్యూ ఇది ముమ్మాటికీ ప్రభుత్వ భూమిగా 22ఏ లో జతపరిచినప్పుడు అనుమతులు ఎలా సాధ్యపడ్డాయి.
ఏసీపీ పరిశీలన ఎక్కడ?.. ఫొటోలేవి?
సామాన్యుడు ఇంటి నిర్మాణానికి అనుమతి కోరితే పత్రాల పరిశీలన నుంచి సాంకేతిక నిబంధనల వరకు ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. మరి నాలుగు దశాబ్దాలుగా వివాదంలో ఉన్నట్లు చెబుతున్న భూమికి సంబంధించిన నిర్మాణ అనుమతుల విషయంలో ఆ పరిశీలన ఎలా జరిగింది. దరఖాస్తులో 224 అని పేర్కొంటే సరిపోయిందా. రెవెన్యూ రికార్డులతో స్థల హద్దులను సరిపోల్చారా. అనుమతుల ఫైళ్లలో సంబంధిత ఏసీపీ నమోదు చేసిన పరిశీలన వివరాలేమిటి. స్థల పరిశీలన జరిగితే తీసిన ఫొటోలేవి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులదే. ప్లాట్ నంబర్ 32కు 0666/జీహెచ్‌ఎంసీ/ఐ ఏ /సి21/2025, ప్లాట్ నంబర్లు 30, 31 పార్ట్‌కు 4331/జీహెచ్‌ఎంసీ/ఎస్ ఎల్ పి/2025-బి పి అనుమతులు జారీ అయ్యాయి. ఈ రెండు ఫైళ్లలో ఏసీపీ పరిశీలన, సాంకేతిక అధికారుల సిఫార్సులు, తుది ఆమోదం ఎవరి స్థాయిలో జరిగాయో వెల్లడించాలి. ఒకవేళ స్వీయ ధ్రువీకరణ విధానంలో అనుమతులు వచ్చినట్లయితే తదుపరి తనిఖీలు, పత్రాల నిజానిజాల నిర్ధారణకు తీసుకున్న చర్యలను బయటపెట్టాలి.
లంచాల మత్తులోనే అనుమతులా? రెవిన్యూ అధికారుల పాత్ర ఏమిటి
అసలు వివాదం ఇక్కడే మొదలవుతోంది. ఒకవైపు సర్వే నంబర్ 69/1లోని 19 ఎకరాల 14 గుంటల భూమి ప్రభుత్వానికి చెందినదని, 22-ఏ నిషేధిత జాబితాలో ఉందని రెవెన్యూ శాఖ హైకోర్టులో వాదిస్తోంది. మరోవైపు అదే భూమిలో నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో చర్యలు శున్యం, గతంలో ఈ మండలంలో పని చేరిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ల చేతివాటంతో బిల్డర్లకు సహకరిస్తూ ప్రభుత్వ భూములు కట్టబెట్టిన ఆరోపనులున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్ అనుమతులు జారీ కావడం వెనుక అధికారుల పాత్రపై తీవ్రమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీపీతోపాటు అనుమతుల పరిశీలనలో పాల్గొన్న అధికారులు నిర్మాణదారులకు అనుకూలంగా వ్యవహరించారా, లంచాలకు లొంగి సర్వే వివాదాలను పక్కనపెట్టారా, భూమి విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో సొంతప్రయోజనాల కోసమే అనుమతుల ప్రక్రియను ముందుకు నడిపించారన్న అనుమానాలపై విచారణ అవసరం ఉంది. ఈ ఆరోపణల్లో నిజానిజాలు తేలాలంటే అనుమతుల ఫైళ్లతోపాటు సంబంధిత అధికారుల నిర్ణయాలు, పరిశీలన నివేదికలు, ఫైల్ మూవ్‌మెంట్‌ను నిష్పక్షపాతంగా పరిశీలించాల్సిందే.
సర్కిళ్లు మారినా.. బాధ్యత మారిపోతుందా?
గతంలో చందానగర్ సర్కిల్‌గా ఉన్న పరిపాలనా వ్యవస్థలోనూ, ప్రస్తుతం మియాపూర్ సర్కిల్ పరిధిలోనూ ఈ భూమి వివాదానికి సంబంధించిన పాత రికార్డుల పరిశీలన కీలకమే. జీహెచ్‌ఎంసీ కాలంలో ఇచ్చిన అనుమతులపై ఇప్పుడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సమగ్ర సమీక్ష చేపట్టాల్సిన అవసరం ఉంది. పరిపాలనా సరిహద్దులు, సర్కిళ్ల పేర్లు మారినంత మాత్రాన గత అనుమతుల బాధ్యత కనుమరుగు కాదు.
ఏసీపీ ఫైళ్లు తెరిస్తేనే అసలు బాగోతం!
కోర్టులో ప్రభుత్వ భూమిగా రెవెన్యూ శాఖ వాదిస్తున్న స్థలంపై నిర్మాణ అనుమతులిచ్చిన వ్యవహారంలో ఏసీపీతోపాటు సంబంధిత అధికారుల పాత్రను తేల్చాల్సిందే. అనుమతుల దరఖాస్తులు, స్థల పరిశీలన ఫొటోలు, సర్వే మ్యాపులు, అధికారుల సిఫార్సులను బహిర్గతం చేయాలి. అంతేకాదు, రెవెన్యూ, సర్వే, మున్సిపల్ శాఖలతో సంయుక్తంగా స్థల హద్దులను నిర్ధారించాలి. అధికారుల కుమ్మక్కు, లంచాల మత్తులో మునిగితేలుతున్న వారిపై ఏసీబీ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
నలభై ఏళ్లుగా వివాదంలో ఉన్న భూమికి నిర్మాణ అనుమతులు ఎలా వచ్చాయన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. కాగితాల్లో 224 అని చూపిస్తే సరిపోతుందా, క్షేత్రంలో ఉన్నది 69/1 అయితే బాధ్యత ఎవరిది. అనుమతులిచ్చిన అధికారులు, ముఖ్యంగా సంబంధిత ఏసీపీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే!