- హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి ఆరోపణలు
• మహిళను లాఠీతో కొట్టి, జుట్టుపట్టుకుని లాగినట్లు వైరల్ వీడియోలో ఆరోపణ
• ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ తీరుపై విమర్శలు
• ఘటనపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలని డిమాండ్
సామాన్యుడి అస్త్రం / హఫీజ్‌పేట : హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళపై ఆర్‌పీఎఫ్ సిబ్బంది దాడి చేసినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. నూర్ మసీదు పక్కన ఆదిత్యనగర్ వద్ద శుక్రవారం రాత్రి జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
వీడియోలో ఓ మహిళను లాఠీతో కొట్టడంతో పాటు జుట్టుపట్టుకుని లాగుతున్నట్లుగా కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే అంతకుముందు సదరు మహిళ దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలం ఉపయోగించినట్లు స్థానికుల కథనం. ఈ క్రమంలోనే వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఘర్షణకు దారితీసినట్లు చెబుతున్నారు.
మహిళ ప్రవర్తన ఎలా ఉన్నప్పటికీ ఆమెపై బలప్రయోగం అవసరమైందా, ఘటనకు ముందు ఏం జరిగింది, వైరల్ వీడియో పూర్తి సందర్భాన్ని ప్రతిబింబిస్తోందా అనే అంశాలపై నిష్పక్షపాత విచారణ జరపాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ ఘటనపై సంబంధిత అధికారుల అధికారిక వివరణ ఇంకా వెలువడాల్సి ఉంది. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.