- జీఎస్ఎం మాల్ వద్ద బెలూన్లు నింపుతుండగా హీలియం గ్యాస్ సిలిండర్ పేలుడు
- సిలిండర్ శకలం తగిలి ఐస్‌క్రీమ్ వ్యాపారి కుడికాలి పాదం తెగిపడిన దారుణం
- విద్యార్థిని సహా మరో నలుగురికి గాయాలు.. ధ్వంసమైన కారు అద్దాలు
సామాన్యుడి అస్త్రం / మియాపూర్ : హైదరాబాద్–ముంబై జాతీయ రహదారి పక్కన ఉన్న మియాపూర్ జీఎస్ఎం మాల్ సమీపంలో శనివారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. బెలూన్లలో గ్యాస్ నింపేందుకు ఉపయోగిస్తున్న హీలియం సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఒకరి కుడికాలి పాదం తెగిపడగా, మరో నలుగురు గాయపడ్డారు. పేలుడు శబ్దం, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా భయానకంగా మారింది.
సాయంత్రం 4.30 గంటలకు భారీ శబ్దం!
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అవినాష్ జీఎస్ఎం మాల్ వద్ద సైకిల్‌పై హీలియం గ్యాస్ సిలిండర్ పెట్టుకొని బెలూన్లు విక్రయిస్తున్నాడు. శనివారం సాయంత్రం సుమారు 4.30 గంటలకు బెలూన్లలో గ్యాస్ నింపుతున్న సమయంలో సిలిండర్ అకస్మాత్తుగా భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు ధాటికి సిలిండర్ ముక్కలు చుట్టుపక్కలకు దూసుకెళ్లాయి.
శకలం తగిలి పాదం తెగింది!
సమీపంలో ఐస్‌క్రీమ్ విక్రయిస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివేక్‌పాల్ కుడికాలికి సిలిండర్ శకలం బలంగా తగిలింది. ప్రమాద తీవ్రతకు అతడి కుడికాలి పాదం తెగిపడి తీవ్ర రక్తస్రావం జరిగింది. రక్తపు మడుగులో పడిపోయిన వివేక్‌పాల్‌ను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అతడిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
స్కూటీదారుడు.. విద్యార్థిని.. మహిళకు గాయాలు
పేలుడు సమయంలో స్కూటీపై జీఎస్ఎం మాల్‌కు వెళ్తున్న కొండాపూర్‌కు చెందిన ఎం.జనార్దన్‌కు సిలిండర్ ముక్కలు తగిలి కాలికి గాయమైంది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ధనుష అనే విద్యార్థినికి స్వల్ప గాయాలయ్యాయి. షాపింగ్ కోసం మాల్‌కు వచ్చిన విన్నకొండ సింధూప్రియ కారులో కూర్చున్న సమయంలో పేలుడు సంభవించింది.
పేలుడు ధాటికి పగిలిన కారు అద్దాలు
సిలిండర్ పేలుడు ధాటికి సింధూప్రియ కారు అద్దాలు ఒక్కసారిగా పగిలిపోయాయి. అద్దాల ముక్కలు తగలడంతో ఆమె కూడా గాయపడింది. పేలుడు ప్రాంతంలో ఉన్నవారు ప్రాణభయంతో పరుగులు తీశారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సురక్షిత ప్రాంతానికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
అవినాష్ చేతికీ గాయం
సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆసుపత్రులకు తరలించారు. బెలూన్లు విక్రయిస్తున్న అవినాష్ చేతికి కూడా గాయమైనట్లు మియాపూర్ ఇన్‌స్పెక్టర్ జయరాం తెలిపారు. ప్రమాదం అనంతరం అతడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.
జనసంచారం అధికంగా ఉండే మాల్ పరిసరాల్లో ప్రమాదకర గ్యాస్ సిలిండర్ల వినియోగంపై పర్యవేక్షణ ఉందా? సిలిండర్ నాణ్యత, అనుమతులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారా? అనే ప్రశ్నలు ఈ ఘటనతో తెరపైకి వచ్చాయి. పేలుడుకు కారణమైన అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
