Lands & Encroachments

3 గుంటలే భూమి.. 600 గజాలుగా విక్రయం! నిజాంపేట్‌లో భూమి మోసంపై కేసు

3 గుంటలే భూమి.. 600 గజాలుగా విక్రయం! నిజాంపేట్‌లో భూమి మోసంపై కేసు

• 363 చదరపు గజాల భూమిని 600 గజాలుగా చూపించారన్న ఆరోపణ
• రూ.75 లక్షలకు పైగా చెల్లించినా భౌతిక స్వాధీనం ఇవ్వలేదంటూ ఫిర్యాదు
• కొలన్ రాజమోహన్ రెడ్డి, హరితపై బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు

సామాన్యుడి అస్త్రం / నిజాంపేట్ :
లేనిది ఉన్నట్లు.. కానిది అయినట్లు చూపించి భూమి విక్రయం చేశారంటూ నిజాంపేట్‌లో వెలుగుచూసిన వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. సర్వే నంబర్‌ 15లో వాస్తవంగా ఉన్న భూమి కంటే అధిక విస్తీర్ణాన్ని చూపించి విక్రయించారని, భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్న తర్వాత కూడా స్థలానికి భౌతిక స్వాధీనం ఇవ్వలేదని ఓ వ్యక్తి బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు.
ఫిర్యాదు ప్రకారం, కొలన్ హరిత, ఆమె భర్త కొలన్ రాజమోహన్ రెడ్డి సర్వే నంబర్‌ 15లోని స్థలానికి తామే యజమానులమని, సంబంధిత మున్సిపల్ అనుమతులు కూడా ఉన్నాయని నమ్మించినట్లు బాధితుడు పేర్కొన్నారు. వారి మాటలను నమ్మి రూ.1.20 కోట్లకు ఆస్తి కొనుగోలుకు అంగీకరించినట్లు తెలిపారు. ఇందులో చెక్కుల ద్వారా రూ.45.36 లక్షలు, నగదు రూపంలో రూ.30 లక్షలు చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ అయింది.. స్థలం మాత్రం దక్కలేదా?
ఫిర్యాదు వివరాల ప్రకారం, 12-02-2025న డాక్యుమెంట్ నంబర్‌ 4081/25 ద్వారా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ, ఆ తర్వాత స్థలానికి భౌతిక స్వాధీనం ఇవ్వలేదని ఆరోపించారు. దీంతో వ్యవహారంపై ఆరా తీసిన బాధితుడికి భూమి విస్తీర్ణంపై అనుమానాలు తలెత్తినట్లు తెలుస్తోంది.
కొలన్ రాజమోహన్ రెడ్డి వద్ద సర్వే నంబర్‌ 15లో వాస్తవంగా 3 గుంటలు, అంటే సుమారు 363 చదరపు గజాల భూమి మాత్రమే ఉందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. అయితే 2012లో తన భార్య కొలన్ హరితకు ఒకసారి 237 చదరపు గజాలు, మరోసారి 216 చదరపు గజాల స్థలాన్ని గిఫ్ట్ డీడ్ల ద్వారా బదలాయించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. ఈ రెండు విస్తీర్ణాలు కలిపితే 453 చదరపు గజాలు అవుతున్నాయని, అసలు అందుబాటులో ఉన్న భూమికంటే ఈ లెక్కలు ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదుదారు వాదించారు.
గిఫ్ట్ డీడ్లతో 600 గజాల అపార్ట్మెంట్?
ఈ గిఫ్ట్ డీడ్ల ఆధారంగా మొత్తం 600 చదరపు గజాల ఓపెన్ స్థలంలో అపార్ట్మెంట్ నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారని, అనంతరం అందులోని ఫ్లాట్లను పలువురికి విక్రయించినట్లు కూడా ఫిర్యాదులో ఆరోపించారు. వాస్తవ భూమి విస్తీర్ణం, గిఫ్ట్ డీడ్లు, నిర్మాణ అనుమతుల్లో చూపిన విస్తీర్ణం మధ్య భారీ వ్యత్యాసం ఉందని బాధితుడు పేర్కొన్నారు.
అందుబాటులో ఉన్న భూమికంటే ఎక్కువ విస్తీర్ణాన్ని పత్రాల్లో చూపించి, ఆ ఆధారంగా నిర్మాణ అనుమతులు పొందారా? అదే భూమిని పలుమార్లు లావాదేవీలకు ఉపయోగించారా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఈ వ్యవహారంలో కీలకంగా మారాయి.
హైకోర్టు కేసు విషయమూ దాచారన్న ఆరోపణ
ఇదే ఆస్తికి సంబంధించి కొలన్ రాజమోహన్ రెడ్డి సోదరుడు కొలన్ మాణిక్య రెడ్డి తెలంగాణ హైకోర్టులో W.P.No.34567/2024 దాఖలు చేసిన విషయాన్ని కూడా కొనుగోలుదారునికి తెలియజేయలేదని ఫిర్యాదులో ఆరోపించారు. భవన నిర్మాణ అనుమతిని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైనట్లు పేర్కొన్నారు.
ఆస్తికి సంబంధించి కోర్టు వివాదం కొనసాగుతున్న విషయాన్ని దాచిపెట్టి విక్రయం జరిపితే అది కొనుగోలుదారుని నిర్ణయాన్ని ప్రభావితం చేసే కీలక అంశమవుతుందని బాధితుడు పేర్కొన్నట్లు సమాచారం.
ప్రశ్నిస్తే బెదిరింపులంటూ ఫిర్యాదు
భూమి విస్తీర్ణం, పత్రాల్లోని వ్యత్యాసాలపై ప్రశ్నించగా దంపతులు దుర్భాషలాడుతూ బెదిరించారని కూడా ఫిర్యాదుదారు ఆరోపించారు. తప్పుడు వివరాలతో సేల్ డీడ్ రూపొందించి తమను మోసం చేశారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. అయితే భూమి అసలు విస్తీర్ణం ఎంత? గిఫ్ట్ డీడ్లు ఏ ఆధారంగా జరిగాయి? 600 చదరపు గజాలకు నిర్మాణ అనుమతులు ఎలా మంజూరయ్యాయి? కొనుగోలుదారునికి కోర్టు వివాదం వెల్లడించారా లేదా? అనే అంశాలు పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఈ మొత్తం వ్యవహారంపై సంబంధిత పత్రాలు, రిజిస్ట్రేషన్ రికార్డులు, మున్సిపల్ అనుమతులు, రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తే అసలు నిజం బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ భూమి విక్రయ వివాదం నిజాంపేట్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder