విద్యుత్ తీగలపై పడిన కొమ్మలు.. నిజాంపేట్లో కలకలం
- షెడ్డు నిర్మాణం కోసం చెట్టు తొలగింపు.. భద్రతా చర్యల్లో నిర్లక్ష్యమని ఆరోపణలు
- భారీ శబ్దంతో ట్రాన్స్ఫార్మర్ పేలుడు.. భయాందోళనలో స్థానికులు
- చెట్టు నరికేందుకు అనుమతులున్నాయా?.. నిర్మాణదారుడిపై చర్యలకు డిమాండ్
సామాన్యుడి అస్త్రం / నిజాంపేట్ :
షెడ్డు నిర్మాణానికి చెట్టు అడ్డుగా ఉందని తొలగించే ప్రయత్నం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. నిర్మాణ పనుల కోసం చెట్టును నరికే క్రమంలో కొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ భారీ శబ్దంతో పేలినట్లు సమాచారం. నిజాంపేట్లో చోటుచేసుకున్న ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. మంటలు, భారీ శబ్దంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే నిర్మాణ పనుల కోసం చెట్టును తొలగించే సమయంలో కనీస భద్రతా చర్యలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
చెట్టు తొలగింపులో నిర్లక్ష్యమే కారణమా?
షెడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్టును తొలగించేందుకు చేపట్టిన పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చెట్టుకు సమీపంలోనే విద్యుత్ తీగలు ఉన్నప్పటికీ విద్యుత్ శాఖకు సమాచారం ఇచ్చారా? సరఫరా నిలిపివేసిన తర్వాతే పనులు చేపట్టారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చెట్టు కొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఘటన కారణంగా కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.
అనుమతులున్నాయా?.. అధికారుల పర్యవేక్షణ ఏది?
నిర్మాణం కోసం చెట్టును తొలగించాలంటే సంబంధిత శాఖల నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మరి నిజాంపేట్లో చెట్టు తొలగింపునకు సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నారా? విద్యుత్ తీగలకు సమీపంలో పనులు చేపట్టేందుకు ముందుగానే విద్యుత్ శాఖను సంప్రదించారా? అన్నది తేలాల్సి ఉంది. చెట్టు తొలగింపు పనులు ఎవరి పర్యవేక్షణలో జరిగాయన్న అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది.
ప్రాణాలు పోయుంటే బాధ్యులెవరు?
జనావాసాల మధ్య విద్యుత్ తీగలకు సమీపంలో చెట్లు తొలగించేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా తీవ్ర ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోయినా పెద్ద ప్రమాదం తప్పిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రాన్స్ఫార్మర్ పేలుడుకు దారితీసిన పరిస్థితులపై విద్యుత్ శాఖ అధికారులు సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. చెట్టు తొలగింపునకు అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలించడంతోపాటు భద్రతా నిబంధనల ఉల్లంఘనలు రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన నిర్లక్ష్యాన్ని గుర్తించి చర్యలు తీసుకుంటారా? లేక ఘటనను సాధారణ ప్రమాదంగా పరిగణించి వదిలేస్తారా? అన్నది వేచి చూడాలి.