- చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు వచ్చేవరకు దేశవ్యాప్త ఉద్యమం
- బడ్జెట్ సమావేశాల్లోపు బిల్లుకు ఆమోదం లేకుంటే ‘ఛలో ఢిల్లీ’
- ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీల న్యాయం కోసం 11 తీర్మానాలు
సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్ : సామాజిక న్యాయ తెలంగాణ సాధనే లక్ష్యంగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో టీఆర్ఎస్ నిర్వహించిన ‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’లో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు ఆమోదించి పంపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. స్పందన లేకుంటే వెయ్యి కార్లతో ‘ఛలో ఢిల్లీ’ చేపడతామని హెచ్చరించారు. “నా పుట్టుక నా చేతిలో లేదు.. ఎవరి కోసం పనిచేయాలో నిర్ణయించుకోవడం మాత్రం నా చేతుల్లోనే ఉంది” అని కవిత వ్యాఖ్యానించారు. తాను బీసీల కోసం మాట్లాడితే అగ్రకులంలో పుట్టిన వ్యక్తివంటూ కొందరు హేళన చేస్తున్నారని, అయినా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం సాధించే వరకు తన జీవితాన్ని అంకితం చేస్తానని ప్రకటించారు. సామాజిక న్యాయం అంటే ఎవరి అవకాశాలనో లాక్కోవడం కాదని, వంద మందికి ఉన్న వనరులు కొద్దిమందికే పరిమితం కాకుండా అందరికీ సమానంగా చేరడమేనని వివరించారు. బీసీ ముస్లింలను పక్కనపెట్టి కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్లంటూ ప్రచారం చేస్తోందని ఆరోపించిన కవిత, రేవంత్‌రెడ్డి–కిషన్‌రెడ్డి వ్యవహారం “గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ”గా ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయ లెక్కలు పక్కనపెట్టి బీసీ బిల్లుకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని సవాల్ విసిరారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ప్రత్యేక నోటిఫికేషన్, ఆదివాసీలకు అడవులపై హక్కులు, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు సముచిత అవకాశాలు దక్కాలని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్‌కు పద్మవిభూషణ్‌తోపాటు ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేయాలని, జ్యోతిరావ్ పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామగ్రామాన సంకల్ప సభలు నిర్వహించి, వచ్చే ఏడాది ఆగస్టు 6న ఉద్యమ పురోగతిని సమీక్షిస్తామని ప్రకటించారు.
