GHMC

సర్కారీ శికంలో బహుళ అంతస్తులు.. ఇక కఠిన చర్యలే!

సర్కారీ శికంలో బహుళ అంతస్తులు.. ఇక కఠిన చర్యలే!

సర్వే నంబర్‌ 151లో ప్రభుత్వ హెచ్చరిక బోర్డు.. నిర్మాణాలు కొనసాగిస్తే క్రిమినల్‌ కేసులు

  • దీప్తిశ్రీనగర్‌లోని చెరువు సర్కారీ శికం భూమిపై రెవెన్యూ అధికారుల చర్య
  • తెలంగాణ భూఆక్రమణ చట్టం–1905 కింద కేసులు తప్పవన్న తహసీల్దార్‌
  • నిర్మాణాన్ని తొలగించి మొత్తం భూమిని స్వాధీనం చేసుకోవాలని ‘జనం కోసం’ డిమాండ్‌

సామాన్యుడి అస్త్రం / హఫీజ్‌పేట్‌ :
ప్రభుత్వ భూమిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడితే చూస్తూ ఊరుకునేది లేదని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. హఫీజ్‌పేట్‌ పరిధిలోని దీప్తిశ్రీనగర్‌ సర్వే నంబర్‌ 151లో బై నంబర్లతో నిర్మిస్తున్న భవనం వద్ద ప్రభుత్వ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ స్థలం చెరువు సర్కారీ శికం భూమిగా పేర్కొంటూ, నిర్మాణ పనులు కొనసాగిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌ కమ్‌ తహసీల్దార్‌ మహిపాల్‌రెడ్డి ఆదేశాలతో భవనానికి ఏర్పాటు చేసిన బ్యానర్‌లో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎవరైనా భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించినా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగించినా తెలంగాణ భూఆక్రమణ చట్టం–1905 ప్రకారం న్యాయపరమైన, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రభుత్వ బోర్డు పెట్టారు.. నిర్మాణాన్ని తొలగించేదెప్పుడు?

ప్రభుత్వ భూమిగా గుర్తించిన స్థలంలో ఇప్పటికే బహుళ అంతస్తుల నిర్మాణం ఎలా మొదలైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పునాదుల దశలోనే అడ్డుకోవాల్సిన రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు భవనం అంతస్తులు పెరిగే వరకు ఎందుకు పట్టించుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయడం మంచి పరిణామమే అయినప్పటికీ, కేవలం బ్యానర్‌తో సరిపెడతారా? నిర్మాణాన్ని తొలగించి భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకుంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత కూడా రాత్రివేళల్లో లేదా సెలవు రోజుల్లో పనులు కొనసాగకుండా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

1202+374 గజాల భూమిని కాపాడాలి

సర్వే నంబర్‌ 151లోని 1202+374 చదరపు గజాల పూర్తి చెరువు సర్కారీ శికం స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ‘జనం కోసం’ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూమిలో చేపట్టిన నిర్మాణాన్ని వెంటనే తొలగించి, స్థలం చుట్టూ శాశ్వత కంచె ఏర్పాటు చేయాలని కోరారు.

రెవెన్యూ అధికారులు కబ్జాదారులతో దోబూచులాడడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఒకవైపు ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేసి, మరోవైపు నిర్మాణాన్ని అలాగే వదిలేస్తే ప్రజల్లో అనుమానాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని స్పష్టం చేశారు.

ఆక్రమణకు సహకరించిన వారిపైనా విచారణ జరపాలి

ప్రభుత్వ రికార్డుల్లో చెరువు సర్కారీ శికంగా ఉన్న భూమికి బై నంబర్లు ఎలా వచ్చాయి? నిర్మాణానికి అనుమతులు ఎవరు ఇచ్చారు? విద్యుత్‌, నీటి కనెక్షన్లు మంజూరయ్యాయా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

భవన యజమానులతోపాటు నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి పట్టించుకోని సంబంధిత అధికారుల బాధ్యతను కూడా నిర్ధారించాలని కోరుతున్నారు. రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డుతో ఆగకుండా నిర్మాణాన్ని తొలగించి, పూర్తి స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder