GHMC

ప్రాణాలు పోయాక ‘బాహుబలి’ చర్య!.. అంజయ్యనగర్‌లో అక్రమ భవనాలపై ఉక్కుపాదం

ప్రాణాలు పోయాక ‘బాహుబలి’ చర్య!.. అంజయ్యనగర్‌లో అక్రమ భవనాలపై ఉక్కుపాదం
  • ఏడంతస్తుల అక్రమ భవనం కూలి ఇద్దరు వలస కార్మికుల మృతి
  • దెబ్బతిన్న మరో నిర్మాణాన్ని భారీ క్రేన్‌తో కూల్చివేస్తున్న అధికారులు
  • ఆరు అంతస్తుల మరో అక్రమ భవనంపై చర్యలు.. హాస్టళ్లు, అపార్ట్‌మెంట్లు ఖాళీ

సామాన్యుడి అస్త్రం / గచ్చిబౌలి : రెండు నిండు ప్రాణాలు పోయాయి. పక్క భవనాలు దెబ్బతిన్నాయి. స్థానికులు భయంతో ఇళ్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇంత జరిగాక అంజయ్యనగర్‌లోని అక్రమ నిర్మాణాలపై అధికార యంత్రాంగం కదిలింది. ప్రమాదకరంగా మారిన భవనాలను నేలమట్టం చేసేందుకు భారీ ‘బాహుబలి’ క్రేన్‌ను రంగంలోకి దించింది. మున్సిపల్‌, హైడ్రా అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ, ప్రమాదకర నిర్మాణాలపై కూల్చివేతలు చేపట్టారు.

అంజయ్యనగర్‌లో శనివారం మధ్యాహ్నం కేవలం 50 గజాల స్థలంలో నిర్మించిన ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన మహబత్‌, ఉమేశ్‌ అనే ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. భవన శిథిలాలు పక్కనే ఉన్న నిర్మాణాలపై పడటంతో అవి కూడా దెబ్బతిన్నాయి. పలువురు గాయపడగా, నివాసితులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.

దెబ్బతిన్న భవనంపై భారీ క్రేన్‌

కూలిన భవనం పక్కనే ఉన్న మరో అక్రమ నిర్మాణం తీవ్రంగా దెబ్బతినడంతో ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు గుర్తించారు. పరిసర భవనాలకు నష్టం జరగకుండా నియంత్రిత పద్ధతిలో కూల్చివేసేందుకు భారీ క్రేన్‌ను తీసుకొచ్చారు. మున్సిపల్‌, హైడ్రా, పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో కూల్చివేత పనులు చేపట్టారు.

భద్రత దృష్ట్యా సమీపంలోని హాస్టళ్లు, అపార్ట్‌మెంట్లలో ఉంటున్న వారిని ముందుగానే ఖాళీ చేయించారు. కూల్చివేత సమయంలో శిథిలాలు ఇతర భవనాలపై పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో ఆరు అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని కూడా తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

సీజ్‌ చేసినా నిర్మాణం ఎలా సాగింది?

కూలిపోయిన భవనంపై ఆరు నెలల క్రితమే ఫిర్యాదు అందినట్లు మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు. నిర్మాణాన్ని నిలిపివేసి భవనాన్ని సీజ్‌ చేసినప్పటికీ, నాలుగు నెలల విరామం తర్వాత ఆగస్టు 21న పనులు తిరిగి ప్రారంభమైనట్లు సమాచారం. ఆ మరుసటి రోజే భవనం కుప్పకూలడం అధికారుల పర్యవేక్షణపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.

సీజ్‌ చేసిన భవనంలో తిరిగి పనులు మొదలవుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఎందుకు గుర్తించలేదు? సీల్‌ను ఉల్లంఘించిన వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదు? స్థానికుల ఫిర్యాదులపై నిరంతర నిఘా ఎందుకు పెట్టలేదు? అనే ప్రశ్నలకు మున్సిపల్‌ అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.

ఘటన అనంతరం మాదాపూర్‌ సర్కిల్‌–50 టౌన్‌ప్లానింగ్‌ భవన అధికారి యు.సంతోష్‌కుమార్‌ను సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. భవన యజమాని సయ్యద్‌ సాజిద్‌, కాంట్రాక్టర్‌ ఖాజా మొయినుద్దీన్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

50 గజాల్లో ఆకాశహర్మ్యాలా?

అంజయ్యనగర్‌లో 50 నుంచి 60 గజాల స్థలాల్లోనే ఆరు, ఏడు అంతస్తుల భవనాలు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. నాలాలకు ఆనుకుని, కనీస ఖాళీ ప్రదేశాలు లేకుండా, అత్యవసర వాహనాలు వెళ్లలేని ఇరుకు మార్గాల్లో ఈ నిర్మాణాలు వెలిశాయి. వీటిలో అనేక భవనాలను హాస్టళ్లుగా మార్చి విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు అద్దెకు ఇస్తున్నట్లు హైడ్రా అధికారుల దృష్టికి వచ్చింది.

ఇలాంటి భవనాల నిర్మాణ నాణ్యత, పునాదులు, అగ్నిమాపక భద్రత, విద్యుత్‌ వ్యవస్థలను పరిశీలించాలని హైడ్రా కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న నిర్మాణాలను గుర్తించి, నివాసితులను ఖాళీ చేయించిన తరువాత కూల్చివేయాలని నిర్ణయించారు.

ఒక్క అంజయ్యనగర్‌తో ఆగకూడదు

ప్రమాదం జరిగిన తర్వాత ఒకటి, రెండు భవనాలను కూల్చివేసి చేతులు దులుపుకోవద్దని స్థానికులు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలకు అనుమతించినవారు, సీజ్‌ చేసిన తర్వాత పనులు కొనసాగుతున్నా పట్టించుకోని సిబ్బంది, నిర్మాణదారులకు సహకరించిన వారందరి పాత్రపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రాణాలు పోయాక క్రేన్లు తీసుకురావడం కాకుండా, నిర్మాణ దశలోనే అక్రమాలను అడ్డుకునే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అంజయ్యనగర్‌తోపాటు శేరిలింగంపల్లి పరిధిలోని ప్రమాదకర భవనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో మరో అక్రమ కట్టడం కూలి మరికొన్ని ప్రాణాలు పోయే వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder