- మల్కం చెరువు, ఎలక్షన్ కమిషన్ కార్యాలయం, హెచ్‌సీయూ పరిసరాల్లో తనిఖీలు
- వరదనీటి కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ, నీటి ప్రవాహ మార్గాలపై సమీక్ష
- తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారాలు చూపాలని ఆదేశం
సామాన్యుడి అస్త్రం / శేరిలింగంపల్లి : చిన్నపాటి వర్షానికే ప్రధాన రహదారులు జలమయమై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. శేరిలింగంపల్లి జోన్‌లో తరచూ నీరు నిలుస్తున్న ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్ ఐపీఎస్, జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ ఐఏఎస్ గురువారం ఉమ్మడిగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. మల్కం చెరువు, ఎలక్షన్ కమిషన్ కార్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లోని ప్రధాన వాటర్‌లాగింగ్ పాయింట్లను కమిషనర్లు స్వయంగా పరిశీలించారు. వర్షపు నీరు నిలిచిపోవడానికి కారణాలు, ప్రస్తుత డ్రైనేజీ సామర్థ్యం, వరదనీరు బయటకు వెళ్లే మార్గాల్లో ఉన్న అడ్డంకులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
డ్రైనేజీ వ్యవస్థపై క్షుణ్ణ పరిశీలన
వరదనీటి కాలువల వెడల్పు, లోతు, అనుసంధానం, నీటి ప్రవాహ దిశతోపాటు ప్రస్తుతం అమలులో ఉన్న డ్రైనేజీ ఏర్పాట్లను సమీక్షించారు. కాలువల్లో పూడిక, చెత్త పేరుకుపోవడం లేదా ప్రవాహ మార్గాలు మూసుకుపోవడం వల్ల నీరు రహదారులపై నిలుస్తుందా అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోకుండా సమీపంలోని ప్రధాన కాలువలు, చెరువులకు సులభంగా చేరేలా ప్రవాహ మార్గాలను సరిచేయాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త వరదనీటి కాలువలు, క్రాస్ డ్రెయిన్లు, క్యాచ్‌పిట్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

తాత్కాలిక చర్యలు కాదు.. శాశ్వత పరిష్కారం
ప్రతి వర్షాకాలంలో మోటార్లతో నీటిని తొలగించడం, తాత్కాలిక మార్గాలు ఏర్పాటు చేయడంతో సమస్యకు పరిష్కారం లభించదని అధికారులు అభిప్రాయపడ్డారు. గుర్తించిన వాటర్‌లాగింగ్ పాయింట్లకు సాంకేతిక ప్రణాళికలు రూపొందించి, శాశ్వత పరిష్కార పనులను వేగవంతం చేయాలని కమిషనర్లు స్పష్టం చేశారు. భారీ వర్షాల సమయంలో వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా హైడ్రా, మున్సిపల్ ఇంజినీరింగ్, ట్రాఫిక్, ఇతర సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ తనిఖీల్లో శేరిలింగంపల్లి జోన్ డిప్యూటీ కమిషనర్, హైడ్రా ఉన్నతాధికారులు, శేరిలింగంపల్లి సర్కిల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
