GHMC

సీజ్‌ బోర్డులకే సీజ్‌?.. మియాపూర్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు!

సీజ్‌ బోర్డులకే సీజ్‌?.. మియాపూర్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు!
  • మక్తా మహబూబ్‌పేట్‌ సర్వే నంబర్‌ 44లో అనుమతుల్లేని నిర్మాణాలంటూ ఆరోపణలు
  • ప్రజావాణిలో సీఎంసీ కమిషనర్‌కు ఒకేసారి 20 ఫిర్యాదులు
  • సీజ్‌ చేసిన భవనాల్లోనూ పనులు కొనసాగుతున్నాయని బీఆర్‌ఎస్‌ నేత ఆగ్రహం
సామాన్యుడి అస్త్రం / మియాపూర్ : అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలను అధికారులు సీజ్‌ చేస్తారు. అక్రమ నిర్మాణాలు ఆగిపోయాయని ప్రజలు నమ్ముతారు. కానీ కొద్దిరోజులకే సీజింగ్‌ బోర్డులు మాయమై మళ్లీ పనులు మొదలైతే.. ఆ సీజ్‌కు అర్థమేమిటి? అధికారుల ఆదేశాలకు విలువెక్కడుంది? మియాపూర్‌ మక్తా మహబూబ్‌పేట్‌లోని సర్వే నంబర్‌ 44 పరిధిలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమ నిర్మాణాల వ్యవహారం ఇప్పుడు ఈ ప్రశ్నలనే లేవనెత్తుతోంది.
ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్న నిర్మాణాలపై సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సీఎంసీ కమిషనర్‌ సృజనకు 20 ఫిర్యాదులు అందజేసినట్లు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు తౌట్‌రెడ్డి సంతోష్‌రెడ్డి తెలిపారు. ప్రజలు పదేపదే ఫిర్యాదు చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన తీవ్రంగా ఆరోపించారు.

సీజ్‌ బోర్డులు తొలగించి మళ్లీ పనులా?
సీఎంసీ అధికారులు గతంలో సీజ్‌ చేసిన కొన్ని భవనాలకు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి తిరిగి నిర్మాణాలు చేపడుతున్నట్లు సంతోష్‌రెడ్డి ఆరోపించారు. కొన్ని భవనాల్లో నిర్మాణాలను పూర్తిచేసి గృహప్రవేశాలు కూడా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలపై గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ పనులు కొనసాగుతుండటం వెనుక ఎవరి అండదండలు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు.
అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల ఒత్తిళ్ల కారణంగానే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, నిర్మాణాలు నిజంగా అనుమతులకు విరుద్ధంగా ఉంటే వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రజలను కలవకుండా తప్పించుకుంటున్నారా?
మియాపూర్‌ సర్కిల్‌–48 డిప్యూటీ కమిషనర్‌ జి. శ్రీనివాస్‌ ప్రజల సమస్యలపై స్పందించడం లేదని, విజిటింగ్‌ అవర్స్‌లో కార్యాలయానికి వచ్చే ప్రజలను కూడా కలవకుండా వ్యవహరిస్తున్నారని సంతోష్‌రెడ్డి ఆరోపించారు. ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించాల్సిన అధికారులే ప్రజలకు అందుబాటులో లేకపోతే సామాన్యులు ఎవరిని ఆశ్రయించాలని నిలదీశారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పక్కనపెట్టి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించేలా అధికారులు వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీఎంసీ ఉన్నతాధికారులు, సైబరాబాద్‌ కమిషనర్‌, శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

విజిలెన్స్‌, ఏసీబీ విచారణ జరపాలి
అక్రమ నిర్మాణాల వెనుక అధికారుల పాత్ర ఉందా? రాజకీయ ఒత్తిళ్లతో చర్యలు నిలిచిపోయాయా? అనే విషయాలను తేల్చేందుకు విజిలెన్స్‌, అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సంతోష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.
సీజ్‌ బోర్డులు తొలగించి నిర్మాణాలు కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలితే సంబంధిత బిల్డర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కోరారు. ఫిర్యాదులు చేసిన ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా, ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
ఇప్పటికైనా సీఎంసీ ఉన్నతాధికారులు స్పందించి సర్వే నంబర్‌ 44లోని నిర్మాణాల అనుమతులు, సీజింగ్‌ వివరాలు, నోటీసులు, ప్రస్తుతం జరుగుతున్న పనులపై క్షేత్రస్థాయి విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder