Andhra Pradesh

13 ఏళ్ల బాలిక ప్రాణాలతో పోరాటం.. కార్పొరేట్‌ విద్య పేరిట వేధింపులా?

13 ఏళ్ల బాలిక ప్రాణాలతో పోరాటం.. కార్పొరేట్‌ విద్య పేరిట వేధింపులా?
  • సత్యనారాయణపురం రవీంద్ర భారతి పాఠశాలలో తీవ్ర కలకలం
  • యాజమాన్య వేధింపులే కారణమంటున్న బాలిక తల్లిదండ్రులు
  • కేసు నమోదు.. సీసీటీవీ దృశ్యాలపై పోలీసుల దృష్టి

సామాన్యుడి అస్త్రం / విజయవాడ : కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో మార్కులు, క్రమశిక్షణ పేరుతో విద్యార్థులపై పెరుగుతున్న మానసిక ఒత్తిడిపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నర్రావారి వీధిలో ఉన్న రవీంద్ర భారతి పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. పాఠశాల భవనం ఎత్తైన ప్రదేశం నుంచి కిందపడిన బాలికకు తీవ్ర గాయాలు కావడంతో సిబ్బంది సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం.


వేధింపులే కారణమా?

తమ కుమార్తెను పాఠశాల యాజమాన్యం, సిబ్బంది కొంతకాలంగా మానసికంగా వేధించారని బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థుల ముందు అవమానించడం, చదువు పేరుతో ఒత్తిడికి గురిచేయడం వంటి పరిణామాలు ఏమైనా జరిగాయా అనే కోణంలో విచారణ జరపాలని కోరుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై పాఠశాల యాజమాన్యం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

కెమెరాలు నిజం చెబుతాయా?

ఘటనకు ముందు బాలిక ఎవరితో మాట్లాడింది? తరగతి గదిలో ఏం జరిగింది? ఉపాధ్యాయులు లేదా సిబ్బంది మందలించారా? సంఘటన అనంతరం తల్లిదండ్రులు, పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారా? అనే ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. పాఠశాలలోని సీసీటీవీ దృశ్యాలు ఈ కేసులో కీలకంగా మారనున్నాయి. సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సీఐ లక్ష్మీనారాయణ ఆస్పత్రికి వెళ్లి బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతోపాటు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం.


విద్యాశాఖ మౌనం వీడాలి

పాఠశాలలో కౌన్సెలింగ్‌ వ్యవస్థ, బాలల రక్షణ కమిటీ, భద్రతా ప్రమాణాలు అమల్లో ఉన్నాయా అనే అంశాలను విద్యాశాఖ పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక విచారణ కమిటీని నియమించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల వాంగ్మూలాలు నమోదు చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ఆరోపణలు రుజువైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు.


Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder