Hyderabad

సీఎంసీ పాలనలో కొత్త అధ్యాయం..

సీఎంసీ పాలనలో కొత్త అధ్యాయం..
  • ఆస్తిపన్ను లెక్కలు మారనున్నాయి.. 22-ఏ జాబితాలో అక్రమ భవనాలు.. 

  • కార్పొరేట్ విద్యాసంస్థలు, ప్రైవేట్ హాస్టళ్లపై ప్రత్యేక తనిఖీలు

  • క్యూర్ యాక్ట్ –2026 అమలుతో మున్సిపల్ పాలనలో కీలక మార్పులు

  • 40 రోజుల్లో 398 అక్రమ నిర్మాణాల కూల్చివేత.. మూడు జోన్లలో 2,700 భవనాల పరిశీలన

  • ఆస్తిపన్ను నుంచి పారిశుద్ధ్యం వరకు డిజిటల్ పర్యవేక్షణకు సీఎంసీ ప్రణాళిక

సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్ బ్యూరో :
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇకపై మున్సిపల్ పాలన పాత పద్ధతిలో సాగబోదన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. తాజాగా అమల్లోకి వచ్చిన క్యూర్ యాక్ట్ –2026కు అనుగుణంగా మూడు కార్పొరేషన్లకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో, ఆ చట్టంలోని నిబంధనలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు సీఎంసీ సిద్ధమవుతోంది. ఆస్తిపన్ను లెక్కింపు నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేత వరకు, చెత్త సేకరణ నుంచి భవన వినియోగ నిబంధనల వరకు అనేక అంశాల్లో మార్పులు రానున్నట్లు సీఎంసీ కమిషనర్ జి. సృజన మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు. ఆమె వెల్లడించిన అంశాలను చూస్తే.. ఇక మున్సిపల్ పాలనలో ‘అనుమతి తీసుకోకుండా కట్టి తర్వాత చూసుకుందాం’, ‘నివాస అనుమతితో వ్యాపారం నడిపేద్దాం’, ‘చెత్త సేకరణకు విడిగా డబ్బులు ఇస్తే సరిపోతుంది’ అనే పాత పద్ధతులకు క్రమంగా తెరపడే పరిస్థితి కనిపిస్తోంది.


ఆస్తిపన్ను లెక్కే మారనుంది

క్యూర్ యాక్ట్ అమలులో అత్యంత కీలకమైన అంశాల్లో ఆస్తిపన్ను విధానం ఒకటి. ఇప్పటివరకు అద్దె విలువ, విస్తీర్ణం తదితర అంశాల ఆధారంగా పన్ను లెక్కించే విధానం అమల్లో ఉండగా ఇక భూమి, భవనం మార్కెట్ విలువ ఆధారంగా పన్ను నిర్ణయించే క్యాపిటల్ వాల్యూ విధానం వైపు అడుగులు పడుతున్నట్లు కమిషనర్ వివరించారు. ఈ విధానంలో నివాస భవనాలకు 0.15 శాతం, వాణిజ్య లేదా ఇతర భవనాలకు 0.75 శాతం
ఖాళీ స్థలాలకు 0.50 శాతం, వంటి రేట్లతో లెక్కించే ప్రతిపాదనలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే కొత్త విధానం అమల్లోకి వచ్చిన వెంటనే ప్రజలపై భారీ భారం పడకుండా ఏడాదికి గరిష్ఠంగా 10 శాతం వరకు మాత్రమే పన్ను పెంపు ఉండేలా పరిమితి పెట్టే విధానం ఉంటుందని పేర్కొన్నారు. అంటే మార్కెట్ విలువ పెరిగిందని ఒక్కసారిగా పన్ను రెట్టింపు లేదా మూడింతలు అయ్యేలా కాకుండా దశలవారీగా పెంపు ఉండే అవకాశం ఉంది.


అక్రమ కట్టడమా?.. 22-ఏ జాబితాలోకి!

అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై ఇక కేవలం నోటీసులు, కూల్చివేతలతోనే ఆగకుండా సెక్షన్ 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. క్యూర్ యాక్ట్ –2026 ప్రకారం అనుమతి లేని నిర్మాణాలను నిషేధిత జాబితాలోకి తీసుకెళ్లే వీలుందని ఆమె వివరించారు. ఒకసారి ఆస్తి 22-ఏ పరిధిలోకి వెళ్తే దాని రిజిస్ట్రేషన్, క్రయవిక్రయాలు, బదలాయింపులపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు చాలాచోట్ల ముందుగా నిర్మాణం పూర్తి చేసి.. తర్వాత అనుమతులు, క్రమబద్ధీకరణ కోసం ప్రయత్నించే ధోరణి కనిపించేది. ఇక అలాంటి వారికి ఇది గట్టి హెచ్చరికగా మారనుంది. అనుమతి లేకుండా నిర్మాణం చేస్తే ఏదో ఒక దశలో అది అధికారుల దృష్టికి వస్తుంది. అప్పుడు చర్యలు తప్పవు అన్న సందేశాన్ని కమిషనర్ స్పష్టంగా ఇచ్చారు.


40 రోజుల్లో 398 అక్రమ నిర్మాణాల కూల్చివేత

అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే చర్యలు కొనసాగుతున్నాయని సృజన తెలిపారు. గత 40 రోజుల్లో 16 సర్కిళ్ల పరిధిలో 398 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు చెప్పారు. మూడు జోన్ల పరిధిలో నిర్వహించిన పరిశీలనల్లో సుమారు 2,700 భవనాలను గుర్తించినట్లు వెల్లడించారు. వాటిలో అనుమతి ఉన్నవి ఎన్ని, అనుమతి లేనివి ఎన్ని, అనుమతికి మించి అదనపు అంతస్తులు కట్టినవి ఎన్ని, నివాస అనుమతితో వాణిజ్య వినియోగం చేస్తున్నవి ఎన్ని  అనే అంశాలను వర్గీకరిస్తున్నట్లు తెలిపారు. గురుకుల్ ట్రస్ట్, అయ్యప్ప సొసైటీ, టీఎన్జీవోస్ కాలనీ తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అంటే ఇకపై నోటీసు ఇచ్చారు తర్వాత మరిచిపోయారు అనే పరిస్థితి కాకుండా, గుర్తింపు నుంచి కూల్చివేత వరకు ఒకే విధానం అమలు చేయాలన్న దిశగా సీఎంసీ వెళ్తోందన్నారు.


అక్రమ నిర్మాణాలకు పన్నుతో పాటు భారీ జరిమానా

అనుమతులు లేకుండా లేదా అనుమతికి విరుద్ధంగా నిర్మించిన భవనాల విషయంలో సాధారణ పన్నుతో సరిపెట్టే పరిస్థితి ఉండదని కమిషనర్ సంకేతాలు ఇచ్చారు. అలాంటి భవనాలపై సాధారణ ఆస్తిపన్నుకు అదనంగా 25 శాతం నుంచి 300 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు. కానీ జరిమానా చెల్లించడం అంటే అక్రమ నిర్మాణం క్రమబద్ధీకరించబడిందని భావించరాదని స్పష్టం చేశారు. ఇది అత్యంత కీలక అంశం. ఎందుకంటే గతంలో చాలామంది  పెనాల్టీ పన్ను కడుతున్నాం కాబట్టి భవనం చట్టబద్ధమే అన్న భావనలో ఉండేవారు. ఇక ఆ అపోహకు కూడా తెరపడే అవకాశం ఉంది.


నివాస అనుమతితో స్కూల్‌, హాస్టల్‌?.. ఇక ప్రత్యేక తనిఖీలు

కార్పొరేట్ విద్యాసంస్థలు, ప్రైవేట్ హాస్టళ్ల విషయంలో కూడా సీఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. నివాస అవసరాల కోసం అనుమతి తీసుకున్న భవనాల్లో కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, విద్యాసంస్థలు అనుమతించిన వినియోగానికి అనుగుణంగా నడుస్తున్నాయని, ప్రైవేట్ హాస్టళ్లకు అవసరమైన భవన అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. భవనానికి ఒక వినియోగానికి అనుమతి తీసుకుని మరో వినియోగం చేస్తే అది నిబంధనలకు విరుద్ధమవుతుందని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యేకంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉండే కార్పొరేట్ విద్యాసంస్థలు, హాస్టళ్ల విషయంలో భవన భద్రత, అనుమతులు, వినియోగ స్వరూపం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి.


చెత్త సేకరణకు విడిగా డబ్బులు వద్దు.. ప్రతి ఇంటికి  క్యూ‌ఆర్ కోడ్‌.. 

ఇంటింటి చెత్త సేకరణ విషయంలోనూ కమిషనర్ కీలక స్పష్టత ఇచ్చారు. పారిశుద్ధ్య సేవలకు సంబంధించిన రుసుము ఆస్తిపన్నులోనే వసూలు చేస్తున్నందున, చెత్త సేకరణ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు విడిగా నగదు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. చాలాచోట్ల ఇంటింటి చెత్త సేకరణకు నెలవారీగా డబ్బులు తీసుకుంటున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. సేవకు ఇప్పటికే పన్ను రూపంలో డబ్బు చెల్లిస్తుంటే అదే సేవకు మళ్లీ వ్యక్తిగతంగా వసూలు చేయడం సరైంది కాదన్న సంకేతాన్ని సీఎంసీ కమిషనర్ ఇచ్చారు. చెత్త సేకరణ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు క్యూ‌ఆర్  కోడ్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ తీసుకురావాలని యోచిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించారా,
ఏ రోజు సేకరించారు, ఏ వాహనం వెళ్లింది, ఏ ప్రాంతంలో సేవ నిలిచిపోయింది అనే వివరాలను డిజిటల్‌గా ట్రాక్ చేసే విధానం అమలు చేయాలని ప్రణాళిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. చెత్త తరలింపు కేంద్రాల్లో డిజిటల్ వెయ్‌బ్రిడ్జిలు ఏర్పాటు చేసి, ఎంత చెత్త వచ్చింది? ఎంత తరలించారు? అన్న లెక్కలను కూడా పర్యవేక్షించాలని భావిస్తున్నట్లు తెలిపారు.


చెత్త సేకరణకు 3,500–4,000 ఈ-వాహనాలు

పారిశుద్ధ్య వ్యవస్థలో మరో పెద్ద మార్పుగా 3,500 నుంచి 4,000 వరకు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలని సీఎంసీ ఆలోచిస్తుందని చెత్త సేకరణ, రవాణా కోసం పెద్ద సంఖ్యలో ఈ వాహనాలను వినియోగించడం ద్వారా ఇంధన వ్యయం తగ్గడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.  సీఎంసీ పరిధి విస్తృతంగా ఉండటంతో ప్రతి కాలనీ, బస్తీ, గేటెడ్ కమ్యూనిటీ వరకు సమయానికి చెత్త సేకరణ జరగాలంటే వాహనాల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని కమిషనర్ వివరించారు.


వన్ డే–వన్ వార్డ్.. 1,881 సమస్యల గుర్తింపు

ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగి ఫిర్యాదులు చేయాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు వన్ డే–వన్ వార్డ్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు కమిషనర్  సృజన తెలిపారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో 1,881 సమస్యలను గుర్తించినట్లు, అందులో 423 సమస్యలను పరిష్కరించినట్లు వెల్లడించారు. మరో 712 సమస్యలు పెండింగ్‌లో ఉండగా, 473 పనులు పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు, పారిశుద్ధ్యం, ఆక్రమణలు, మౌలిక వసతులు తదితర అంశాలను అధికారులు నేరుగా వార్డుల్లోకి వెళ్లి గుర్తించే విధానమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.


కార్యాలయంలో కూర్చుని కాదు.. క్షేత్రస్థాయిలో పాలన

సీఎంసీ కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో ప్రజలకు చేరువైన పాలన అందించడమే లక్ష్యమని కమిషనర్ పేర్కొన్నారు. ఫిర్యాదు వచ్చిన తర్వాత స్పందించడం కాకుండా, అధికారులు ముందుగానే సమస్యలను గుర్తించాలన్నదే ‘వన్ డే–వన్ వార్డ్’ ఉద్దేశమని వివరించారు. ప్రతి వార్డులో మౌలిక వసతుల స్థితి, పారిశుద్ధ్యం, రోడ్లు, అక్రమ ఆక్రమణలు, భవన నిర్మాణాలు వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చెప్పారు.


రోడ్లు, ఫుట్‌పాత్‌లలో కొత్త సాంకేతికత

పట్టణ మౌలిక వసతుల్లో కొత్త సాంకేతికతను ఉపయోగించేందుకు కూడా సీఎంసీ ప్రయత్నిస్తోంది. వ్యర్థ పదార్థాలతో రోడ్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, వేస్ట్ టైర్ల వినియోగం, పర్యావరణహిత నిర్మాణ పద్ధతులు వంటి అంశాలపై ప్రయోగాలు చేస్తున్నట్లు కమిషనర్ వివరించారు. కొత్త ఆవిష్కరణలను అమలు చేసేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు.


గ్రీన్ బిల్డింగ్‌.. నెట్ జీరోపై దృష్టి

భవిష్యత్ నిర్మాణాల్లో గ్రీన్ బిల్డింగ్, నెట్ జీరో బిల్డింగ్ విధానాలను ప్రోత్సహించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. నీటి వినియోగం, విద్యుత్ వినియోగం, వర్షపు నీటి సంరక్షణ, వ్యర్థ నిర్వహణ, పర్యావరణహిత నిర్మాణ పదార్థాల వినియోగం వంటి అంశాలను భవిష్యత్తులో మరింత ప్రాధాన్యంతో చూడనున్నట్లు తెలిపారు. వేగంగా విస్తరిస్తున్న సైబరాబాద్ ప్రాంతంలో భవన నిర్మాణం మాత్రమే కాకుండా, ఆ నిర్మాణం నగరంపై ఎంత భారం పెడుతోంది అన్నది కూడా పరిగణనలోకి తీసుకునే విధానానికి మారాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.


గెజిట్‌ నుంచి గ్రౌండ్‌ వరకు.. ఇప్పుడు అసలు పరీక్ష

ప్రభుత్వం మూడు కార్పొరేషన్లకు క్యూర్ యాక్ట్  అమలు దిశగా గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో సీఎంసీ ముందున్న సవాలు చిన్నది కాదు.  ఒకవైపు వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు.. మరోవైపు వేగంగా పెరుగుతున్న జనాభా.. ట్రాఫిక్, చెత్త, రోడ్లు, డ్రైనేజీ, విద్యాసంస్థలు, హాస్టళ్లు, ఆస్తిపన్ను వంటి ఎన్నో అంశాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. కమిషనర్ వెల్లడించిన ప్రణాళికలు కాగితంపై చూస్తే బలంగానే ఉన్నాయి. కానీ ప్రజలకు కావాల్సింది ప్రకటనలు కాదు.. క్షేత్రస్థాయిలో ఒకే నిబంధన అందరికీ సమానంగా అమలు కావడం.

చిన్న ఇంటిపై వెంటనే చర్యలు తీసుకుని.. పెద్ద అక్రమ నిర్మాణాలను వదిలేస్తే కొత్త చట్టం లక్ష్యం నెరవేరదు. నివాస అనుమతితో నడిచే చిన్న వ్యాపారాన్ని మూసివేసి.. పెద్ద కార్పొరేట్ సంస్థను వదిలేస్తే ప్రజల్లో నమ్మకం రాదు. అందుకే క్యూర్ యాక్ట్  అమలులో సీఎంసీకి ఇప్పుడు అత్యంత కీలకమైనది పారదర్శకత, సమాన అమలు, వేగవంతమైన చర్యలు. గెజిట్ వచ్చింది.. నిబంధనలు వచ్చాయి.. కమిషనర్ కార్యాచరణను ప్రకటించారు.
ఇక ప్రజలు చూస్తున్నది ఒక్కటే మాటల్లో చెప్పిన కఠిన పాలన క్షేత్రస్థాయిలోనూ కనిపిస్తుందా?


Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder