GHMC

వానొస్తే జామ్‌కు చెక్!.. రోడ్డునీటికి ‘భూగర్భ’ దారి

వానొస్తే జామ్‌కు చెక్!.. రోడ్డునీటికి ‘భూగర్భ’ దారి
  • వాటర్‌లాగింగ్‌ పాయింట్ల వద్ద రైన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ పిట్లు
  • ప్రగతినగర్‌ కమాన్‌ వద్ద ప్రయోగాత్మకంగా అమలు
  • ట్రాఫిక్‌ సమస్య తగ్గడంతో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే యోచన
సామాన్యుడి అస్త్రం / ప్రగతినగర్ : చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపించడం.. గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకోవడం సైబరాబాద్‌ పరిధిలో నిత్యకృత్యంగా మారింది. వర్షపు నీరు నిలిచిన ప్రతిసారీ మోటార్లు పెట్టి నాలాలు, డ్రైనేజీల్లోకి తోడేస్తున్న అధికారులు ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. రోడ్లపై నిలిచే నీటిని వృథాగా బయటకు పంపకుండా నేరుగా భూగర్భంలోకి చేర్చి, ఒకే దెబ్బకు వాటర్‌లాగింగ్‌తోపాటు భూగర్భ జలాల సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా నీరు ఎక్కువగా నిలిచే ప్రాంతాల్లో రీఛార్జ్‌ బోర్‌వెల్‌తో కూడిన రైన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ పిట్లను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 12 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతుతో ఇంకుడు గుంతను నిర్మించి, దానికి వేర్వేరు లోతుల్లో వేసిన బోర్లను అనుసంధానిస్తున్నారు. ఒక్కో వ్యవస్థకు దాదాపు రూ.5 లక్షలు ఖర్చవుతున్నట్లు సమాచారం.
వర్షం కురిసినప్పుడు రోడ్డుపై చేరే నీరు ఈ పిట్‌లోకి వెళ్లి, వడపోత అనంతరం బోర్ల ద్వారా భూగర్భంలోకి చేరుతుంది. దీనివల్ల రోడ్డుపై నీరు తగ్గడంతోపాటు భూగర్భ జలాల పునరుద్ధరణకు అవకాశం ఏర్పడుతుంది.

నిజాంపేట్‌ సర్కిల్‌ పరిధిలోని ప్రగతినగర్‌ కమాన్‌ సమీపంలో ఉన్న కేజీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అక్కడ రీఛార్జ్‌ బోర్‌వెల్‌–కమ్‌–రైన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ పిట్‌ అందుబాటులోకి వచ్చినట్లు సీఎంసీ అధికారికంగా వెల్లడించింది. 

ఈ ప్రాంతంలో వర్షం పడిన ప్రతిసారీ భారీగా నీరు నిలిచి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడేది. హార్వెస్టింగ్‌ పిట్‌ ఏర్పాటుతో సమస్య గణనీయంగా తగ్గినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

అయితే పిట్లు నిర్మించడంతోనే పని పూర్తయిందని అధికారులు భావించకూడదు. చెత్త, మట్టి చేరకుండా నిరంతరం శుభ్రం చేయడం, వడపోత వ్యవస్థను పర్యవేక్షించడం, బోర్ల పనితీరును తనిఖీ చేయడం తప్పనిసరి. సరైన నిర్వహణతో ఈ విధానాన్ని ఇతర వాటర్‌లాగింగ్‌ ప్రాంతాలకు విస్తరిస్తే నగర రహదారులకు ముంపు బెడద తగ్గడమే కాకుండా భూగర్భ జలాలకు కూడా కొత్త ఊపిరి లభిస్తుంది.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder