- 224 ముసుగులో 69/1 సర్కారీ భూమిలో నిర్మాణాలంటూ ముగ్గురికి నోటీసులు
- 19 ఎకరాల 14 గుంటలు ప్రభుత్వ భూమేనని తేల్చిచెప్పిన తహసీల్దార్.. 300 గజాల నిర్మాణంపై చర్యలకు రంగం సిద్ధం
- సర్వే నం.69/1 ప్రభుత్వ భూమేనని అధికారిక నోటీసులో స్పష్టం.. 22-A నిషేధిత జాబితాలో ఉన్నట్లు వెల్లడి
- మదీనగూడ 224 రిజిస్ట్రేషన్ పత్రాల ముసుగులో నిర్మాణాలంటూ ముగ్గురికి సెక్షన్ 7 నోటీసులు
- అక్టోబర్ 26లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం.. ఆక్రమణ తొలగింపు, జరిమానా, నిర్మాణాల జప్తునకు చట్టపరమైన అవకాశం
సామాన్యుడి అస్త్రం / మియాపూర్ : మియాపూర్‌లో ప్రభుత్వ భూముల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఇన్నాళ్లుగా వివాదాలకు కేంద్రంగా నిలిచిన సర్వే నంబర్ 69/1పై ఎట్టకేలకు రెవెన్యూ యంత్రాంగం కదిలింది. మదీనగూడ సర్వే నంబర్ 224 పేరుతో మియాపూర్ 69/1 ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం-1905లోని సెక్షన్ 7 కింద ఇచ్చిన ఈ నోటీసులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అసలు భూమి ఎక్కడుంది? నిర్మాణ అనుమతులు ఏ సర్వే నంబర్‌పై తీసుకున్నారు, ప్రభుత్వ భూమికి ప్రైవేటు సర్వే నంబర్ పత్రాలను ఎలా చూపుతున్నారు, అంటూ ‘సామాన్యుడి అస్త్రం’ వరుస కథనాల్లో లేవనెత్తుతున్న ప్రశ్నల నేపథ్యంలో రెవెన్యూ శాఖ తాజా చర్య ప్రాధాన్యం సంతరించుకుంది. మరీ ముఖ్యంగా, 69/1 ప్రభుత్వ భూమేనని, 22-A నిషేధిత జాబితాలో ఉందని అధికారులే లిఖితపూర్వకంగా వెల్లడించడం ఈ వ్యవహారంలో కీలక పరిణామం.
69/1 ప్రభుత్వ భూమే.. రెవెన్యూ శాఖ స్పష్టీకరణ!
మియాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 69/1లో మొత్తం 19 ఎకరాల 14 గుంటల భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఈ భూమి మొత్తం 'పోరంబోకు సర్కారీ'గా నమోదైందని శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ తాజాగా జారీ చేసిన నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు, ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడేందుకు ఈ భూమిని రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 22-A కింద నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చినట్లు కూడా వెల్లడించారు. అంటే ఈ భూమి విషయంలో ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న స్థితిని రెవెన్యూ శాఖ మరోసారి అధికారికంగా స్పష్టం చేసింది. ఇప్పుడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ప్రభుత్వ భూమిగా నమోదైన స్థలంలో ప్రైవేటు నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి. వాటికి ఆధారంగా చూపుతున్న పత్రాలు ఏ భూమికి సంబంధించినవి. ఆ పత్రాల్లో పేర్కొన్న భూమికి, క్షేత్రస్థాయిలో నిర్మాణాలు జరుగుతున్న స్థలానికి పొంతన ఉందా, అనే విషయాలు ఇప్పుడు తేలాల్సి ఉంది.
224 పేరుతో 69/1లో నిర్మాణాలు!
ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశాన్ని రెవెన్యూ శాఖ నోటీసులోనే బయటపెట్టింది. మదీనగూడ గ్రామంలోని సర్వే నంబర్ 224 పట్టా భూమి. దాని పక్కనే మియాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 69/1 ప్రభుత్వ భూమి ఉంది. రెండు గ్రామాల సరిహద్దు వద్ద ఈ భూములు ఆనుకొని ఉన్నాయని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. అయితే మదీనగూడ సర్వే నంబర్ 224లోని ప్లాట్ నంబర్లు 30, 31కు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను ఆధారంగా చూపుతూ, మియాపూర్ సర్వే నంబర్ 69/1లోని 300 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కె. శ్రీనివాస్ తదితరులపై రెవెన్యూ శాఖ ఆరోపించింది. నిర్మాణాలను నిలిపివేసేందుకు రెవెన్యూ క్షేత్రస్థాయి సిబ్బంది గతంలో ప్రయత్నించినట్లు కూడా నోటీసులో పేర్కొన్నారు. ఒక సర్వే నంబర్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలతో మరో సర్వే నంబర్లో నిర్మాణాలు జరుగుతున్నాయని ప్రభుత్వ శాఖే చెబుతున్నప్పుడు, అసలు ఈ వ్యవహారాన్ని ఇంతకాలం ఎవరు పరిశీలించారు? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది.
అనుమతులు ఇచ్చింది ఎవరు? స్థలాన్ని పరిశీలించారా?
ఈ వివాదంలో మరో కీలక అంశం భవన నిర్మాణ అనుమతులు. రెవెన్యూ శాఖ నోటీసులో ఉటంకించిన హైకోర్టు ఉత్తర్వు ప్రకారం, సంబంధిత ప్లాట్లకు 2025 జనవరి 15న భవన నిర్మాణ అనుమతి మంజూరైంది. ఇప్పుడు అదే స్థల వివాదంలో రెవెన్యూ శాఖ నిర్మాణాలు ప్రభుత్వ భూమిలో జరుగుతున్నాయని పేర్కొనడం అనేక సందేహాలకు దారితీస్తోంది. అనుమతుల దరఖాస్తులో ఏ సర్వే నంబర్ చూపించారు, నిర్మాణ అనుమతులు జారీ చేయడానికి ముందు స్థలాన్ని పరిశీలించారా, గ్రామ సరిహద్దులను, రెవెన్యూ రికార్డులను పరిశీలించారా, అనుమతి పొందిన స్థలం, వాస్తవ నిర్మాణ స్థలం ఒకటేనని నిర్ధారించుకున్నారా, సుమారు గత 30 ఏళ్ళగా కోర్టు వివాదాలు ఉన్న పండగంటి పుట పర్మిషన్ ఎలా వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. కేవలం నోటీసులు ఇచ్చి ఆగిపోకుండా, అనుమతుల జారీకి సంబంధించిన ఫైళ్లు, సైట్ ప్లాన్లు, స్థల పరిశీలన నివేదికలను కూడా అధికార యంత్రాంగం సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
హైకోర్టు ఆదేశాల తర్వాతే చట్టపరమైన చర్యలు!
ఈ వివాదంపై కె. శ్రీనివాస్ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. వాళ్ళు పేర్కొన్న పిర్యాదులో నిర్మాణాలకు అధికారులు ఆటంకం కలిగించకుండా ఆదేశించాలని కోరారు. భవన నిర్మాణ అనుమతి మంజూరైన నేపథ్యంలో చట్టబద్ధమైన ప్రక్రియ పాటించకుండా నిర్మాణాల్లో జోక్యం చేసుకోరాదని హైకోర్టు స్పష్టం చేసినట్లు రెవెన్యూ నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ ఆదేశం ప్రభుత్వ భూమిపై ఆక్రమణ ఆరోపణలను తుది స్థాయిలో పరిష్కరించినట్లు కాదు. చట్టప్రకారం వ్యవహరించాల్సిన అవసరాన్నే సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖ తెలంగాణ భూ ఆక్రమణ చట్టం-1905లోని సెక్షన్ 7 కింద నోటీసులు జారీ చేయడం గమనార్హం.
ముగ్గురికి నోటీసులు.. అక్టోబర్ 26 వరకు గడువు!
ఈ వ్యవహారంలో కె. శ్రీనివాస్, బి. వెంకట శివారెడ్డి, బి. శివనాగిరెడ్డిలకు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. సంబంధిత భూమిపై తమ హక్కులను నిరూపించే రికార్డులతో అక్టోబర్ 26, 2026లోగా శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ ఎదుట స్వయంగా లేదా లిఖితపూర్వకంగా వివరణ సమర్పించాలని ఆదేశించింది. వివరణను, ఆధారాలను పరిశీలించిన తర్వాత చట్టప్రకారం ఆక్రమణ తొలగింపు, జరిమానా విధింపు, నిర్మాణాలు లేదా అక్కడ ఉంచిన వస్తువుల జప్తు వంటి చర్యలకు అవకాశం ఉందని నోటీసులో పేర్కొన్నారు.
నోటీసులు సరే.. మరి హద్దుల నిర్ధారణ ఎప్పుడు?
ప్రస్తుత నోటీసు 300 చదరపు గజాల నిర్మాణానికి సంబంధించినదే. కానీ సర్వే నంబర్ 69/1 మొత్తం విస్తీర్ణం 19 ఎకరాల 14 గుంటలు. దీంతో ఈ ఒక్క నిర్మాణంపై చర్యలు తీసుకుంటే సరిపోతుందా, మొత్తం ప్రభుత్వ భూమి సరిహద్దులను నిర్ధారించాల్సిన అవసరం లేదా అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా మియాపూర్ 69/1, మదీనగూడ 224 మధ్య అసలు గ్రామ సరిహద్దు ఎక్కడుందో అధికారిక సర్వే ద్వారా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జారీ చేసిన నోటీసుతో పాటు సర్వే రికార్డులు, గ్రామ మ్యాపులు, భవన నిర్మాణ అనుమతులు, స్థల పరిశీలన నివేదికలను ఒకేచోట పరిశీలిస్తేనే వాస్తవాలు మరింత స్పష్టమవుతాయి.
‘అస్త్రం’ నిలదీతలకు సమాధానం చర్యలతోనే!
ప్రభుత్వ భూముల పరిరక్షణ, సర్వే నంబర్ల మధ్య గందరగోళం, నిర్మాణ అనుమతుల వ్యవహారంపై ‘సామాన్యుడి అస్త్రం’ లేవనెత్తుతున్న ప్రశ్నలకు తాజా రెవెన్యూ నోటీసులు ప్రాధాన్యం తీసుకొచ్చాయి. అయితే నోటీసులు జారీ చేయడమే ఈ వివాదానికి ముగింపు కాదు. నోటీసులు అందుకున్నవారు సమర్పించే ఆధారాలను పరిశీలించాలి. నిర్మాణ స్థలం ఏ సర్వే నంబర్ పరిధిలో ఉందో నిర్ధారించాలి. నిర్మాణ అనుమతులు జారీ చేసిన అధికారులు ఏ రికార్డులను పరిగణనలోకి తీసుకున్నారో వెల్లడించాలి.
ప్రభుత్వ భూమిలోనే నిర్మాణాలు జరిగాయని తుది విచారణలో తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో సంబంధిత వ్యక్తుల వివరణను, పత్రాలను పరిశీలించి న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలి. ఇన్నాళ్లుగా ప్రశ్నలకే పరిమితమైన మియాపూర్ 69/1 వ్యవహారం ఇప్పుడు అధికారిక నోటీసుల దశకు చేరింది. ఇక అందరి దృష్టి అక్టోబర్ 26 తర్వాత రెవెన్యూ శాఖ తీసుకునే నిర్ణయంపైనే. నోటీసులతో సరిపెడతారా, ప్రభుత్వ భూమి హద్దులు తేలుస్తారా, నిర్మాణ అనుమతుల వెనుక ఉన్న వాస్తవాలను బయటపెడతారా. ఈ ప్రశ్నలకు రెవెన్యూ యంత్రాంగం ఇచ్చే సమాధానమే 69/1 వ్యవహారంలో తదుపరి కీలక పరిణామం కానుంది.