Telangana

కారు అద్దానికి తాకిందని కక్ష?.. దంపతులను వెంబడించి కారుతో ఢీ!

కారు అద్దానికి తాకిందని కక్ష?.. దంపతులను వెంబడించి కారుతో ఢీ!
  • అయ్యప్ప సొసైటీ ఫ్రీ లెఫ్ట్‌ వద్ద కారు అద్దానికి తగిలిన బైక్‌
  • దంపతులను వెంబడించి కారుతో ఢీకొట్టాడన్న ఆరోపణ
  • భార్యాభర్తలకు తీవ్ర గాయాలు.. కేసు నమోదు చేసిన పోలీసులు
సామాన్యుడి అస్త్రం / మాదాపూర్: చిన్నపాటి ఘటనపై రగిలిన ఆగ్రహం ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. కారు అద్దానికి బైక్‌ తగిలిందనే కారణంతో అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలను ఓ కారు డ్రైవర్‌ వెంబడించి ఢీకొట్టినట్లు ఆరోపణలు రావడం మాదాపూర్‌లో కలకలం రేపింది.
అందుతున్న సమాచారం ప్రకారం.. మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ సమీపంలోని ఫ్రీ లెఫ్ట్‌ వద్ద భార్యాభర్తలు బైక్‌పై వెళ్తుండగా, వారి వాహనం ఓ కారు అద్దానికి తగిలింది. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన కారు డ్రైవర్‌ బైక్‌ను వెంబడించి, కారుతో ఢీకొట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
కారు ఢీకొనడంతో బైక్‌పై ఉన్న దంపతులు రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఒక్క క్షణం సహనం కోల్పోతే రోడ్డుపై ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టింది. వాహనం అద్దానికి తగిలిన ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? దంపతుల బైక్‌ను కారు డ్రైవర్‌ ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టాడా? అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉన్నాయి.
ఘటనపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలు, వాహనాల కదలికలు, బాధితుల వాంగ్మూలం ఆధారంగా అసలు ఏం జరిగిందనే విషయాన్ని తేల్చనున్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder