ASTHRAM DAILY
Telangana

గాంధీనగర్‌లో అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండీఏ నజర్‌!

గాంధీనగర్‌లో అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండీఏ నజర్‌!
సిఫారసులు చేసినా వదిలేది లేదు.. అధికారుల హెచ్చరిక!

 - గాంధీనగర్‌లో నిర్మాణాలను పరిశీలించిన హెచ్‌ఎండీఏ అధికారులు
- పత్రికల్లో వరుస కథనాలతో కదిలిన యంత్రాంగం
- శాఖల సమన్వయంతో సమగ్ర సర్వే.. ఆక్రమణలపై చర్యలకు సిద్ధం

సామాన్యుడి అస్త్రం / బొల్లారం : బొల్లారం డివిజన్‌ పరిధిలోని గాంధీనగర్‌లో అనుమతుల్లేని నిర్మాణాలు, స్థలాల ఆక్రమణల ఆరోపణలపై ఎట్టకేలకు హెచ్‌ఎండీఏ అధికారులు స్పందించారు. శుక్రవారం గాంధీనగర్‌లో పర్యటించిన అధికారులు హెచ్‌ఎండీఏ పరిధిలోని భూముల్లో చేపట్టిన నిర్మాణాలను పరిశీలించారు. అనుమతులు లేకుండా స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలపై ఆరా తీశారు. నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరి సిఫారసులతో నిర్మాణాలు చేపట్టినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

వరుస కథనాలతో కదిలిన అధికారులు!

గాంధీనగర్‌లో భూముల ఆక్రమణలు, అనుమతుల్లేని నిర్మాణాలపై గత కొన్ని నెలలుగా పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా? నిబంధనల ప్రకారమే పనులు జరుగుతున్నాయా? అనే అంశాలను పరిశీలించారు. గుర్తించిన అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు.



సమగ్ర సర్వేతో ఆక్రమణల లెక్క తేలుస్తారా?

ఈ ప్రాంతంలోని భూములు, నిర్మాణాలపై స్పష్టత తీసుకురావడానికి వివిధ శాఖల అధికారుల సమన్వయంతో సమగ్ర సర్వే నిర్వహిస్తామని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. సర్వే అనంతరం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. హెచ్‌ఎండీఏ అధికారులు సుబ్రహ్మణ్యేశ్వరరావు, దివ్యారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే నెలల తరబడి వినిపిస్తున్న ఆక్రమణల ఆరోపణలపై ఈ పర్యటనతోనైనా స్పష్టత వస్తుందా? సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా? లేక పరిశీలనకే పరిమితమవుతారా? అన్నది వేచి చూడాల్సిందే.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder