- ప్రమాదంలో ఇద్దరు మృతి.. గంటల తరబడి ఎదురుచూసిన కుటుంబాలు
- ఉదయం ప్రమాదం జరిగితే రాత్రి వరకు పూర్తికాని పోస్టుమార్టం
- డ్యూటీ డాక్టర్, సూపరింటెండెంట్, ఆర్‌ఎంవో అందుబాటులో లేరని ఆరోపణ
- పరిహారం, పోలీసు చర్య కోరుతూ రహదారిపై బాధిత కుటుంబాల ధర్నా
సామాన్యుడి అస్త్రం / జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వ వ్యవస్థ మరింత వేదన మిగిల్చింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సజ్జాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉదయం సుమారు 10.30 గంటలకు ప్రమాదం జరిగిందని, మృతదేహాలను జహీరాబాద్ ఆస్పత్రికి తరలించినా రాత్రి 8 గంటల వరకు పోస్టుమార్టం నిర్వహించలేదని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. డ్యూటీ డాక్టర్‌తో పాటు ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంవో కూడా అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాయి.
కన్నవారిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న కుటుంబాలకు కనీస సమాచారం ఇచ్చే వారు కూడా లేకపోవడం ప్రభుత్వ వైద్య వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. పోస్టుమార్టం ఎప్పుడు చేస్తారు? సంబంధిత వైద్యుడు ఎక్కడ ఉన్నారు? అనే విషయాలను స్పష్టంగా చెప్పేవారు లేకపోవడంతో మృతుల బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ప్రమాదానికి కారణమైన డీసీఎం యజమాని నుంచి మృతుల కుటుంబాలకు న్యాయమైన పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ బంధువులు జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. అనంతరం జహీరాబాద్ పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట కూడా నిరసన చేపట్టారు. ధర్నా కారణంగా రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ప్రమాదానికి సంబంధించి కోహీర్ ఎస్సై తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం లేదని బాధితులు ఆరోపించారు. “దళితుల ప్రాణాలంటే లెక్క లేదా?” అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, కోహీర్ ఎస్సైపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఒకవైపు వైద్యుల కోసం ఎదురుచూపులు, మరోవైపు కేసు నమోదు కోసం పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తమను తీవ్రంగా బాధించిందని కుటుంబ సభ్యులు వాపోయారు. వైద్యుల గైర్హాజరు, పోస్టుమార్టం ఆలస్యం, కేసు నమోదుకు సంబంధించిన ఆరోపణలపై ఆస్పత్రి అధికారులు, పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.