Telangana

సర్కారీ భూమిలో నిర్మాణాల దూకుడు.. అధికారులు చూస్తూ ఊరుకుంటారా?

సర్కారీ భూమిలో నిర్మాణాల దూకుడు.. అధికారులు చూస్తూ ఊరుకుంటారా?
  • సర్వే నంబర్‌ 151 ప్రభుత్వ భూమేనని అధికారుల నివేదికలు తేల్చాయని వాదన
  • కొనసాగుతున్న నిర్మాణాలను నిలిపివేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌
  • జీహెచ్‌ఎంసీ అనుమతుల రద్దుకు లేఖ రాస్తామని తహసీల్దార్‌ హామీ
సామాన్యుడి అస్త్రం / హఫీజ్‌పేట్ : ప్రభుత్వ భూమిగా గుర్తించిన ప్రాంతంలో నిర్మాణాలు ఎలా కొనసాగుతున్నాయంటూ ‘జనం కోసం’ సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి రెవెన్యూ అధికారులను నిలదీశారు. హఫీజ్‌పేట్‌ పరిధిలోని రేగులకుంట, సర్వే నంబర్‌ 151లో ఉన్న ప్రభుత్వ భూమిని పరిరక్షించడంతోపాటు అక్రమ నిర్మాణాలకు బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
సర్వే నంబర్‌ 151లోని రేగులకుంట ప్రభుత్వ భూమేనని తహసీల్దార్‌, ఆర్డీవోతోపాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారుల నివేదికల్లోనూ నిర్ధారణ అయినట్లు భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల నివేదికలు స్పష్టంగా ఉన్నప్పటికీ అక్కడ నిర్మాణాలు కొనసాగడం వెనుక కారణాలేమిటని ప్రశ్నించారు. అధికారులు సకాలంలో స్పందించకపోతే విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.



నివేదికలున్నా చర్యలెక్కడ?
ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన తర్వాత కూడా నిర్మాణాలు నిలిచిపోకపోవడం రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారుల పనితీరుపై అనుమానాలకు తావిస్తోందని భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. క్షేత్రస్థాయిలో వెంటనే సర్వే నిర్వహించి హద్దులను నిర్ధారించాలని, జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేయడంతోపాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణ కేవలం నివేదికలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కనిపించాలని ఆయన స్పష్టం చేశారు. అనుమతులు ఎవరు ఇచ్చారు, ఏ పత్రాల ఆధారంగా ఇచ్చారు, నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు అడ్డుకోలేదనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.


అనుమతుల రద్దుకు లేఖ
ఈ విషయాన్ని శేరిలింగంపల్లి తహసీల్దార్‌ మహిపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో కార్యాలయం స్పందించినట్లు ‘జనం కోసం’ సంస్థ తెలిపింది. సంబంధిత నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరుతూ లేఖ రాస్తామని తహసీల్దార్‌ హామీ ఇచ్చినట్లు భాస్కర్‌రెడ్డి వెల్లడించారు.
నిర్మాణాలపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని పరిరక్షిస్తామని, ఈ వ్యవహారంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని తహసీల్దార్‌ తెలిపినట్లు పేర్కొన్నారు. సంబంధిత డిప్యూటీ తహసీల్దార్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే క్షేత్రస్థాయిలో నిర్మాణాలు నిలిచాయా, అనుమతుల రద్దు ప్రక్రియ ప్రారంభమైందా అనే విషయాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder