- భద్రతలో రాజీ వద్దు.. ట్రాఫిక్‌కు ఇబ్బంది రాకుండా చర్యలు: సీపీ రమేష్
- ఐడీపీఎల్, సూరారం నిమజ్జన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన
- పోలీసు–మున్సిపల్ శాఖల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్
- బందోబస్తు, ట్రాఫిక్, లైటింగ్, గజ ఈతగాళ్లపై ప్రత్యేక దృష్టి
సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్:
వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు ఒకే తాటిపై పనిచేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత విషయంలో ఎక్కడా రాజీపడొద్దని, నిమజ్జన ప్రాంతాల్లో చిన్నపాటి లోపానికీ తావులేకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
నిమజ్జన ఏర్పాట్లపై బుధవారం సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ మున్సిపల్ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీసు, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, దేవాదాయ శాఖలకు చెందిన అధికారులతో ఏర్పాట్ల పురోగతిని సీపీ సమీక్షించారు.
అనంతరం సీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఐడీపీఎల్, సూరారం తదితర ప్రాంతాల్లోని నిమజ్జన కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ చేపట్టిన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, విద్యుత్ దీపాలు, క్రేన్లు, గజ ఈతగాళ్లు, అత్యవసర బృందాల ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
నిమజ్జనం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు, వాహనాలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే పటిష్ట ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సీపీ సూచించారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించాలని, అవసరమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు సిబ్బందిని మోహరించాలని ఆదేశించారు.
నిమజ్జన కేంద్రాలకు వెళ్లే మార్గాల్లో స్పష్టమైన సూచిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను గుర్తించాలని చెప్పారు. విగ్రహాలను తీసుకొచ్చే వాహనాలు, సాధారణ వాహనాలు ఒకే మార్గంలో చిక్కుకోకుండా ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికను అమలు చేయాలని అధికారులకు సూచించారు.
చెరువుల వద్ద తగిన వెలుతురు ఉండేలా చూడాలని, ప్రమాదకర ప్రాంతాల్లో భక్తులు నీటిలోకి వెళ్లకుండా బారికేడింగ్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గజ ఈతగాళ్లు, వైద్య బృందాలు, అంబులెన్స్‌లు, అత్యవసర సహాయక సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో విధులు నిర్వహించాలని సీపీ రమేష్ పేర్కొన్నారు.
ఈ పరిశీలనలో జాయింట్ సీపీ సన్‌ప్రీత్ సింగ్, డీసీపీ కోటిరెడ్డి, డీసీపీ రీతిరాజ్, ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిణి రెడ్డి, ఎస్‌బీ డీసీపీ సువేంద్ర, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. విద్యుత్, మున్సిపల్, రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు, సిబ్బంది కూడా హాజరయ్యారు.