- భారతి నగర్ ఎల్‌ఐజీ బస్‌స్టాప్‌లో జయశంకర్ 92వ జయంతి
- చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆదర్శ్‌రెడ్డి
- తెలంగాణకు ఆయన చూపిన మార్గం నేటికీ స్ఫూర్తిదాయకమని వ్యాఖ్య
సామాన్యుడి అస్త్రం / భారతి నగర్: ఒక రాష్ట్రం అధికారికంగా పటంలో ఏర్పడకముందే ప్రజల మనసుల్లో ఆ ఆకాంక్షను బలంగా నాటిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఆదర్శ్‌రెడ్డి కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతిని పురస్కరించుకుని పటాన్‌చెరు నియోజకవర్గంలోని భారతి నగర్ డివిజన్ ఎల్‌ఐజీ బస్‌స్టాప్ ప్రాంగణంలో గురువారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదర్శ్‌రెడ్డి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు జయశంకర్ అందించిన సిద్ధాంతపరమైన బలం, చేసిన త్యాగం, ప్రజల్లో కలిగించిన చైతన్యం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఆధారాలతో వివరించి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే పరిష్కారమని దశాబ్దాలపాటు ప్రజలకు తెలియజేసిన గొప్ప మేధావి జయశంకర్ అని ఆదర్శ్‌రెడ్డి అన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగిన ప్రతి దశలోనూ ఆయన ఆలోచనలు దిక్సూచిగా పనిచేశాయని గుర్తుచేశారు. తెలంగాణ సమాజానికి జయశంకర్ అందించిన మార్గదర్శకత్వం నేటి తరానికే కాకుండా భావితరాలకు కూడా స్ఫూర్తిదాయకమని తెలిపారు.

జయశంకర్‌ను స్మరించుకోవడం అంటే కేవలం చిత్రపటానికి పూలమాల వేయడం కాదని, ఆయన కలలుగన్న ఆత్మగౌరవ, సమాన అభివృద్ధితో కూడిన తెలంగాణ కోసం పనిచేయడమే నిజమైన నివాళి అని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల హక్కుల పరిరక్షణలో ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్‌రెడ్డి, రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పరమేష్‌యాదవ్, ఎల్‌ఐజీ సొసైటీ అధ్యక్షుడు యాదగిరిరెడ్డి, డైరెక్టర్లు లక్ష్మణ్, రాజాలింగం, సామ్యూల్‌జాన్‌తోపాటు అజీముద్దీన్, ఐలేష్‌యాదవ్, అబ్బు, జకీర్, అరుణజ్యోతి, వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సరిత, రాణియాదవ్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.