Crime

పీహెచ్‌సీలో ఫస్ట్‌ ఎయిడ్‌కే కరువు!.. ప్రాణాపాయ వేళ మర్పల్లి ప్రజలకు దిక్కెవరు?

పీహెచ్‌సీలో ఫస్ట్‌ ఎయిడ్‌కే కరువు!.. ప్రాణాపాయ వేళ మర్పల్లి ప్రజలకు దిక్కెవరు?
  • అత్యవసర చికిత్సకు అవసరమైన ప్రాథమిక వైద్య సామగ్రి కొరత
  • జిల్లా నుంచి సరఫరా రాలేదంటున్న పీహెచ్‌సీ సిబ్బంది
  • తక్షణమే మందులు, పరికరాలు సమకూర్చాలని ప్రజల డిమాండ్

సామాన్యుడి అస్త్రం / మర్పల్లి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొస్తే క్షణాల్లో ప్రథమ చికిత్స అందాలి. కానీ వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర చికిత్సకు అవసరమైన కనీస వైద్య సామగ్రి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

కీలక సామగ్రే కరువు

రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర ఘటనల్లో గాయపడిన వారికి వెంటనే అందించాల్సిన ఫస్ట్‌ ఎయిడ్‌కు అవసరమైన కొన్ని కీలక వస్తువులు పీహెచ్‌సీలో లేవని క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటలో అందించే చికిత్స బాధితుడి ప్రాణాలను కాపాడటంలో కీలకంగా మారుతుంది. అలాంటి సమయంలో కనీస సామగ్రి లేకపోతే పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మండల కేంద్రంతోపాటు పరిసర గ్రామాల ప్రజలు వైద్య అవసరాల కోసం ఈ ఆరోగ్య కేంద్రంపైనే ఆధారపడుతున్నారు. రోడ్డు ప్రమాద బాధితులు, అకస్మాత్తుగా అస్వస్థతకు గురైనవారు ముందుగా ఇక్కడికే వస్తుంటారు. అత్యవసర చికిత్స అందకపోతే దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించేలోపు విలువైన సమయం వృథా అయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది.

‘సరఫరా రాలేదు.. ఆర్డర్ పెట్టాం’

ఈ పరిస్థితిపై ఏఎన్‌ఎంలు, స్టాఫ్ నర్సులను వివరణ కోరగా జిల్లా స్థాయి నుంచి అవసరమైన సామగ్రి సరఫరా కావడం లేదని తెలిపినట్లు సమాచారం. కొరత ఉన్న వస్తువుల కోసం ఇప్పటికే ఆర్డర్ పెట్టామని, త్వరలో అందుబాటులోకి వస్తాయని సిబ్బంది పేర్కొన్నారు.

స్పందించని వైద్యాధికారి

ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సంబంధిత వైద్యాధికారిని పలుమార్లు సంప్రదించినా స్పందన లభించలేదని తెలిసింది. ప్రజారోగ్యానికి సంబంధించిన తీవ్రమైన అంశంలో బాధ్యతాయుతమైన వివరణ ఇవ్వకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు తక్షణమే స్పందించి మర్పల్లి పీహెచ్‌సీకి ఫస్ట్‌ ఎయిడ్ సామగ్రి, అత్యవసర మందులు, అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder