- పైలట్ పరీక్షల కోసం మొత్తం 200 కోట్ల నోట్ల ముద్రణకు అనుమతి
- రూ.200 కోట్ల విలువ కాదు.. ముఖ విలువ రూ.3,000 కోట్లు
- కాగితపు నోట్లు రద్దుకావు.. వాటితోపాటే పాలిమర్ నోట్ల చలామణి
సామాన్యుడి అస్త్రం / న్యూఢిల్లీ : భారత కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పునకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రూ.10, రూ.20 డినామినేషన్లలో పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా ముద్రించి, క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకుకు అనుమతి ఇచ్చింది. సాధారణ కాగితానికి బదులుగా బలమైన పాలిమర్ మెటీరియల్‌తో వీటిని రూపొందించనున్నారు.
రూ.200 కోట్లు కాదు.. 200 కోట్ల నోట్లు!
సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్నట్లు రూ.200 కోట్ల విలువైన నోట్లు కాదు. రూ.10 నోట్లు 100 కోట్లు, రూ.20 నోట్లు మరో 100 కోట్లు చొప్పున మొత్తం 200 కోట్ల నోట్లను ముద్రించేందుకు అనుమతి లభించింది. వీటి మొత్తం ముఖ విలువ రూ.3,000 కోట్లుగా ఉంటుంది. ఈ నోట్లను ఒకేసారి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విడుదల చేయకుండా ముందుగా క్షేత్రస్థాయి పరీక్షలకు వినియోగించనున్నారు. ప్రజల వినియోగంలో మన్నిక, ఏటీఎం–నగదు లెక్కింపు యంత్రాల్లో పనితీరు, భద్రతా లక్షణాలు, వాతావరణ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని ఆర్‌బీఐ పరిశీలించనుంది.
2027లో చలామణి.. పేపర్ నోట్లు కొనసాగింపు
2027–28 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పాలిమర్ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. అయితే 2027 ఏప్రిల్ నుంచే దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి అమలు జరుగుతుందని ఖచ్చితమైన తేదీని ఆర్‌బీఐ ప్రకటించలేదు. పైలట్ పరీక్షల ఫలితాల ఆధారంగానే తదుపరి విస్తరణపై నిర్ణయం తీసుకోనుంది. పాలిమర్ నోట్లు నీరు, తేమ, మురికి, చిరుగుదలకు ఎక్కువకాలం తట్టుకునే అవకాశం ఉంది. ప్రత్యేక పారదర్శక విండో, మెటాలిక్ సంఖ్యలు, అధునాతన భద్రతా గుర్తులతో నకిలీ నోట్ల తయారీని కష్టతరం చేయనున్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను రద్దుచేసే ప్రతిపాదన లేదని కేంద్రం స్పష్టం చేసింది.