- ఇజ్జత్‌నగర్‌లో ఘనంగా AIYF శేరిలింగంపల్లి మండల రెండో మహాసభ
- అధ్యక్షురాలిగా టి.జ్ఞానేశ్వరి, కార్యదర్శిగా కంటే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ఉద్యోగ క్యాలెండర్ అమలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలకు డిమాండ్
సామాన్యుడి అస్త్రం / శేరిలింగంపల్లి: రాష్ట్రంలో నిరుద్యోగం రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో యువత సమస్యలపై సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత యువజన సమాఖ్య నాయకులు పిలుపునిచ్చారు. AIYF శేరిలింగంపల్లి మండల రెండో మహాసభ బుధవారం ఇజ్జత్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయంలో ఉత్సాహభరితంగా నిర్వహించారు.
మహాసభకు సీపీఐ రాష్ట్ర నాయకుడు టి.రామకృష్ణ, AIYF రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.శివకుమార్‌గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీపీఐ శేరిలింగంపల్లి మండల కార్యదర్శి కె.చందుయాదవ్, సహాయ కార్యదర్శి జె.శ్రీనివాస్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శివకుమార్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రకటించిన ఉద్యోగ క్యాలెండర్‌ను కాగితాలకే పరిమితం చేయకుండా కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతలో నిరాశ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను సకాలంలో విడుదల చేయడంతోపాటు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
యువత ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యల పరిష్కారంతోపాటు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు బలమైన ఉద్యమాలు అవసరమని నాయకులు పేర్కొన్నారు. ప్రతి యువకుడు AIYFలో చేరి ప్రజా సమస్యలపై జరిగే ఉద్యమాల్లో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
మహాసభ అనంతరం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా టి.జ్ఞానేశ్వరి, కార్యదర్శిగా కంటే శివకుమార్, ఉపాధ్యక్షుడిగా ఎం.అశోక్ ఎన్నికయ్యారు. యువత సమస్యలు, విద్య, ఉద్యోగాలు, ప్రజాస్వామ్య హక్కుల సాధన కోసం నిరంతరం ప్రజల్లో ఉంటామని నూతన కమిటీ ప్రకటించింది.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంటే వెంకటస్వామి, టి.రాములు, ఎస్.కొండల్, జె.తిరుపతి, టి.మల్లేష్‌తోపాటు ప్రజానాట్య మండలి నాయకులు కె.సుధాకర్, బి.రామస్వామి, ఎస్.కుమార్, జె.తేజ, టి.నితేష్ తదితరులు పాల్గొన్నారు.