Crime

నకిలీ Fire NOCతో ఇంటర్ కోడ్‌నా?.. ‘ఎక్సలెన్సియా’పై NTVS బాంబు!

నకిలీ Fire NOCతో ఇంటర్ కోడ్‌నా?.. ‘ఎక్సలెన్సియా’పై NTVS బాంబు!
  • అధికారుల సంతకాలు, ముద్రలు ఫోర్జరీ చేశారని NTVS తీవ్ర ఆరోపణ
  • ఇంటర్ కోడ్ రద్దు చేసి, క్యాంపస్‌ను సీజ్ చేయాలని డిమాండ్
  • సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్ : పేరులో ‘ఎక్సలెన్సియా’… అనుమతుల విషయంలోనూ అదే స్థాయి పారదర్శకత ఉందా? లేక విద్యార్థులు, తల్లిదండ్రుల నమ్మకాన్ని అడ్డుపెట్టుకుని నకిలీ పత్రాలతో వ్యవస్థనే మోసం చేశారా? ఎక్సలెన్సియా విద్యాసంస్థపై నవ తెలంగాణ విద్యార్థి శక్తి (NTVS) రాష్ట్ర అధ్యక్షుడు ఈవని పవన్‌కుమార్ చేసిన తీవ్ర ఆరోపణలు విద్యారంగంలో కలకలం రేపుతున్నాయి. కనీస అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించకుండానే, సంబంధిత అధికారుల సంతకాలు, ముద్రలను ఫోర్జరీ చేసి నకిలీ Fire NOC సృష్టించారని పవన్‌కుమార్ ఆరోపించారు. నకిలీ పత్రాన్ని ఆధారంగా చేసుకుని ఇంటర్మీడియట్ కోడ్ పొందినట్లయితే అది సాధారణ నిబంధనల ఉల్లంఘన కాదని, విద్యార్థుల ప్రాణాలతో చలగాటమేనని పేర్కొన్నారు.


రాష్ట్రవ్యాప్త నకిలీ NOCల వ్యవహారంతో అనుమానాలు

ఈ ఆరోపణలను రాష్ట్రంలో బయటపడిన నకిలీ Fire NOCల వ్యవహారం నేపథ్యంలో పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోంది. హైడ్రా అదనపు డైరెక్టర్ ఫిర్యాదుతో ఎనిమిది జూనియర్ కళాశాలలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తాజా సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చిన 76 Fire NOCలను హైడ్రా పరిశీలిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే ఇప్పటివరకు బహిరంగమైన అధికారిక జాబితాలో ఏ కళాశాల పేరుని  స్పష్టంగా చెప్పలేదు. అందువల్ల NTVS ఆరోపణలపై విద్యాశాఖ, ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా స్పందించి ఆధారాలను పరిశీలించాల్సి ఉంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు జూనియర్ కళాశాలలకు Fire NOC తప్పనిసరి చేసిన నేపథ్యంలో, నకిలీ పత్రాలతో గుర్తింపు పొందారనే ఆరోపణలు మరింత తీవ్రమవుతున్నాయి. ఒక పత్రం నకిలీగా తేలితే దానిని ఎవరు తయారు చేశారు? ఎవరు అప్‌లోడ్ చేశారు? క్షేత్రస్థాయి తనిఖీ లేకుండానే ఇంటర్ బోర్డు అనుమతి ఎలా ఇచ్చింది? ధ్రువీకరించాల్సిన అధికారులు ఏం చేశారు? అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సిందే.

ఆర్భాటాల వెనుక భద్రత ఎంత?

ఎక్సలెన్సియా అధికారిక వెబ్‌సైట్‌లో హైదరాబాద్ పరిధిలో 14కు పైగా శాఖలు ఉన్నట్లు, 2026–27 ప్రవేశాలు కొనసాగుతున్నట్లు ప్రచారం చేస్తోంది. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక వసతుల పేరుతో విద్యార్థులను ఆకర్షించే సంస్థలు ముందుగా వారి ప్రాణాలకు భద్రత కల్పించాలి. Fire NOC అనేది అలంకారంకోసం కాదు ప్రమాద సమయంలో వందల మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడే వ్యవస్థకు సంబంధించిన ధ్రువీకరణ.

కోడ్ రద్దు చేయాలి: NTVS పవన్ కుమార్ 

ఎక్సలెన్సియాపై వచ్చిన ఆరోపణలను సమగ్రంగా విచారించి, నకిలీ పత్రాలు సమర్పించినట్లు తేలితే ఇంటర్ కోడ్, గుర్తింపును వెంటనే రద్దు చేయాలని NTVS డిమాండ్ చేసింది. సంబంధిత క్యాంపస్‌ను సీజ్ చేయడంతోపాటు ఫోర్జరీకి పాల్పడిన యాజమాన్యంపై, సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరింది. 

హంగులు, ప్రకటనలు కాదు… విద్యార్థుల భద్రతే మొదటి ప్రమాణం. సరైన అనుమతులు లేకుండా విద్యాసంస్థలను నిర్వహిస్తే చూస్తూ ఊరుకోం. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తాం అని పవన్‌కుమార్ హెచ్చరించారు.  ఈ ఆరోపణలపై ఎక్సలెన్సియా యాజమాన్యం నుంచి స్పష్టమైన వివరణ రావాల్సి ఉంది. అదే సమయంలో Fire NOC అసలుదా, నకిలీదా అనే విషయాన్ని ఇంటర్ బోర్డు, హైడ్రా అధికారికంగా ప్రకటించాలి. కాలయపంకు తోవివ్వకుండా విద్యార్థుల భద్రతకు సంబంధించిన ఆరోపణలను మౌనంతో దాటవేయడం అంతకంటే ప్రమాదకరమని త్వరగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.  .


Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder