సామాన్యుడి అస్త్రం / హఫీజ్‌పేట్ : హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వైరల్ వీడియోలో మహిళను లాఠీతో కొట్టి, జుట్టుపట్టుకుని లాగిన వ్యక్తి ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కాదని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.
ఘటనపై విచారణ జరిపినట్లు పేర్కొన్న దక్షిణ మధ్య రైల్వే, సంబంధిత వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన హోంగార్డుగా గుర్తించినట్లు అధికారికంగా వెల్లడించింది. అతడు హఫీజ్‌పేట రైల్వే స్టేషన్‌లో విధుల కోసం డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నట్లు తెలిపింది.
మహిళపై బలప్రయోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు హోంగార్డును అక్కడి విధుల నుంచి వెనక్కి పంపి, అవసరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు అప్పగించినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
దీంతో తొలుత ఆర్‌పీఎఫ్ సిబ్బందిపై వచ్చిన ఆరోపణలకు రైల్వే వివరణ ఇచ్చినట్లయింది. అయితే మహిళతో వివాదానికి అసలు కారణమేంటి? బలప్రయోగానికి దారితీసిన పరిస్థితులేంటి? హోంగార్డుపై తెలంగాణ పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది.