- 14, 17 ఏళ్ల మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్నట్లు ఆరోపణ
- ఆధారాల కోసం 22 సార్లు నిఘా.. వీడియో రికార్డింగ్
- రూ.60 వేల విలువైన సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
సామాన్యుడి అస్త్రం / ఓల్డ్ బోయిన్‌పల్లి : మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ఓల్డ్ బోయిన్‌పల్లిలోని ఓ పాన్‌షాప్‌పై EAGLE Force అధికారులు చర్యలు చేపట్టారు. లిమ్రా పాన్ మహాల్ యజమానితోపాటు అక్కడ పనిచేస్తున్న వర్కర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
14, 17 ఏళ్ల వయసున్న ఇద్దరు మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్నారంటూ ఫిర్యాదు అందడంతో అధికారులు విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం ఫిర్యాదు ఆధారంగా చర్యలకు దిగకుండా, ఆధారాలను సేకరించేందుకు షాపుపై పలుమార్లు నిఘా పెట్టారు. మొత్తం 22 సార్లు పరిశీలన జరిపి, మైనర్లు పాన్‌షాప్‌కు వచ్చి సిగరెట్లు కొనుగోలు చేస్తున్న దృశ్యాలను వీడియోలో రికార్డు చేసినట్లు తెలిసింది.
పక్కా ఆధారాలను సేకరించిన అనంతరం EAGLE Force అధికారులు లిమ్రా పాన్ మహాల్‌పై దాడి నిర్వహించారు. తనిఖీల్లో సుమారు రూ.60 వేల విలువైన సిగరెట్లు, వివిధ రకాల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమాని, వర్కర్‌ను పట్టుకుని తదుపరి చట్టపరమైన చర్యల కోసం కేసును బోయిన్‌పల్లి పోలీసులకు అప్పగించారు.
మైనర్లకు పొగాకు ఉత్పత్తులను విక్రయించడం చట్టవిరుద్ధమని తెలిసినా కొందరు వ్యాపారులు లాభాల కోసం నిబంధనలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, నివాస ప్రాంతాల సమీపంలోని పాన్‌షాపులపై నిరంతర నిఘా కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. తాజా చర్యతో మైనర్లకు సిగరెట్లు విక్రయించే వ్యాపారులకు అధికారులు గట్టి హెచ్చరిక పంపినట్లయింది.