Crime

గోవా నుంచి మియాపూర్‌కు ఎక్స్టసీ పిల్స్‌.. మెట్రో వద్ద ఈగల్‌ వేట!

గోవా నుంచి మియాపూర్‌కు ఎక్స్టసీ పిల్స్‌.. మెట్రో వద్ద ఈగల్‌ వేట!
  • ముంబైలో కొనుగోలు.. గోవాలో అమ్మకం.. మిగిలిన సరుకుతో హైదరాబాద్‌కు!
  • మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద అనుమానిత డ్రగ్‌ డీలర్‌ను పట్టుకున్న EAGLE బృందం
  • 14 ఎక్స్టసీ (MDMA) పిల్స్‌, రెండు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం
  • గోవా–ముంబై–హైదరాబాద్‌ మధ్య డ్రగ్స్‌ సరఫరా లింకులపై దర్యాప్తు
సామాన్యుడి అస్త్రం / మియాపూర్‌ :
ముంబైలో డ్రగ్స్‌ కొనుగోలు.. గోవాలో కొంత విక్రయం.. మిగిలిన సరుకుతో హైదరాబాద్‌లో అడుగుపెట్టగానే ఈగల్‌ ఫోర్స్‌కు చిక్కాడు. మూడు నగరాల మధ్య సాగుతున్నట్లు అనుమానిస్తున్న డ్రగ్స్‌ సరఫరా లింకులపై అధికారులు దృష్టి సారించారు. మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని ఈగాల్ టీం అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి ఎక్స్టసీ (MDMA) పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అరెస్టయిన వ్యక్తిని మిర్యాలగూడకు చెందిన పోల సురేష్‌ గోపీ (29)గా పోలీసులు గుర్తించారు. అతడి వద్ద నుంచి సుమారు 9 గ్రాముల బరువున్న 14 ఎక్స్టసీ (MDMA) పిల్స్‌తో పాటు రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

గోవాలో పరిచయం.. ముంబై నుంచి సరఫరా?
పోలీసుల కథనం ప్రకారం సురేష్‌ గోపీ 2024 జూలై నుంచి గోవాలో రెంటల్‌ ప్రాపర్టీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అక్కడ ఉన్న సమయంలోనే మాదకద్రవ్యాల సరఫరా వర్గాలతో పరిచయాలు ఏర్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
తొలుత గోవాకు చెందిన ‘బాబా’ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసేవాడని, ఆ తర్వాత ముంబైకి చెందిన దానిష్‌ ఆలమ్‌ అన్సారీ నుంచి డ్రగ్స్‌ తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తుల పాత్ర, వారి నుంచి మరెవరికి సరఫరా జరిగిందనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

29 పిల్స్‌ రూ.22,500కు!
పోలీసుల వివరాల ప్రకారం సెప్టెంబర్‌ 16న గోపీ ముంబై వెళ్లి 29 ఎక్స్టసీ పిల్స్‌ను రూ.22,500కు కొనుగోలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఒక్కో పిల్‌కు రూ.750 చొప్పున చెల్లించినట్లు తెలిపారు.
ఆ 29 పిల్స్‌లో 15 పిల్స్‌ను గోవాలో విక్రయించి, మిగిలిన 14 పిల్స్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వాటిని నగరంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద EAGLE అధికారులు అతడిని పట్టుకున్నట్లు తెలిపారు.

మియాపూర్‌లో ఎవరికి ఇవ్వాల్సింది?
ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారింది హైదరాబాద్‌ లింక్‌. గోపీ మిగిలిన 14 పిల్స్‌ను నగరానికి ఎందుకు తీసుకొచ్చాడు? మియాపూర్‌లో ఎవరికి విక్రయించాల్సి ఉంది? ముందే కస్టమర్లు ఉన్నారా? లేక మరొక డీలర్‌కు సరఫరా చేయాల్సి ఉందా? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
స్వాధీనం చేసుకున్న రెండు మొబైల్‌ ఫోన్లలోని కాల్‌ రికార్డులు, సందేశాలు, డిజిటల్‌ చెల్లింపులు తదితర ఆధారాలను పరిశీలించడం ద్వారా సరఫరా గొలుసులో మరెవరైనా ఉన్నారా అన్న విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మూడు నగరాల లింకుపై దృష్టి
ఈ కేసులో బయటపడిన ప్రాథమిక వివరాలు గోవా–ముంబై–హైదరాబాద్‌ మధ్య ఉన్నట్లు అనుమానిస్తున్న డ్రగ్స్‌ సరఫరా సంబంధాలపై అధికారుల దృష్టిని మళ్లించాయి. అయితే ఇది ఎంత పెద్ద నెట్‌వర్క్‌, ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారు, హైదరాబాద్‌లో ఎవరికి సరఫరా జరుగుతోంది అనే అంశాలు తదుపరి దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder