- ‘224’ పేరుతో పెరుగుతున్న నిర్మాణాలు.. రెవెన్యూ లెక్క ఏంటి?
- కోర్టులో ‘సర్కారీ భూమి’ అంటున్న రెవెన్యూ.. క్షేత్రంలో మాత్రం సర్వేకు వెనుకడుగు
- ముప్పై ఏళ్లుగా వివాదంలో ఉన్న భూమికి నిర్మాణ అనుమతులు ఎలా వచ్చాయి?
- మదీనగూడ 224 ఎక్కడ ముగుస్తుంది?.. మియాపూర్ 69/1 ఎక్కడ మొదలవుతుంది?
సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్ క్రైమ్ బ్యూరో : మియాపూర్ సర్వే నం.69/1లోని 19 ఎకరాల 14 గుంటల భూమి ప్రభుత్వ భూమేనని రెవెన్యూ శాఖే కోర్టులో చెప్పింది. హద్దులు తేల్చి చర్యలు తీసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసినా నెలలు గడుస్తున్నాయి. ఇప్పటికీ సర్వే లేదు, హద్దులు తేలలేదు, ఇదే సమయంలో మదీనగూడ సర్వే నం.224 పేరుతో నిర్మాణాలు కొనసాగుతుండటంతో ఈ జాప్యం ఎవరి కోసం? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గ్రామ మ్యాప్‌లు, సర్వే రికార్డులు, హద్దుల వివరాలు అందుబాటులో ఉన్నా 69/1 ఎక్కడ ముగుస్తుంది, 224 ఎక్కడ మొదలవుతుంది, అన్నది అధికారులు తేల్చకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఇదే ఇప్పుడు మియాపూర్‌లో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న.
ఈ భూమిని ప్రభుత్వ భూమిగా, నిషేధిత జాబితాలో ఉన్న భూమిగా రెవెన్యూ శాఖే కోర్టు ముందు వాదించింది. మరోవైపు అదే ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతున్న వారు తమ స్థలాలను మదీనగూడ సర్వే నంబర్ 224గా చూపుతున్నారు. కోర్టు కూడా వివాదాస్పద భూమిపై హద్దులు తేల్చి, ప్రభుత్వ భూమిగా నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం సర్వే కనిపించడం లేదు. హద్దుల నిర్ధారణ లేదు. తుది నివేదిక లేదు. ఇక్కడే అసలు లెక్క బయటకు రావాలి. మదీనగూడ సర్వే నంబర్ 224 అసలు విస్తీర్ణం ఎంత. అందులో ఇప్పటివరకు ప్లాట్లు, రోడ్లు, భవనాల రూపంలో వినియోగమైన భూమి ఎంత, ఇంకా మిగిలిన భూమి ఎంత.

ఈ మూడు లెక్కలు రెవెన్యూ రికార్డులు తెరిస్తే తేలిపోవాల్సిందే.
224కు గ్రామ మ్యాప్, సర్వే మ్యాప్ ఉంటుంది. దానికి ఆనుకుని మియాపూర్ గ్రామ హద్దు ఉంటుంది. 69/1కు కూడా ప్రత్యేక విస్తీర్ణం కి సంబందించిన రికార్డులు ఉన్నాయి. అలాంటప్పుడు రెండు గ్రామాల మధ్య ఉన్న భూమిని ఒకదానిపై మరొకటి పడేలా ఓవర్లాప్ చూపుతు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న రెవెన్యూ ఎందుకు కదలడంలేదు. ఈ సర్వే నెంబర్ లేదా గ్రామ హద్దులు నిజంగా మారి ఉంటే ఎప్పుడు మారాయి, ఎవరి ఉత్తర్వులతో మారాయి, ఏ మ్యాప్ ని సవరించారు, ఏ సర్వే రికార్డులో నమోదు చేశారు.
ఈ ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఎంఆర్వో కార్యాలయమే.
ముప్పై ఏళ్ల వివాదం.. అయినా మియాపూర్ సర్కిల్ అనుమతులు ఎలా ఇచ్చింది. ఈ భూవివాదం నిన్న మొన్న మొదలైంది కాదు. దాదాపు మూడు దశాబ్దాలుగా కోర్టులు, రెవెన్యూ రికార్డులు, పాత లేఅవుట్లు, సర్వే హద్దుల చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయి.
ఇంతటి వివాద చరిత్ర ఉన్న భూమిపై నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు వస్తే మున్సిపల్ అధికారులు కేవలం దరఖాస్తులో ఉన్న సర్వే నంబర్‌ను చూసి అనుమతి ఇచ్చేస్తారా, లేక స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాల్సిన బాధ్యత లేదా, జోనల్ స్థాయి అధికారులైనా, సర్కిల్ స్థాయి అధికారులైనా, స్థలానికి వెళ్లి అక్కడ రెవెన్యూ వివాదం ఉందా, కోర్టు కేసులు ఉన్నాయా, రెండు గ్రామాల సర్వే నంబర్ల మధ్య హద్దుల సమస్య ఉందా,ప్రభుత్వ భూమిపై అభ్యంతరం ఉందా, అని పరిశీలించారా, లేదా ఈ భూమి పై గత కొన్ని ఏళ్లగా వివాదాలున్నప్పుడు రెవెన్యూ క్లియరెన్స్ మినిసిపల్ అధికారులు తీసుకున్నారా లేదా కళ్ళు కేవలం ఎంత వస్తుందనే దానిపై పెట్టి అనుమతులిచారా అనేది తెలియాల్సివుంది.

పరిశీలించి కూడా అనుమతి ఇచ్చారా? లేక పరిశీలించకుండానే ఫైల్ ముందుకు నెట్టారా?
ఈ ప్రశ్నలకు మున్సిపల్ శాఖ కూడా సమాధానం చెప్పాల్సిందే.
ఎందుకంటే ఒకసారి నిర్మాణ అనుమతి చేతికి వస్తే అదే పత్రాన్ని చూపిస్తూ నిర్మాణదారులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఆ తర్వాత చట్టబద్ధమైన ప్రక్రియ పాటించకుండా అడ్డుకోవద్దు అనే రక్షణ పొందుతున్నారు. ఇలా ఒక శాఖ ఇచ్చిన అనుమతి మరో శాఖ చర్యలకు అడ్డంకిగా మారే పరిస్థితి వస్తే, దానికి బాధ్యత ఎవరిది. మరోవైపు సర్వే ఆలస్యమయ్యే కొద్దీ నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఫ్లాట్లు అమ్ముడవుతున్నాయి. మూడోపక్ష హక్కులు ఏర్పడుతున్నాయి. తర్వాత ప్రభుత్వ భూమిగా తేలినా సమస్య మరింత క్లిష్టమవుతుంది.
అందుకే ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న చాలా సూటిగా ఉంది
సర్వే చేయడానికి మ్యాప్ లేదా, రికార్డులు లేవా, అధికారం లేదా, లేక కాలయాపనకు మరో కారణం ఉందా? ముందు 224 అసలు విస్తీర్ణం చెప్పాలి. 69/1 హద్దులు చూపాలి. రెండు గ్రామాల పటాలను ఒకే మ్యాప్‌పై ఉంచి సంయుక్త సర్వే చేయాలి. ఆ తర్వాతే భూమి ఎవరిదో, నిర్మాణాలు ఎక్కడ ఉన్నాయో తేలుతుంది. అంతవరకు పై అధికారులకు రాశాం, సమాధానం రావాలి అనే మాటలతో కాలం గడిపితే మాత్రం ఒక్క ప్రశ్న తప్పదు
మరి రెవెన్యూ అధికారులు ఈ జాప్యం ఎవరి మెప్పుకోసమో సమాధానం చెప్పాల్సివస్తుంది.
