- చికిత్సలు, పరీక్షలు, ఆపరేషన్లకు నిర్ణీత ధరలు సూచించిన కమిటీ
- అడ్మిషన్‌కు ముందే పూర్తి ఖర్చు అంచనా ఇవ్వాలని సిఫారసు
- ఇవి ఇంకా సిఫారసులే.. కేంద్రం ఆమోదిస్తేనే కొత్త నిబంధనలు
సామాన్యుడి అస్త్రం / న్యూఢిల్లీ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో అడ్డగోలు బిల్లులు, అనవసర పరీక్షలు, భారీ గది అద్దెలతో రోగుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్న నేపథ్యంలో పార్లమెంటరీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ స్థాయీ సంఘం కీలక సిఫారసులు చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్సలు, రోగ నిర్ధారణ పరీక్షలు, సాధారణ వైద్య ప్రక్రియల ధరలను దేశవ్యాప్తంగా ప్రామాణికీకరించి గరిష్ఠ పరిమితి విధించే వ్యవస్థను వెంటనే రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ సిఫారసులు 2026 ఆగస్టు 7న పార్లమెంటుకు సమర్పించిన 176వ నివేదికలో భాగంగా ఉన్నాయి. ఈ నివేదికలో మొత్తం 368 సిఫారసులు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రకటన వెల్లడించింది.
ముందే చెప్పాలి.. చివర్లో షాక్ బిల్లు వద్దు!
క్లిష్టమైన లేదా దీర్ఘకాలిక చికిత్స ప్రారంభించే ముందే రోగి కుటుంబానికి మొత్తం వ్యయంపై సమగ్ర, చట్టబద్ధమైన అంచనా పత్రాన్ని అందించాలని కమిటీ సూచించింది. వైద్యుల ఫీజు, పరీక్షలు, మందులు, వైద్య పరికరాలు, వినియోగ వస్తువులు, శస్త్రచికిత్స అనంతర సంరక్షణను కలిపి ఒకే ప్యాకేజీ ధరను ప్రకటించాలని పేర్కొంది. ప్రతి ఆస్పత్రి చికిత్సలు, పరీక్షల ధరలను బహిరంగంగా ప్రదర్శించాలని, అధిక బిల్లులు–బీమా వివాదాల పరిష్కారానికి స్వతంత్ర ఫాస్ట్‌ట్రాక్ అంబుడ్స్‌మన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. రోగులకు ఆర్థిక వివరాలు తెలియజేసేందుకు ప్రత్యేకంగా ‘ఫైనాన్షియల్ నావిగేటర్లను’ నియమించాలని సూచించింది.
రూమ్ రెంట్‌కు ‘త్రీ స్టార్’ పరిమితి!
మెట్రో నగరాల్లో ప్రైవేట్ ఆస్పత్రుల బేసిక్ గది అద్దె, సమీపంలోని త్రీ స్టార్ హోటళ్ల సగటు గది ధరను మించకూడదని కమిటీ ప్రతిపాదించింది. అయితే నర్సింగ్, రెసిడెంట్ డాక్టర్, భోజనం, లాండ్రీ, వైద్య వినియోగ వస్తువుల ఖర్చులను విడిగా చేర్చవచ్చని తెలిపింది. గది కేటగిరీ ఆధారంగా ఒకే ఆపరేషన్‌కు వేర్వేరు ధరలు వసూలు చేసే విధానాన్ని రద్దు చేయాలని పేర్కొంది. ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక్కసారి చేరితే కుటుంబం సగటున రూ.34,064 సొంతంగా ఖర్చు చేస్తోందని కమిటీ ప్రస్తావించింది. అధికారిక జాతీయ ఆరోగ్య ఖాతాల ప్రకారం 2022–23లో మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రజలు నేరుగా భరించిన వాటా 43.4 శాతంగా ఉంది. అయితే ఇవి వెంటనే అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ కావు. పార్లమెంటరీ కమిటీ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి, చట్టం లేదా మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాతే ఆస్పత్రులకు తప్పనిసరి అవుతాయి.