ASTHRAM DAILY
Investigations

అనుమతి ఒక్కటే.. నిర్మాణాలు రెండా? ప్రభుత్వ భూమి వివాదంలో మున్సిపల్ మౌనం!



  • ఫిర్యాదులున్నా… పట్టణ ప్రణాళిక అధికారులకు కనిపించలేదా?
  • 30 పార్ట్‌, 31 పార్ట్‌ కలిపి 300 గజాలకే నిర్మాణ అనుమతి
  • అనుమతి పత్రంలో ఒకే నివాస భవనం.. క్షేత్రంలో రెండు నిర్మాణాలు
  •  69/1ను ప్రభుత్వ భూమిగా రెవెన్యూ వాదిస్తున్నా మున్సిపల్ శాఖ ఎందుకు కదలడం లేదు?

సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్ క్రైమ్ బ్యూరో : ఫైల్‌లో ఒక లెక్క, క్షేత్రంలో మరో దృశ్యం. ఫిర్యాదులు అధికారుల టేబుళ్లపై తిరుగుతున్నా చర్య మాత్రం కనిపించడం లేదు. మియాపూర్‌ మదీనగూడ సరిహద్దులోని వివాదాస్పద భూముల వ్యవహారంలో మున్సిపల్ శాఖ నిర్లక్ష్యంపై ఇప్పుడు తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లభించిన నిర్మాణ అనుమతి పత్రం ప్రకారం మదీనగూడ సర్వే నం.224లోని ప్లాట్‌ నం.30 పార్ట్‌, 31 పార్ట్‌ కలిపి 300 చదరపు గజాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. పత్రంలో ఒకే నివాస భవనానికి స్టిల్ట్‌తో పాటు నాలుగు అంతస్తులు మంజూరు చేసినట్లు ఉంది. కానీ అక్కడికి వెళ్లి చూస్తే రెండు వేర్వేరు నిర్మాణాలు కనిపిస్తున్నాయన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న.

ఒకే 300 గజాలు.. ఒకే అనుమతి.. మరి రెండు నిర్మాణాలు ఎలా?

రెండో భవనానికి ప్రత్యేక అనుమతి ఉందా, లేకపోతే ఒకే అనుమతిని ఆధారంగా చేసుకుని అదనపు నిర్మాణం సాగుతుంటే ఇప్పటివరకు చర్య ఎందుకు తీసుకోలేదో చెప్పాలి. ఫిర్యాదులున్నా, తెలిసినా కదలని పట్టణ ప్రణాళిక అధికారులు “మాకు తెలియదు” అని చెప్పి తప్పించుకునే విషయం కూడా కాదు. నెలలుగా ఈ వ్యవహారాన్ని పట్టణ ప్రణాళిక అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని ఫిర్యాదుదారులు చెబుతున్నారు. పలుమార్లు కార్యాలయాలకు వెళ్లి వివరించినా చూస్తాం.. పత్రాలు తెప్పిస్తాం.. సంబంధిత వారిని పిలుస్తాం అన్న సమాధానాలే వస్తున్నాయని ఆరోపిస్తున్నారు.

అయితే ఇంతకాలం పట్టణ ప్రణాళిక విభాగం చేసింది ఏమిటి?

స్థలానికి వెళ్లి కొలిచారా, ఆమోదిత నిర్మాణాన్ని క్షేత్రంలోని నిర్మాణాలతో పోల్చారా, రెండో భవనానికి అనుమతి ఉందో లేదో తేల్చారా, రెవెన్యూ శాఖతో భూమి హద్దులపై సమన్వయం చేశారా, ఇవేవీ ప్రజల ముందుకు రాకపోతే అధికారుల నిర్లక్ష్యంపై అనుమానాలు మరింత బలపడటంతో పాటు, ఈ నిర్లక్ష్యం వెనుక ఇతర ప్రయోజనాలేమైనా ఉన్నాయా అన్న ఆరోపణలు కూడా స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. దీనికి సర్కిల్‌–48 పట్టణ ప్రణాళిక విభాగం సమాధానం చెప్పాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ భూమి వాదన ఉన్నా ఇంత నిర్లక్ష్యమా?

ఇక్కడ మరో కీలకమైన అంశం ఉంది. ఇదే ప్రాంతంలోని మియాపూర్‌ సర్వే నం.69/1లోని 19 ఎకరాల 14 గుంటల భూమి ప్రభుత్వ భూమేనని రెవెన్యూ శాఖ కోర్టులో వాదించింది. 22-ఏ నిషేధిత ఆస్తుల అంశాన్ని కూడా ప్రస్తావించింది. అలాంటి భూమికి ఆనుకుని ఉన్న స్థలంలో నిర్మాణ అనుమతి ఇస్తున్నప్పుడు మున్సిపల్ శాఖ సాధారణ ఫైల్‌లా వ్యవహరించడమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. అనుమతి పత్రంలోనే నిషేధిత ఆస్తుల పరిశీలన రిజిస్టర్‌కు సంబంధించిన నమోదు కనిపిస్తున్న పరిస్థితిలో, అసలు ఏం పరిశీలించారు, ఏ రెవెన్యూ రికార్డులు చూశారు, సర్వే నం.224 హద్దులను ఎవరు నిర్ధారించారు, మియాపూర్‌ 69/1తో ఓవర్ల్యాప్‌ ఉందా లేదా ఎవరు తేల్చారు. ఇవి సాధారణ ప్రశ్నలు కావు. ప్రభుత్వ భూమి పరిరక్షణకు సంబంధించిన ప్రశ్నలు.

డీసీకి బాధ్యత లేదా?

సర్కిల్‌ స్థాయిలో ఇంతటి వివాదం కొనసాగుతుంటే డిప్యూటీ కమిషనర్‌ ఇది పట్టణ ప్రణాళిక శాఖ విషయం అని పక్కకు తప్పుకోవడం ఎంతవరకు సమంజసం, అన్ని శాఖల పనిని డీసీ స్వయంగా చేయాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ తన పరిధిలో ప్రభుత్వ భూమి వివాదం, నిర్మాణ అనుమతులు, కోర్టు కేసులు, వరుస ఫిర్యాదులు ఉన్నప్పుడు సంబంధిత అధికారులను పిలిపించి నివేదిక కోరాల్సిన బాధ్యత మాత్రం తప్పదు. అదే విధంగా అసిస్టెంట్ సిటీ ప్లానర్‌ స్థాయి అధికారి ముందు నెలలుగా ఫిర్యాదు ఉన్నా, క్షేత్రస్థాయిలో స్పష్టమైన చర్య కనిపించకపోతే అది సాధారణ ఆలస్యం అని కొట్టిపారేయలేం. నిర్మాణం పూర్తయిన తర్వాత చర్య తీసుకుంటామంటే ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం ఏమిటి? అప్పటికే ఫ్లాట్లు అమ్ముడై మూడోపక్ష హక్కులు ఏర్పడితే బాధ్యత ఎవరిది, ప్రభుత్వ భూమి అయితే ఒక్క గజం కూడా చేజారకుండా కాపాడాల్సింది అధికారులే. కానీ ఒక శాఖ ప్రభుత్వ భూమి అంటుంటే, మరో శాఖ అనుమతులు ఇచ్చి, ఫిర్యాదులు వచ్చిన తర్వాత కూడా నెలల తరబడి చూస్తూ ఉండటం పరిపాలనా నిర్లక్ష్యం కాక మరేమిటి. ఇప్పటికైనా సర్కిల్‌–48 డిప్యూటీ కమిషనర్‌, పట్టణ ప్రణాళిక అసిస్టెంట్ సిటీ ప్లానర్‌ సంయుక్తంగా స్థలాన్ని పరిశీలించి, ఆమోదిత నిర్మాణ పటం, స్థల పరిశీలన నివేదిక, రెండో నిర్మాణానికి సంబంధించిన అనుమతి వివరాలను ప్రజల ముందుంచాలి.

300 గజాలకు అనుమతి ఒక్కటే అయితే రెండో భవనం ఎవరి అనుమతితో నిర్మిస్తున్నారు. అనుమతి లేకపోతే చర్యలకు ఇంకా ఎందుకు వెనకడుగు, నెలలుగా ఫిర్యాదులు తెలిసినా కదలని పట్టణ ప్రణాళిక శాఖ తీరును నిర్లక్ష్యం అనక మరేమనాలి. ఈ మూడు ప్రశ్నలకు సర్కిల్‌–48 డిప్యూటీ కమిషనర్‌, అసిస్టెంట్ సిటీ ప్లానర్‌ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే.

Journalist
Jairam
Journalist

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder