- మాతృ పత్రాల నుంచి లింకు డాక్యుమెంట్ల వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని రెవెన్యూ శాఖ నిర్ణయం
- 30 రోజుల్లో ప్రాథమిక నివేదిక సిద్ధం చేసేలా కార్యాచరణ
- పట్టా భూములతో కలిసిన ప్రభుత్వ స్థలాలపై క్షేత్రస్థాయి సర్వే
- 22–ఏ బాధితుల వినతుల పరిశీలనకు ఉన్నతస్థాయి కమిటీ
సామాన్యుడి అస్త్రం / సిటీ బ్యూరో : ప్రభుత్వ భూములను ఆక్రమించినవారెవరు? పట్టా భూముల ముసుగులో సర్కారు స్థలాలను కలిపేసిందెవరు? వివాదాస్పద భూములకు సంబంధించిన మాతృ పత్రాలు, లింకు డాక్యుమెంట్లలో ఏముంది? ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టేందుకు రెవెన్యూ శాఖ సమగ్ర పరిశీలనకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను నిగ్గుతేల్చాలని నిర్ణయించినట్లు సమాచారం.
ప్రభుత్వ ఆదేశాలతో భూపరిపాలన ప్రధాన కమిషనర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగాలు కలిసి భూముల లింకు డాక్యుమెంట్లను పరిశీలించనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెల్లడైన వివరాల మేరకు, ఆక్రమణలపై రెవెన్యూ శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది.
30 రోజుల్లో ప్రాథమిక నివేదిక
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి ప్రాథమిక నివేదిక సమర్పించాలనే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. పట్టా భూముల్లో ప్రభుత్వ స్థలాలు కలిసిపోయినట్లు రికార్డుల్లో కనిపిస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించనున్నారు.
జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అందిన వెంటనే రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, సర్వేయర్లు రంగంలోకి దిగనున్నారు. భూముల హద్దులు, పాత రికార్డులు, మాతృ పత్రాలు, వరుస లింకు డాక్యుమెంట్లు, క్షేత్రస్థాయి పరిస్థితులను సరిపోల్చి అసలు స్వరూపాన్ని గుర్తించనున్నారు. రికార్డుల్లో ఒకలా, క్షేత్రస్థాయిలో మరోలా ఉన్న భూముల విషయంలో మరింత లోతుగా విచారణ జరపనున్నారు.
సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణపై కసరత్తు
సింగరేణి భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారికి స్థలాలను క్రమబద్ధీకరించే అంశంపైనా రెవెన్యూ శాఖ మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. గతంలో దరఖాస్తు చేసుకొని క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్నవారు ఎంతమంది? ప్రక్రియ పూర్తయినా కన్వేయన్స్ డీడ్లు అందాల్సినవారు ఎందరున్నారు? ప్రస్తుతం ఆయా భూముల పరిస్థితి ఏమిటి? అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు తెలిసింది.
మార్గదర్శకాలను సిద్ధం చేసిన అనంతరం సింగరేణి సంస్థ, రెవెన్యూ శాఖ కలిసి తుది నిర్ణయం తీసుకోనున్నాయి. ఆ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి పరిశీలనకు పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం.
22–ఏ బాధితుల వినతులపై ఉన్నతస్థాయి కమిటీ
నిషేధిత భూముల జాబితాలో జరిగిన చేర్పులు, మార్పులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో కొత్త మార్గదర్శకాల రూపకల్పనకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. 22–ఏ జాబితాలో చేరిన పట్టా భూములు, ప్రైవేటు స్థలాలు, నివాస ప్రాంతాలు, వాటికి సంబంధించిన ఆధారాలన్నింటినీ సిద్ధం చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు అందినట్లు తెలిసింది.
బాధితుల నుంచి వచ్చే వినతులను పరిశీలించేందుకు రెవెన్యూ, స్టాంపులు–రిజిస్ట్రేషన్లు, న్యాయశాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. అయితే సర్వేలు కేవలం కాగితాల పరిశీలనకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పారదర్శకంగా జరగాలి. ప్రభుత్వ భూములను ఆక్రమించినవారిపై చర్యలతోపాటు తప్పుగా నిషేధిత జాబితాలో చేరిన నిజమైన పట్టాదారులకు న్యాయం చేయడమే ఈ ప్రక్రియకు అసలైన పరీక్ష కానుంది.