రోడ్ల గుంతలు పూడ్చండి.. కరెంట్ వైర్లు సరిచేయండి: జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్
- నిమజ్జన మార్గాలకు ముందస్తు ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్
- చెరువుల వద్ద క్రేన్లు, లైటింగ్, తాగునీటి ఏర్పాట్లు
- అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశం
సామాన్యుడి అస్త్రం / శేరిలింగంపల్లి :
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, గణేశ్ నిమజ్జన వేడుకల నిర్వహణలో ఎక్కడా లోపాలకు తావివ్వొద్దని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి ముందస్తు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో CMC, పోలీస్, ట్రాఫిక్, HYDRAA, నీటిపారుదల, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, జలమండలితోపాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణేశ్ ఉత్సవాలకు లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని నారాయణ్ అమిత్ పేర్కొన్నారు. ఒక శాఖ సమస్యను మరో శాఖపై నెట్టకుండా, సమష్టి బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్‌కు బ్రేక్ పడొద్దు
గణేశ్ నిమజ్జన ఊరేగింపుల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఊరేగింపులు సాగే మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే డైవర్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు.
ప్రధాన రహదారులపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చాలని, అవసరమైన ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భారీ విగ్రహాలను తరలించే వాహనాలకు ఆటంకం కలగకుండా రూట్లను ముందుగానే పరిశీలించాలని స్పష్టం చేశారు.
చెరువుల వద్ద క్రేన్లు, లైటింగ్ ఏర్పాటు
HYDRAA, నీటిపారుదల శాఖలు సమన్వయంతో నిమజ్జన చెరువుల వద్ద ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సంఖ్యలో క్రేన్లు, లైటింగ్, భద్రతా ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని అధికారులు సూచించారు. చెరువుల పర్యావరణం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం రోజున విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లు, అదనపు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని విద్యుత్ శాఖకు సూచించారు. ఊరేగింపు మార్గాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లు, కేబుళ్లను ముందుగానే సరిచేయాలని ఆదేశించారు.
తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
ఉత్సవ మండపాలు, నిమజ్జన ఘాట్ల వద్ద జలమండలి ఆధ్వర్యంలో నిరంతర తాగునీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను పూజించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఉత్సవ కమిటీలకు అధికారులు పిలుపునిచ్చారు. భక్తుల భద్రత, సౌకర్యం విషయంలో ఎక్కడా రాజీపడకుండా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ స్పష్టం చేశారు. సమావేశంలో అన్ని సర్కిళ్ల ఉప కమిషనర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.