- అంజయ్యనగర్‌లో 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం కుప్పకూలినట్లు సమాచారం
- పక్కనున్న అపార్ట్‌మెంట్ పాక్షికంగా దెబ్బతినడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన
- శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో అధికారుల గాలింపు
సామాన్యుడి అస్త్రం / కొండాపూర్ : నగరం నడిబొడ్డున నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగుతున్నాయనే ఆరోపణలకు బలం చేకూర్చే ఘటన కొండాపూర్‌లో చోటుచేసుకుంది. మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం, కాసేపటికి క్రితం (శనివారం మధ్యాహ్నం) ఒక్కసారిగా కుప్పకూలింది. దాదాపు 50 గజాల స్థలంలో ఈ భారీ నిర్మాణాన్ని చేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.
భవనం కూలిన సమయంలో వచ్చిన భారీ శబ్దంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కూలిన నిర్మాణ శిథిలాలు వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని పక్క అపార్ట్‌మెంట్‌పై పడటంతో ఆ భవనం కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. సమీపంలోని హాస్టల్‌లో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద కార్మికులు లేదా ఇతర వ్యక్తులు చిక్కుకున్నారా అనే కోణంలో గాలిస్తున్నారు. ప్రాణనష్టం, క్షతగాత్రులకు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.
సహజ నాలాను ఆనుకుని, అతి తక్కువ విస్తీర్ణంలో ఏడు అంతస్తుల భవనం ఎలా నిర్మించారు? ఈ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అనుమతులు ఉన్నాయా? నిర్మాణ దశలో అధికారులు తనిఖీలు నిర్వహించారా? అక్రమ నిర్మాణమైతే ముందుగానే ఎందుకు అడ్డుకోలేదు? అనే ప్రశ్నలు ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని వెంటాడుతున్నాయి.
నగరంలో చిన్న స్థలాల్లో భారీ భవనాలు పుట్టుకొస్తున్నా టౌన్‌ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత హడావుడి చేయడం కాకుండా, అనుమతులు ఇచ్చిన లేదా నిర్మాణాన్ని పట్టించుకోని అధికారుల బాధ్యతను తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.