GHMC

కూలినా.. సీజ్ చేసినా ‘డోంట్‌ కేర్‌’!.. అంతస్తుకి రూ.2 లక్షల దందా?

కూలినా.. సీజ్ చేసినా ‘డోంట్‌ కేర్‌’!.. అంతస్తుకి రూ.2 లక్షల దందా?
  • 2024లో సీజ్‌ చేసిన 25 భవనాల్లో తిరిగి నిర్మాణ పనులు?
  • అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కూలినా ఆగని అక్రమ కట్టడాలు
  • అంతస్తుకు రూ.2 లక్షలు.. భారీ నిర్మాణానికి రూ.40 లక్షల ఒప్పందమంటూ ఆరోపణలు
సామాన్యుడి అస్త్రం / మాదాపూర్ : భవనం ఒరిగినా భయం లేదు… అధికారులు సీజ్‌ చేసినా లెక్కలేదు… ఏకంగా ఏడంతస్తుల భవనం కుప్పకూలినా అక్రమ నిర్మాణదారుల తీరు మారడం లేదు! అంజయ్యనగర్‌, సిద్ధిక్‌నగర్‌ ప్రాంతాల్లో అనుమతులు లేకుండానే అంతస్తులపై అంతస్తులు వెలుస్తుండటం పట్టణ ప్రణాళిక విభాగం పనితీరును ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఈ అక్రమ నిర్మాణాల వెనుక కొందరు అధికారులు, మధ్యవర్తులు, రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనే తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.


2024లో 25 భవనాలకు సీజ్‌
2024లో సిద్ధిక్‌నగర్‌, అంజయ్యనగర్‌ ప్రాంతాలు జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్‌–21 పరిధిలో ఉండేవి. ఆ సమయంలో సిద్ధిక్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఒరిగిన ఘటన కలకలం రేపింది. దీంతో అప్పటి సర్కిల్‌–21 టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ప్రత్యేక సర్వే నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న దాదాపు 25 భవనాలను గుర్తించి సీజ్‌ చేసినట్లు సమాచారం.
అక్రమ నిర్మాణాలను తిరిగి చేపడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించడంతో కొంతకాలం పనులు నిలిచిపోయాయి. అయితే పరిస్థితి సద్దుమణిగిన తర్వాత సీజ్‌ చేసిన పలు భవనాల్లో మళ్లీ పనులు ప్రారంభమైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల సీజ్‌ స్టిక్కర్లు బయట కనిపిస్తుండగా, లోపల మాత్రం నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని చెబుతున్నారు.

భవనం కూలినా ఆగని పనులు
ప్రస్తుతం సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాదాపూర్‌ సర్కిల్‌ పరిధిలో ఉన్న అంజయ్యనగర్‌లో సుమారు 48 నుంచి 50 గజాల స్థలంలో నిర్మించిన ఏడంతస్తుల భవనం పేకమేడలా కూలిపోయింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగడంతో అక్రమ నిర్మాణాల ప్రమాదం మరోసారి బయటపడింది.
కూలిన భవన శిథిలాలను పూర్తిగా తొలగించకముందే, కూతవేటు దూరంలోని సుమారు 100 గజాల స్థలంలో మరో భవనానికి ఆరో అంతస్తు స్లాబ్‌ వేసినట్లు సమాచారం. అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేస్తామని అధికారులు ప్రకటించి 24 గంటలు కూడా గడవకముందే పనులు కొనసాగడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.

అంతస్తుకు రూ.2 లక్షల ‘రేటు’?
మాదాపూర్‌ సర్కిల్‌ పరిధిలో అక్రమంగా నిర్మించే ఒక్కో అంతస్తుకు రూ.2 లక్షల చొప్పున మామూళ్లు చెల్లించాలనే అనధికారిక రేటు నిర్ణయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు చెల్లించిన నిర్మాణాల వైపు అధికారులు చూడరని, ముడుపులు ఇవ్వని వారికి మాత్రం నోటీసులు, కూల్చివేత హెచ్చరికలు వస్తాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మరో భారీ భవన నిర్మాణానికి సంబంధించి ఓ మధ్యవర్తి ఏకంగా రూ.40 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులు, రాజకీయ నాయకులను తానే మేనేజ్‌ చేస్తానంటూ భవన యజమానికి హామీ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో భారీ నిర్మాణం విషయంలో రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ముడుపులు చేతులు మారుతున్నాయనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణల్లో నిజానిజాలను ఉన్నతాధికారులు, ఏసీబీ నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉంది.

కాలనీకో ఏజెంట్‌.. నిర్మాణానికో రేటు!
అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు కొందరు అధికారులు కాలనీలవారీగా మధ్యవర్తులను ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణం ప్రారంభ దశలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా, రెండు మూడు స్లాబులు పూర్తయిన తర్వాత నోటీసులు జారీ చేస్తున్నారని సమాచారం. అనంతరం కూల్చివేత, జరిమానా పేరుతో భవన యజమానులను భయపెట్టి సెటిల్‌మెంట్లు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అంజయ్యనగర్‌, సిద్ధిక్‌నగర్‌ ప్రాంతాల్లోనే దాదాపు 300 అక్రమ కట్టడాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 40 అడుగుల రోడ్డులో ఏకంగా 72 గదులతో భవనం నిర్మిస్తున్నా అధికారులు ఎందుకు అడ్డుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.


ఐదు భవనాలు కూల్చితే సరిపోతుందా?
అంజయ్యనగర్‌ ఘటన అనంతరం ఐదు ప్రమాదకర భవనాలను కూల్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టినట్లు సమాచారం. అయితే ఐదు కట్టడాలను తొలగించడంతోనే సమస్య పరిష్కారం కాదని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. 2024లో సీజ్‌ చేసిన 25 భవనాల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించడంతోపాటు, అంజయ్యనగర్‌–సిద్ధిక్‌నగర్‌లోని అక్రమ నిర్మాణాలన్నింటిపై సమగ్ర సర్వే నిర్వహించాలని కోరుతున్నారు.
అక్రమ నిర్మాణాలకు అనుమతించిన వారెవరు? సీజ్‌ చేసిన భవనాల్లో తిరిగి పనులు ఎలా మొదలయ్యాయి? కూలిపోయిన భవనానికి బాధ్యులెవరు? అంతస్తుకో రూ.2 లక్షల వసూళ్ల ఆరోపణల్లో నిజమెంత? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. నిర్మాణదారులపై మాత్రమే కాకుండా వారికి సహకరించిన అధికారులు, మధ్యవర్తులు, రాజకీయ నేతల పాత్రపైనా స్వతంత్ర విచారణ జరిపితేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder