GHMC

అనధికార కట్టడాలపై ఉక్కుపాదం.. ఒకేరోజు 14 భవనాలు నేలమట్టం!

అనధికార కట్టడాలపై ఉక్కుపాదం.. ఒకేరోజు 14 భవనాలు నేలమట్టం!
  • మూడు జోన్లలో విస్తృతంగా క్షేత్రస్థాయి తనిఖీలు
  • మొత్తం 22 అనధికార నిర్మాణాల గుర్తింపు
  • మరో ఆరు కట్టడాలపై కూల్చివేతకు రంగం సిద్ధం
సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్ : అనుమతులు లేకుండా అడ్డగోలుగా వెలుస్తున్న నిర్మాణాలపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) మరోసారి కొరడా ఝళిపించింది. కార్పొరేషన్ పరిధిలోని మూడు జోన్లలో శుక్రవారం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించిన టౌన్‌ప్లానింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు మొత్తం 22 అనధికార నిర్మాణాలను గుర్తించాయి. వీటిలో 14 భవనాలను కూల్చివేయగా, మరో రెండు నిర్మాణాలకు నోటీసులు జారీ చేశాయి.
మిగిలిన ఆరు కేసులపై కూడా అధికారులు దృష్టి సారించారు. నిర్దేశిత విధానం, వర్తించే నిబంధనలను అనుసరించి తదుపరి కూల్చివేత చర్యలు చేపట్టేందుకు ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు సీఎంసీ వెల్లడించింది. దీంతో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన యజమానుల్లో ఆందోళన మొదలైంది.

కార్పొరేషన్ పరిధిలో అనధికార నిర్మాణాలను ఎప్పటికప్పుడు గుర్తించాలని, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత టౌన్‌ప్లానింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించి చేపట్టే నిర్మాణాల విషయంలో ఎలాంటి ఉపేక్ష ఉండదనే సంకేతాన్ని తాజా కూల్చివేతల ద్వారా అధికారులు ఇచ్చారు.
అయితే కేవలం నిర్మాణాలు పూర్తయ్యే దశలో చర్యలు తీసుకోవడమే కాకుండా, పునాది దశలోనే అక్రమాలను గుర్తించి అడ్డుకోవాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. అక్రమ నిర్మాణాలకు విద్యుత్, నీటి కనెక్షన్లు ఎలా వస్తున్నాయి? నిర్మాణం అంతస్తులు దాటే వరకు క్షేత్రస్థాయి అధికారులు ఎందుకు గుర్తించడం లేదు? అనే ప్రశ్నలకు కూడా అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
చట్టాన్ని అతిక్రమించిన ప్రతి నిర్మాణంపైనా ఒకే విధంగా చర్యలు తీసుకున్నప్పుడే ఈ డ్రైవ్‌పై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. గుర్తించిన అన్ని అనధికార నిర్మాణాలపై నిబంధనల ప్రకారం చర్యలు కొనసాగిస్తామని సీఎంసీ స్పష్టం చేసింది.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder