- 38 అనధికార నిర్మాణాలను గుర్తించిన సీఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు
- 28 భవనాలకు యూసీ నోటీసులు.. ఒక భవనం సీజ్
- అనుమతుల్లేని 9 నిర్మాణాల కూల్చివేత
సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్ : అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొరడా ఝళిపించింది. సీఎంసీ కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఒకేరోజు 38 అనధికార నిర్మాణంలో ఉన్న భవనాలను గుర్తించి చర్యలు చేపట్టాయి. వీటిలో తొమ్మిది భవనాలను కూల్చివేయగా, ఒక నిర్మాణాన్ని సీజ్ చేశారు. మరో 28 నిర్మాణాలకు యూసీ నోటీసులు జారీ చేశారు.
చిన్న స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తుల మీద అంతస్తులు నిర్మిస్తున్న వారితోపాటు, కనీస భవన నిర్మాణ అనుమతి లేకుండా పనులు కొనసాగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు నిర్వహించారు. 75 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న స్థలాల్లో ఏడు మీటర్లకు మించి ఎత్తుతో నిర్మిస్తున్న భవనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
అదేవిధంగా 75 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న స్థలాల్లో భవన నిర్మాణ అనుమతి లేకుండా చేపడుతున్న నిర్మాణాలను కూడా గుర్తిస్తున్నారు. అలాంటి భవనాల విషయంలో నిర్మాణ ఎత్తుతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని సీఎంసీ స్పష్టం చేసింది.
పౌరుల నుంచి అందుతున్న ఫిర్యాదులతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు క్షేత్రస్థాయిలో స్వయంగా నిర్వహిస్తున్న తనిఖీల ఆధారంగా అనధికార నిర్మాణాలను గుర్తిస్తున్నాయి. నిర్మాణ పనులు ప్రారంభ దశలో ఉన్నప్పుడే నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి అడ్డుకోవాలనే లక్ష్యంతో ఈ తనిఖీలను ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం వల్ల పట్టణ ప్రణాళిక అస్తవ్యస్తం కావడమే కాకుండా భవిష్యత్తులో భవనాల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. చిన్న స్థలాల్లో పరిమితికి మించి అంతస్తులు నిర్మిస్తే అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టడం కూడా కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించే నిర్మాణదారులపై ఉపేక్ష లేకుండా వ్యవహరించాలని కమిషనర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ఆదేశించారు.
కూల్చివేతలు, సీజ్‌లు, నోటీసుల జారీతో చర్యలు ముగిసినట్లు భావించకుండా, సంబంధిత భవనాల్లో నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమవుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. అక్రమ నిర్మాణాలపై చర్యలతోపాటు వాటికి సహకరించిన అధికారులు, సిబ్బంది పాత్రపైనా విచారణ జరపాలనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.
సీఎంసీ పరిధిలోని అనధికార నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడితే నోటీసులు, సీజ్‌లతోపాటు కూల్చివేత చర్యలు తప్పవని హెచ్చరించారు.