ASTHRAM DAILY
Telangana

సరాకలో గ్యాస్‌ లీక్‌.. ఇద్దరి ప్రాణాలు బలి!

సరాకలో గ్యాస్‌ లీక్‌.. ఇద్దరి ప్రాణాలు బలి!
  • మృతుల కుటుంబాలకు రూ.70 లక్షల చొప్పున పరిహారం
  • కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకోం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
  • క్లోరోఫామ్‌ లీకేజీతో విషాదం.. పలువురు కార్మికులకు అస్వస్థత
  • సిగాచి ఘటన నుంచి గుణపాఠం నేర్చుకోరా?.. భద్రతా లోపాలపై సమగ్ర విచారణకు డిమాండ్

సామాన్యుడి అస్త్రం / జిన్నారం : పరిశ్రమల లాభాల కోసం కార్మికుల ప్రాణాలను పణంగా పెడితే సహించేది లేదని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హెచ్చరించారు. గడ్డపోతారం పారిశ్రామికవాడలోని సరాక పరిశ్రమలో క్లోరోఫామ్‌ లీకై ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగాచి పరిశ్రమ ప్రమాదం మిగిల్చిన విషాదం మరువకముందే మరో పరిశ్రమలో కార్మికులు బలికావడం ఆందోళనకరమన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కార్మికుల భద్రతను గాలికొదిలేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన పరిశ్రమ యాజమాన్యం, సంబంధిత అధికారులతో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు.

నైట్‌ షిఫ్ట్‌లో విషాదం.. ఇద్దరి మృతి

గడ్డపోతారం పారిశ్రామికవాడలోని సరాక పరిశ్రమలో గురువారం అర్ధరాత్రి సమయంలో క్లోరోఫామ్‌ లీకేజీ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుదర్శన్‌రావు, బాలాజీ అనే ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన సమయంలో నైట్‌ షిఫ్ట్‌లో సుమారు 48 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు సమాచారం. మరో ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందినట్లు తెలిసింది. వీరిలో ఒకరు శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రమాదానికి అసలు కారణమేంటి? గ్యాస్‌ లీకేజీని ముందుగానే గుర్తించే రక్షణ వ్యవస్థలు ఉన్నాయా? అత్యవసర పరిస్థితుల్లో కార్మికులను కాపాడే ఏర్పాట్లు చేశారా? అన్న అంశాలపై సమగ్ర విచారణ జరగాలని ఎమ్మెల్యే కోరారు.

మృతుల కుటుంబాలకు రూ.70 లక్షల పరిహారం

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.70 లక్షల చొప్పున పరిహారం, అంత్యక్రియల ఖర్చుల కోసం అదనంగా రూ.లక్ష చొప్పున అందించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, చికిత్స విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని పరిశ్రమ యాజమాన్యానికి సూచించారు.

సిగాచి ప్రమాదం తర్వాతైనా మారరా?

సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోందని ఎమ్మెల్యే అన్నారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. ప్రమాదాలను నివారించేందుకు అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచించారు. సరాక ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లలో లోపాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నెహ్రూ, కమిషనర్‌ పి.తాన్య, డీఎస్పీ, సీఐలు, తహసీల్దార్‌ ఆంటోనీ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మహేందర్‌గౌడ్‌, స్థానిక నాయకులు ప్రకాశంచారి, గద్దె గణేష్‌, కుమార్‌ యాదవ్‌, పెంటేష్‌, పరిశ్రమ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder