Hyderabad

ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు పెడితే ఇక భారీ జరిమానా!

ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు పెడితే ఇక భారీ జరిమానా!
ప్రకటన బోర్డులపై ఉక్కుపాదం.. అనుమతి లేకుంటే సీజ్‌!
• క్యూర్‌ పరిధిలో అక్రమ ప్రకటనలకు చెక్‌.. మూడు కార్పొరేషన్లలో కొత్త నిబంధనలు
• నిబంధనలు ఉల్లంఘిస్తే రోజుకు రూ.2 వేల నుంచి రూ.8 వేల వరకు జరిమానా
• ఫ్లెక్సీల ఏర్పాటుకు ఆన్‌లైన్‌ అనుమతి తప్పనిసరి.. ప్రతి బోర్డుపై క్యూఆర్‌ కోడ్‌, ప్రింటర్‌ ఐడీ ఉండాల్సిందే!

సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్‌ బ్యూరో :
నగరంలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే.. రోడ్డు పక్కన విద్యుత్‌ స్తంభాల నుంచి ప్రధాన కూడళ్ల వరకు, చెట్ల నుంచి ఫ్లైఓవర్ల వరకు ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ ప్రకటన బోర్డులు వెలుస్తున్నాయి. రాజకీయ నాయకుల పుట్టినరోజులు, శుభాకాంక్షలు, వ్యాపార ప్రకటనలు, కార్యక్రమాల ప్రచారాల పేరుతో రహదారులను ఫ్లెక్సీలతో నింపేస్తున్నారు. అనుమతులు ఉన్నాయా? ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయా? ట్రాఫిక్‌కు ఆటంకం ఏర్పడుతోందా? అనే విషయాలను పట్టించుకోకుండా సాగుతున్న ఈ వ్యవహారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పరిధిలో ప్రకటన బోర్డులు, ఫ్లెక్సీల ఏర్పాటుపై కఠిన ఆంక్షలు విధించింది. అనుమతి లేకుండా ఏర్పాటు చేసే ప్రకటనలను తొలగించడంతోపాటు భారీ జరిమానాలు విధించేలా నిబంధనలు రూపొందించింది. ఈ మేరకు మున్సిపల్‌ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ) పరిధుల్లో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

ఇక ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేరు!
ఇప్పటివరకు చాలాచోట్ల ప్రకటన బోర్డుల ఏర్పాటుపై సరైన నియంత్రణ లేకపోవడంతో ప్రధాన రహదారులు, కూడళ్లు, కాలనీల్లో ఫ్లెక్సీలు పెద్దఎత్తున దర్శనమిస్తున్నాయి. ఇకపై ఎవరికి నచ్చినచోట వారు బోర్డులు ఏర్పాటు చేయడానికి వీల్లేకుండా ప్రాంతాలవారీగా స్థలాలను గుర్తించనున్నారు.
ప్రకటనలను తాత్కాలిక, హైపర్‌ లోకల్‌ విభాగాలుగా వర్గీకరించారు. సంబంధిత మున్సిపల్‌ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే నిర్దేశించిన ప్రాంతాల్లో ప్రకటనలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
నిబంధనలు అమలు చేయడానికి ప్రతి వార్డుకు ప్రత్యేక నోడల్‌ అధికారిని నియమించనున్నారు. వార్డుల్లో తాత్కాలిక ప్రకటనల కోసం 5 నుంచి 10 స్థలాలు, హైపర్‌ లోకల్‌ ప్రకటనల కోసం 25 నుంచి 50 స్థలాలను గుర్తించనున్నారు.

మొబైల్‌ యాప్‌లో బుకింగ్‌.. అనుమతి ఉంటేనే బోర్డు!
ప్రకటనల ఏర్పాటులో పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. మై క్యూర్‌ (MyCURE) లేదా సంబంధిత అడ్వర్టైజింగ్‌ యాప్‌ ద్వారా ప్రకటనల స్థలాలను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
ఒక మొబైల్‌ నంబర్‌ నుంచి ఒకేసారి ఒక స్లాట్‌ మాత్రమే బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏడు రోజుల ముందుగా బుకింగ్‌ చేసుకునేందుకు వీలు కల్పించనున్నారు.
దరఖాస్తుదారులు సంబంధిత ప్రకటన వివరాలను నమోదు చేసి, అధికారుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. అనుమతి వచ్చిన తర్వాతే నిర్దేశించిన స్థలంలో ప్రకటన బోర్డు ఏర్పాటు చేసుకోవాలి.

బోర్డుపై క్యూఆర్‌ కోడ్‌ తప్పనిసరి!
ఇకపై ప్రకటన బోర్డు ఏర్పాటు చేస్తే దానిపై క్యూఆర్‌ కోడ్‌, ప్రింటర్‌ ఐడీ స్పష్టంగా కనిపించాలి.
ప్రకటనకు అనుమతి ఉందా? ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి అనుమతిచ్చారు? అనే వివరాలను అధికారులు పరిశీలించేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది.
ప్రకటన బోర్డు కుడివైపు దిగువ భాగంలో క్యూఆర్‌ కోడ్‌, ఎడమవైపు దిగువ భాగంలో ప్రింటర్‌ ఐడీ ఉండాలని నిబంధనలు పేర్కొంటున్నాయి.
అనుమతి పొందిన స్థలంలోనే బోర్డు ఏర్పాటు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవు.

