- విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేసే విద్యాసంస్థలపై చర్యలకు డిమాండ్
- ఫీజు రీయింబర్స్‌మెంట్ మార్గదర్శకాల జీవో నంబర్ 9 అమలు చేయాలని పిలుపు
- ఓయూ, కేయూ, పాలమూరు వర్సిటీ విద్యార్థుల మద్దతు
సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వ ఖాతాల్లో కనిపించే లెక్కలు మాత్రమే కాదని, వాటి వెనుక చదువు పూర్తిచేసుకుని సర్టిఫికెట్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది విద్యార్థుల భవిష్యత్తు ఉందని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్‌గౌడ్ పేర్కొన్నారు. విద్యార్థుల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనసేన విద్యార్థి విభాగం నాయకుడు మిరియాల రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో నిర్వహించిన ‘జనసేన విద్యార్థి పోరు దీక్ష’లో శంకర్‌గౌడ్ పాల్గొన్నారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో కొన్ని విద్యాసంస్థలు విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేసి ఒత్తిడికి గురిచేస్తున్నాయన్న ఫిర్యాదులను ప్రస్తావించిన ఆయన, అటువంటి విధానాన్ని ప్రభుత్వం అరికట్టాలని కోరారు. దీక్ష ప్రారంభానికి ముందు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరులను స్మరించుకున్నారు.

పార్టీ ప్రచార కార్యదర్శి సాగర్ ఆర్‌కే నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం మళ్లీ విద్యార్థులే రోడ్డెక్కాల్సి రావడం దురదృష్టకరమన్నారు. “విద్యార్థులతో పెట్టుకుంటే కొరివితో వీపు గోక్కున్నట్లే” అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మిరియాల రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. జీవో నంబర్ 9ని పకడ్బందీగా అమలు చేసి బకాయిలను విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రకటించారు. జనసేన నేత, ఓయూ జేఏసీ నాయకుడు సంపత్‌నాయక్ విద్యార్థుల న్యాయమైన పోరాటానికి అండగా ఉంటామన్నారు.

దీక్షకు ఉస్మానియా, కాకతీయ, పాలమూరు విశ్వవిద్యాలయాల విద్యార్థులు, పలు విద్యార్థి, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. కార్యక్రమంలో దుంపటి శ్రీనివాస్, ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్, దామోదర్‌రెడ్డి, మేకల సతీష్‌రెడ్డి, మహేష్ పెంటలతోపాటు జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.