Telangana

మహిళ జుట్టుపట్టి ఈడ్చిన హోంగార్డు.. కేసు నమోదు, అరెస్ట్!

మహిళ జుట్టుపట్టి ఈడ్చిన హోంగార్డు.. కేసు నమోదు, అరెస్ట్!
  • ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కాదని రైల్వే శాఖ స్పష్టీకరణ
  • హఫీజ్‌పేట్‌ రైల్వే స్టేషన్‌ వద్ద మహిళపై దురుసు ప్రవర్తన
  • వైరల్‌ వీడియోపై స్పందించిన అధికారులు.. తెలంగాణ పోలీస్‌ హోంగార్డుగా గుర్తింపు
  • నిందితుడు ఆనంద్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న మియాపూర్‌ పోలీసులు
సామాన్యుడి అస్త్రం / హఫీజ్‌పేట్‌ :
హఫీజ్‌పేట్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ మహిళపై యూనిఫాంలో ఉన్న సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మహిళను కొట్టడంతో పాటు జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లినట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో అధికారులు స్పందించారు. తొలుత దాడికి పాల్పడిన వ్యక్తి రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) కానిస్టేబుల్‌గా ప్రచారం జరిగింది. అయితే దక్షిణ మధ్య రైల్వే విచారణ అనంతరం అతను ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది కాదని, తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శాఖకు చెందిన హోంగార్డు అని స్పష్టం చేసింది.

వైరల్‌ వీడియోతో వెలుగులోకి..

శుక్రవారం రాత్రి హఫీజ్‌పేట్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. వీడియోలో యూనిఫాంలో ఉన్న వ్యక్తి ఓ మహిళతో వాగ్వాదానికి దిగడం, ఆ తర్వాత ఆమెపై దాడి చేసి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లడం కనిపిస్తోంది. అక్కడున్న మరో వ్యక్తి అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ మహిళను కొంతదూరం ఈడ్చుకెళ్లిన దృశ్యాలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.

ఆర్‌పీఎఫ్‌ కాదు.. తెలంగాణ పోలీస్‌ హోంగార్డు
వీడియో వైరల్‌ కావడంతో తొలుత సంబంధిత వ్యక్తిని ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పేర్కొంటూ ప్రచారం జరిగింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఆర్‌పీఎఫ్‌కు చెందినవాడు కాదని, తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శాఖకు చెందిన హోంగార్డు అని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. హఫీజ్‌పేట్‌ రైల్వే స్టేషన్‌లో విధుల కోసం డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఘటన అనంతరం అతడిని తిరిగి రాష్ట్ర పోలీస్‌ శాఖకు పంపించి, తదుపరి క్రమశిక్షణ చర్యల కోసం అప్పగించినట్లు పేర్కొన్నారు.

డీజీపీ ఆదేశాలు.. మియాపూర్‌ పోలీసుల చర్య
ఘటనపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ స్పందించారు. సంబంధిత హోంగార్డుపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్‌ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం మియాపూర్‌ పోలీసులు నిందితుడు ఆనంద్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, వీడియోలో నమోదైన పరిణామాలపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder