- కమిషనర్ సృజన ఉత్తర్వులతో పరిపాలన, టౌన్‌ప్లానింగ్ విభాగాల్లో మార్పులు
- శేరిలింగంపల్లి నుంచి జీడిమెట్ల వరకు పలువురు అధికారుల బదిలీ
- కొందరికి కొత్త పోస్టింగ్‌లు.. మరికొందరికి అదనపు సర్కిళ్ల బాధ్యతలు
సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్:
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక్కసారిగా బదిలీల గంట మోగింది. పరిపాలనతోపాటు టౌన్‌ప్లానింగ్ విభాగాల్లో పనిచేస్తున్న పలువురు అధికారులను బదిలీ చేస్తూ సీఎంసీ కమిషనర్ సృజన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శేరిలింగంపల్లి, జీడిమెట్ల, కొంపల్లి, పటాన్‌చెరు, అమీన్‌పూర్, నిజాంపేట, మేడ్చల్, దుండిగల్ తదితర సర్కిళ్లలో బదిలీలు, అదనపు బాధ్యతలతో పాలనా సమీకరణాలు మారిపోయాయి. ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.
రాణికి పటాన్‌చెరు.. అమీన్‌పూర్ అదనపు బాధ్యత
జీడిమెట్ల, కొంపల్లి సర్కిళ్లలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న రాణిని పటాన్‌చెరు సర్కిల్‌కు బదిలీ చేశారు. ఆమెకు అమీన్‌పూర్ సర్కిల్ అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. అమీన్‌పూర్ సర్కిల్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రసాద్‌ను కొంపల్లి సర్కిల్‌కు బదిలీ చేశారు.
శేరిలింగంపల్లి సర్కిల్‌లో పనిచేస్తున్న సురేందర్‌రెడ్డిని జీడిమెట్ల సర్కిల్‌కు పంపారు. నెల రోజుల కిందటే మూసాపేట సర్కిల్ నుంచి బదిలీపై శేరిలింగంపల్లికి వచ్చిన ఆయనను తాజాగా మరోసారి బదిలీ చేయడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నార్సింగి సర్కిల్ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రసన్నకు శేరిలింగంపల్లి సర్కిల్ అదనపు బాధ్యతలు అప్పగించారు.
నిజాంపేట–మేడ్చల్ అధికారుల పరస్పర మార్పు
నిజాంపేట సర్కిల్ టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ ముజాఫర్‌సింగ్‌ను మేడ్చల్ సర్కిల్‌కు బదిలీ చేశారు. మేడ్చల్ సర్కిల్‌లో డీమ్‌డ్ గ్రేడ్–3గా విధులు నిర్వహిస్తున్న జి.సాయితేజను నిజాంపేట సర్కిల్‌కు పంపడంతోపాటు దుండిగల్ సర్కిల్ అదనపు బాధ్యతలను అప్పగించారు.
జీడిమెట్ల, కొంపల్లి సర్కిళ్లలో పనిచేస్తున్న టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్‌ను మాదాపూర్ సర్కిల్‌కు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చింతల్ సర్కిల్ టీపీఎస్ మధుకు జీడిమెట్ల సర్కిల్ అదనపు బాధ్యతలు ఇచ్చారు. గాజులరామారం సర్కిల్ టీపీఎస్ సరితా సేన్‌కు కొంపల్లి సర్కిల్ అదనపు బాధ్యతలు అప్పగించారు.
రమేశ్‌పై మరిన్ని సర్కిళ్ల భారం
పటాన్‌చెరు సర్కిల్ టీపీఎస్‌గా పనిచేస్తున్న రమేశ్‌కు గాజులరామారం సర్కిల్ అదనపు బాధ్యతలు అప్పగించారు. అమీన్‌పూర్ సర్కిల్ టీపీఎస్ రోహన్ రాథోడ్ మెడికల్ లీవుపై వెళ్లడంతో ఆ సర్కిల్ బాధ్యతలను కూడా రమేశ్ నిర్వహించనున్నట్లు సమాచారం. నార్సింగి, పటాన్‌చెరు సర్కిళ్ల బాధ్యతలను ఇప్పటికే చూస్తున్న ఆయనపై మరిన్ని సర్కిళ్ల భారం పడినట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఎక్కడెక్కడ మార్పులంటే..
ఈ బదిలీలు, అదనపు బాధ్యతల ప్రభావం ప్రధానంగా శేరిలింగంపల్లి, నార్సింగి, మాదాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, చింతల్, గాజులరామారం, పటాన్‌చెరు, అమీన్‌పూర్, నిజాంపేట, మేడ్చల్, దుండిగల్ సర్కిళ్లపై పడింది. కొత్తగా ఏర్పాటైన సీఎంసీలో పరిపాలనను గాడిలో పెట్టేందుకే ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.