Lands & Encroachments

కదిలిన రెవెన్యూ.. మూడు బేస్‌మెంట్లు నేలమట్టం!

కదిలిన రెవెన్యూ.. మూడు బేస్‌మెంట్లు నేలమట్టం!
  • సర్వే నంబర్‌ 472లో మూడు బేస్‌మెంట్ల కూల్చివేత
  • తహశీల్దార్‌ రాజేశ్వర్‌రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ చర్యలు
  • ప్లాట్లు కొనవద్దని ప్రజలకు హెచ్చరిక.. బోర్డులు, ఫెన్సింగ్‌కు ఏర్పాట్లు

సామాన్యుడి అస్త్రం, గండిమైసమ్మ :  గండిమైసమ్మ–దుండిగల్‌ మండలం బౌరంపేట్‌ గ్రామ సర్వే నంబర్‌ 472లోని ప్రభుత్వ భూములపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్నట్లు గుర్తించిన మూడు బేస్‌మెంట్లను తాజాగా కూల్చివేశారు. దుండిగల్‌ తహశీల్దార్‌ ఎన్‌.రాజేశ్వర్‌రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది ఈ చర్యలు చేపట్టారు. సర్వే నంబర్‌ 472లో ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ లేఅవుట్లు, నోటరీ పత్రాలతో ప్లాట్ల విక్రయాలు జరుగుతున్నాయంటూ ‘ప్రభుత్వ భూములకు రక్షణేది..? కబ్జాదారులకు అడ్డేది..?’ శీర్షికన ‘పెన్ పవర్’ దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై సామాజిక కార్యకర్త ఆకుల సతీష్‌ తహశీల్దార్‌కు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టినట్లు సమాచారం. తెలంగాణ హౌసింగ్‌ బోర్డుకు కేటాయించినట్లు చెబుతున్న భూమిలో అక్రమంగా లేఅవుట్‌ రూపొందించి, తక్కువ ధరలకు ప్లాట్లు ఇస్తామంటూ పేద, మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరైన యాజమాన్య పత్రాలు లేకుండా నోటరీల ఆధారంగా విక్రయాలు జరిపినట్లు వచ్చిన ఫిర్యాదులపైనా సమగ్ర విచారణ అవసరమని స్థానికులు కోరుతున్నారు.

Image

కూల్చివేతతో సరిపెడతారా.. కేసులు ఎప్పుడు?

మూడు బేస్‌మెంట్లను కూల్చివేయడం ఆక్రమణదారులకు హెచ్చరికగా మారినప్పటికీ, నిర్మాణాలు చేపట్టిన వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆకుల సతీష్‌ డిమాండ్‌ చేశారు. కేవలం నిర్మాణాలను తొలగించడంతో సమస్య ముగియదని, లేఅవుట్‌ వేసినవారు, ప్లాట్లు విక్రయించినవారు, వారికి సహకరించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. సర్వే నంబర్‌ 472లోని భూమిని తెలంగాణ హౌసింగ్‌ బోర్డు అధికారులు పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు. భూమి చుట్టూ హెచ్చరిక బోర్డులు, శాశ్వత ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే నంబర్‌లో ఎవరూ ప్లాట్లు కొనుగోలు చేయవద్దని తహశీల్దార్‌ రాజేశ్వర్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొనుగోలుకు ముందు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, హౌసింగ్‌ బోర్డు రికార్డులను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.


No older articles in this category.
No newer articles in this category.
Advertisement 728 x 90 Banner Placehoder