- బల్దియాపై తంగేడు జెండా ఎగరేస్తాం.. రేవంత్ సర్కారుపై కల్వకుంట్ల కవిత ధ్వజం
- రూ.11 వేల కోట్ల బడ్జెట్ ఉన్నా అభివృద్ధి ఎక్కడ?.. నకిలీ సమ్మిట్లతో ఎన్ని ఉద్యోగాలిచ్చారని నిలదీత
- చెత్త సేకరణ కార్మికుల ఉపాధి దెబ్బతీస్తే సీఎం ఇంటి ముందు చెత్త పోస్తామని హెచ్చరిక
- ప్రతి డివిజన్లో 24 గంటల ఆసుపత్రి.. ఐటీ ఉద్యోగులకు ప్రత్యేక పాలసీ.. మియాపూర్ రాజధాని రణభేరిలో హామీలు
సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్ బ్యూరో : విశ్వనగరమంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్ప హైదరాబాద్‌లో సామాన్యుడికి కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ మురికి నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఉందని, రక్షిత మంచినీళ్లే అందించలేని ప్రభుత్వం నగరాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్తామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. వేల కోట్ల బడ్జెట్ ఉన్నా అభివృద్ధి కనిపించడం లేదని, పెట్టుబడుల పేరుతో పెద్దపెద్ద సదస్సులు నిర్వహించడం తప్ప యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదని విమర్శించారు. శుక్రవారం మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రాజధాని రణభేరి’ సదస్సులో ఆమె ప్రసంగించారు. నగరంలోని మంచినీటి సమస్యలు, పారిశుధ్య కార్మికుల ఉపాధి, ఐటీ ఉద్యోగుల భద్రత, ప్రభుత్వ పెట్టుబడుల విధానాలపై మాట్లాడిన కవిత.. రాబోయే బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని ప్రకటించారు.
వేల కోట్ల బడ్జెట్.. కనీస సౌకర్యాలేవి?
జీహెచ్ఎంసీ పరిధిలో రూ.11 వేల కోట్ల బడ్జెట్ ఉన్నా ప్రజలకు అవసరమైన కనీస వసతులు కల్పించడం లేదని కవిత విమర్శించారు. ఒకవైపు వీధికుక్కల బెడద, మరోవైపు దోమల సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పలు ప్రాంతాల్లో మంచినీరు, పారిశుధ్యం వంటి కనీస అవసరాలు కూడా తీరడం లేదని పేర్కొన్నారు. నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పే పాలకులు ముందుగా సామాన్యుడి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. చరిత్ర తెలియని వాళ్లు నగర భవిష్యత్తును నిర్మించలేరని వ్యాఖ్యానించారు. నిజాం పాలనలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయని గుర్తుచేశారు. ప్రజలకు ఉపయోగపడని ప్రచార కార్యక్రమాల కంటే మానవత్వంతో కూడిన అభివృద్ధి అవసరమన్నారు.
50 వేల మంది కార్మికుల పొట్టగొడతారా?
హైదరాబాద్‌లో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్న సుమారు 50 వేల మంది కార్మికుల ఉపాధిని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. చెత్త సేకరణ బాధ్యతలను రాంకీ సంస్థకు అప్పగించే పేరుతో కార్మికులను తొలగించాలని చూస్తున్నారని విమర్శించారు. ఏళ్ల తరబడి ఇదే పనిపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్న ఆటో కార్మికులను రోడ్డున పడేయడం అన్యాయమన్నారు. కార్మికుల పొట్టగొట్టే నిర్ణయాలు తీసుకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి ముందు చెత్త పారబోసి నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. పారిశుధ్య వ్యవస్థను మార్చే ముందు అందులో పనిచేస్తున్న కార్మికుల ఉపాధికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.

పెట్టుబడులంటున్నారు.. ఉద్యోగాల లెక్క చెప్పరేం?
గ్లోబల్ సమ్మిట్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని కవిత ఆరోపించారు. వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం.. వాస్తవంగా ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఎన్ని పరిశ్రమలు ప్రారంభమయ్యాయి? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? అనే వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నకిలీ కంపెనీలు, ఒప్పందాల పేరుతో పెట్టుబడులు వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమల పేరుతో రైతుల భూములు తీసుకుంటున్నా యువతకు ఉపాధి కల్పించడం లేదని విమర్శించారు. భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి పేరును ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే సదస్సులను అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రచార ఆర్భాటాలు కాదని, ఉద్యోగాలు, ఉపాధి కల్పించే కార్యక్రమాలు కావాలని డిమాండ్ చేశారు.
ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేక విధానం ఏది?
హైదరాబాద్ అభివృద్ధిలో ఐటీ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని కవిత పేర్కొన్నారు. వేలాది మంది ఉద్యోగుల కృషితోనే నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. వారి తెలివితేటలు, నైపుణ్యానికి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నా ఉద్యోగుల భవిష్యత్తు, ఉద్యోగ భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక విధానం లేకపోవడం బాధాకరమన్నారు. ఐటీ రంగంలో పనిచేస్తున్న వారి ప్రయోజనాలను కాపాడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పాలసీ తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఓట్లకు బాటిళ్లు.. ప్రజలకు ఆసుపత్రులు వద్దా?
ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బులు, మద్యం ఖర్చు చేసే నాయకులు ప్రజల ఆరోగ్యాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని కవిత ప్రశ్నించారు. ప్రతి వెయ్యి మందికి అవసరమైన వైద్యం, మందులు అందుబాటులో ఉండాలని అన్నారు. రాబోయే బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్కు అవకాశం కల్పిస్తే ప్రతి డివిజన్లో ఒక ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ ఆసుపత్రుల్లో 24 గంటలూ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందించే విధానాల కోసం కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై పాలకులు దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. బియ్యం సహా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా వాటిని నియంత్రించే చర్యలు కనిపించడం లేదని మండిపడ్డారు.

పసుపు జెండా కాదు.. తంగేడు పువ్వు రంగు!
తమ పార్టీ జెండాపై జరుగుతున్న చర్చకు కవిత సమాధానమిచ్చారు. తమది పసుపు జెండా కాదని, తెలంగాణ ప్రత్యేకతను చాటే తంగేడు పువ్వు రంగు జెండా అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎవరికివారు తామే గొప్పవాళ్లమని చెప్పుకుంటున్నారని విమర్శించారు. రాజకీయాల్లో పదవుల కంటే ప్రజల కోసం పనిచేయడమే ముఖ్యమని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని, భవిష్యత్తులో వారే ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎదుగుతారని చెప్పారు. ఎన్నికల్లో ఓట్లు వేసేటప్పుడు ప్రతి ఓటుకు ఒక బాటిల్, ప్రతి వెయ్యి ఓట్లకు ఒక ఆసుపత్రి ఎందుకు ఉండకూడదని ప్రశ్నిస్తూ ప్రజలకు మేలు చేసే రాజకీయాలు అవసరమన్నారు.
బల్దియా ఎన్నికలే లక్ష్యం.. శ్రేణులకు దిశానిర్దేశం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని కవిత పిలుపునిచ్చారు. మంచినీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, ఉపాధి వంటి సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు. నగర ప్రజల అవసరాలను ప్రధాన ఎజెండాగా చేసుకుని ఎన్నికలను ఎదుర్కొంటామని తెలిపారు. బల్దియాపై తంగేడు పువ్వు రంగు జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ అధ్యక్షుడు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.