చెట్లు.. విద్యుత్‌ స్తంభాలు.. ఫ్లైఓవర్లపై నిషేధం!
నగరంలో ప్రకటనల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించే పద్ధతులకు అడ్డుకట్ట వేసేందుకు కొన్ని ప్రాంతాలను పూర్తిగా నిషేధిత జాబితాలో చేర్చారు.
చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఫ్లైఓవర్లు, వారసత్వ కట్టడాలు, విగ్రహాలు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌పై ప్రకటనలు ఏర్పాటు చేయరాదు. సీసీటీవీ కెమెరాల దృశ్యాలకు అడ్డుగా కూడా ప్రకటనలు ఉండకూడదు.
అనుమతి లేకుండా ప్రకటనల కోసం ప్రత్యేక లైటింగ్‌, సౌండ్‌ సిస్టమ్స్‌, డిజిటల్‌ డిస్‌ప్లేలు వినియోగించడాన్ని నిషేధించారు.
ప్రజల భద్రత, ట్రాఫిక్‌ నిర్వహణ, నగర సుందరీకరణకు ప్రాధాన్యం ఇచ్చేలా ఈ నిబంధనలను రూపొందించినట్లు వెల్లడించారు.

తాత్కాలిక ప్రకటనలకు మూడు రోజులే!
తాత్కాలిక ప్రకటన బోర్డుల ఏర్పాటుకు ప్రత్యేక పరిమితులు విధించారు.
వీటి గరిష్ఠ పరిమాణం 18 అడుగులు × 18 అడుగులుగా నిర్ణయించారు. ఒక ప్రకటనకు గరిష్ఠంగా మూడు రోజుల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.
ప్రాంతాన్ని బట్టి రోజుకు రూ.1,000 నుంచి రూ.4,000 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
అనుమతి గడువు ముగిసిన తర్వాత ప్రకటన బోర్డును తొలగించాల్సిన బాధ్యత నిర్వాహకులదే.

కాలనీల ప్రకటనలకు ప్రత్యేక నిబంధనలు!
స్థానిక అవసరాలకు సంబంధించిన చిన్న ప్రకటనలను హైపర్‌ లోకల్‌ విభాగంలోకి తీసుకొచ్చారు.
ఇల్లు అద్దెకు ఇవ్వడం, ట్యూషన్‌ తరగతులు, కనిపించకుండా పోయిన వ్యక్తుల సమాచారం, క్రీడా పోటీలు, సామాజిక కార్యక్రమాలు తదితర ప్రకటనలకు ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఇలాంటి ప్రకటనల గరిష్ఠ పరిమాణం 6 అడుగులు × 6 అడుగులు మాత్రమే ఉండాలి. ఒకటి నుంచి ఏడు రోజుల వరకు అనుమతి ఇవ్వనున్నారు.
ప్రాంతాన్ని బట్టి రోజుకు రూ.100 నుంచి రూ.500 వరకు రుసుము నిర్ణయించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాల మోత!
అనుమతి లేకుండా ప్రకటనలు ఏర్పాటు చేసేవారిపై భారీ జరిమానాలు విధించేలా నిబంధనలు రూపొందించారు.
తాత్కాలిక ప్రకటనల నిబంధనలు ఉల్లంఘిస్తే రోజుకు రూ.2,000 నుంచి రూ.8,000 వరకు జరిమానా విధించనున్నారు.
హైపర్‌ లోకల్‌ ప్రకటనలను అక్రమంగా ఏర్పాటు చేస్తే రోజుకు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
నిబంధనలు ఉల్లంఘించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, ప్రకటన బోర్డులను మున్సిపల్‌ సిబ్బంది, పోలీసులు, హైడ్రా అధికారులు తొలగించవచ్చు. తొలగింపు ఖర్చులను కూడా సంబంధిత నిర్వాహకుల నుంచే వసూలు చేసేలా నిబంధనలు ఉన్నాయి.

క్షేత్రస్థాయిలో అమలే అసలు పరీక్ష!
నిబంధనలు తీసుకురావడం ఒక ఎత్తయితే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం మరో ఎత్తు. ప్రధాన రహదారుల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన అనధికార ప్రకటన బోర్డులను ఎలా గుర్తిస్తారు? వాటిని తొలగించేందుకు అధికారులు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
ముఖ్యంగా శేరిలింగంపల్లి, మియాపూర్‌, చందానగర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లు, వాణిజ్య కేంద్రాల వద్ద ప్రకటన బోర్డులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
కొత్త నిబంధనలు కేవలం చిన్నచిన్న వ్యాపార ప్రకటనలకే పరిమితమవుతాయా? రాజకీయ, వాణిజ్య ప్రకటనలన్నింటికీ ఒకే విధంగా అమలవుతాయా? అనే ప్రశ్నలకు అధికారుల చర్యలే సమాధానం చెప్పాలి.
అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రకటనల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు చర్యలు తీసుకుంటేనే కొత్త నిబంధనల ఉద్దేశం నెరవేరుతుంది. మరి అక్రమ ఫ్లెక్సీలపై నిజంగానే ఉక్కుపాదం మోపుతారా? లేక ఉత్తర్వులకే పరిమితమవుతారా? అన్నది వేచి చూడాలి.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder