GHMC

అక్రమ నిర్మాణానికి ఇద్దరు బలి.. యజమాని, నిర్మాణదారుపై క్రిమినల్‌ కేసుకు CMC ఫిర్యాదు

అక్రమ నిర్మాణానికి ఇద్దరు బలి.. యజమాని, నిర్మాణదారుపై క్రిమినల్‌ కేసుకు CMC ఫిర్యాదు
  • అనుమతుల్లేని నిర్మాణం.. ఇద్దరి ప్రాణాలు బలి
  • నోటీసులిచ్చినా ఆగని పనులు
  • నాసిరకం సామగ్రి, సాంకేతిక పర్యవేక్షణ లోపమే కారణమని ప్రాథమిక నిర్ధారణ
  • భవన యజమానులపై క్రిమినల్‌ కేసుకు టౌన్‌ప్లానింగ్‌ అధికారుల ఫిర్యాదు

సామాన్యుడి అస్త్రం / గచ్చిబౌలి:
నిబంధనలను పక్కనపెట్టి చేపట్టిన ఓ అక్రమ నిర్మాణం చివరకు ఇద్దరి ప్రాణాలను బలిగొంది. అంజయ్యనగర్‌లో శనివారం కూలిపోయిన భవనానికి అసలు నిర్మాణ అనుమతులే లేవని సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తేల్చారు. కనీస సెట్‌బ్యాక్‌లు కూడా వదలకుండా, నాసిరకం సామగ్రితో నిర్మాణం చేపట్టడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.

శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి గ్రామ పరిధిలోని అంజయ్యనగర్‌లో ఇంటి నంబరు 1-60/113/135/1లో నిర్మిస్తున్న భవనం ఆగస్టు 22న ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల మధ్య చిక్కుకున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. భవనం కూలిన ధాటికి పక్కనే ఉన్న మరో నిర్మాణం కూడా దెబ్బతింది. అందులోని ఒక వ్యక్తి గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్‌, పోలీసు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్‌, అగ్నిమాపక, రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్‌ విభాగాల అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. భారీ యంత్రాల సహాయంతో శిథిలాలను తొలగించి సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే రెండు నిండు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

ముందే నోటీసులు.. అయినా నిర్మాణం!

ఈ నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘనను గుర్తించిన మాదాపూర్‌ సర్కిల్‌-50 టౌన్‌ప్లానింగ్‌ అధికారులు జూన్‌ 17నే షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. అదే రోజు స్పీకింగ్‌ ఆర్డర్‌ కూడా ఇచ్చినట్లు అధికారిక ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినప్పటికీ యజమానులు నిర్మాణాన్ని కొనసాగించినట్లు అధికారులు తెలిపారు.

భవన యజమానులుగా పేర్కొన్న ఫర్హీన్‌ సిద్ధిఖ్‌, మహమ్మద్‌ సాజిద్‌ అవసరమైన అనుమతులు తీసుకోలేదని, నిర్దేశిత సెట్‌బ్యాక్‌లను పాటించలేదని మాదాపూర్‌ సర్కిల్‌ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ ఎస్‌.హబీబున్నీసా వెల్లడించారు. సరైన సాంకేతిక పర్యవేక్షణ లేకపోవడం, నాణ్యతలేని నిర్మాణ సామగ్రిని ఉపయోగించడం కూడా ప్రమాదానికి దారితీసి ఉండొచ్చని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

క్రిమినల్‌ కేసు నమోదు చేయండి

భవన యజమానులతోపాటు అక్రమ నిర్మాణానికి బాధ్యులైన ఇతరులపైనా సంబంధిత చట్టాల కింద క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని రాయదుర్గం పోలీసులకు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు తీసుకున్న చర్యల వివరాలను తమకు తెలియజేయాలని కోరారు. నోటీసులు, ఘటన నివేదిక, ప్రమాదం అనంతరం తీసిన చిత్రాలను ఫిర్యాదుకు జతచేశారు.

ముందుగానే నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్మాణ పనులు ఎలా కొనసాగాయన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది. అధికారులు అప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ రెండు ప్రాణాలు దక్కేవేమోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాన్ని చేపట్టిన వారితోపాటు దానిని సకాలంలో అడ్డుకోలేకపోయిన అధికారుల బాధ్యతపైనా సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder