- 75 గజాలలోపు స్థలంలో 7 మీటర్లకు మించిన నిర్మాణాల గుర్తింపు
- 75 గజాలకు పైగా స్థలంలో అనుమతి లేని కట్టడాలపై చర్యలు
- కూల్చివేతల సంఖ్యపై ప్రతిరోజూ కమిషనర్ పర్యవేక్షణ
సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్ : అనుమతులు లేకుండా అడ్డగోలుగా భవనాలు నిర్మిస్తున్న వారికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. నిబంధనలను పక్కనపెట్టి చేపడుతున్న నిర్మాణాలను గుర్తించి, ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌ల ద్వారా కూల్చివేయాలని సీఎంసీ కమిషనర్ టౌన్ ప్లానింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ఆదేశించారు.
సీఎంసీ విడుదల చేసిన ప్రెస్‌నోట్ ప్రకారం, 75 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న స్థలంలో ఏడు మీటర్లకు మించి ఎత్తుతో నిర్మిస్తున్న భవనాలను అధికారులు ముందుగా గుర్తించనున్నారు. చిన్న స్థలాల్లో పరిమితికి మించి అంతస్తులు నిర్మించడం వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో, అలాంటి నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని కమిషనర్ సూచించారు.
అదేవిధంగా 75 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న స్థలంలో ఎలాంటి భవన నిర్మాణ అనుమతి లేకుండా చేపడుతున్న నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకోనున్నారు. ఇలాంటి సందర్భాల్లో భవనం ఎత్తుతో సంబంధం లేకుండా, నిర్మాణ అనుమతి ఉందా లేదా అన్నదే ప్రధాన ప్రమాణంగా పరిగణించనున్నారు. గుర్తించిన నిర్మాణాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌ల ద్వారా కూల్చివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అక్రమ నిర్మాణాల గురించి పౌరుల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే స్పందించే పద్ధతికి స్వస్తి పలకాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ప్రజల ఫిర్యాదులతో పాటు క్షేత్రస్థాయి అధికారులు స్వయంగా గుర్తించిన నిర్మాణాలపైనా ఎలాంటి తేడా లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫిర్యాదు ఎవరు చేశారు? సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? అనే అంశాలతో సంబంధం లేకుండా నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు.
ప్రెస్‌నోట్ విడుదల చేసిన రోజు నుంచి ఆయా కేటగిరీల కింద చేపట్టిన కూల్చివేతల సంఖ్యను ప్రతిరోజూ పర్యవేక్షించనున్నట్లు సీఎంసీ తెలిపింది. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, నిర్మాణ ప్రారంభ దశలోనే అక్రమాలను గుర్తించాలని సూచించింది. గుర్తించిన వెంటనే వేగంగా, సమర్థంగా చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు.
అయితే ఈ ప్రత్యేక డ్రైవ్‌లో చిన్న నిర్మాణదారులపైనే ప్రతాపం చూపకుండా, భారీ అక్రమ నిర్మాణాలు, వాణిజ్య భవనాలు, రాజకీయ లేదా ఆర్థిక పలుకుబడి కలిగిన నిర్మాణదారులపైనా ఒకే విధంగా చట్టాన్ని అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కూల్చివేతల్లో పారదర్శకత పాటిస్తూ, తీసుకున్న చర్యల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచినప్పుడే ఈ డ్రైవ్‌పై విశ్వాసం ఏర్పడుతుందని అభిప్రాయపడుతున్నారు.