Andhra Pradesh

కేబినెట్ హోదాతో నాగబాబు బోణి! ‘ఏపీ గ్రీన్’ ఛార్జ్ తీసుకున్న వేళ పవన్ ప్రత్యేక శుభాకాంక్షలు

కేబినెట్ హోదాతో నాగబాబు బోణి! ‘ఏపీ గ్రీన్’ ఛార్జ్ తీసుకున్న వేళ పవన్ ప్రత్యేక శుభాకాంక్షలు
  • ఏపీ గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా బాధ్యతల స్వీకారం
  • మంగళగిరి అరణ్యభవన్‌లో ప్రత్యేక పూజల మధ్య పదవీ బాధ్యతలు
  • 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం సాధించడమే లక్ష్యం
సామాన్యుడి అస్త్రం / మంగళగిరి : జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ప్రభుత్వంలో కీలక బాధ్యతలతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. కేబినెట్‌ హోదా కలిగిన ఆంధ్రప్రదేశ్‌ సొసైటీ ఫర్‌ గ్రీనింగ్‌ అండ్‌ రీఫారెస్టేషన్‌ ఫర్‌ ఎకలాజికల్‌ ఎన్‌రిచ్‌మెంట్‌—‘ఏపీ గ్రీన్‌’ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
మంగళగిరిలోని అరణ్యభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నాగబాబు తన సతీమణి పద్మజతో కలిసి పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజల అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. పలువురు అటవీశాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు నాగబాబును కలిసి అభినందనలు తెలిపారు. ఈ పదవికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌ ర్యాంకు కల్పించింది. 

రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడం, అటవీ విస్తీర్ణాన్ని అభివృద్ధి చేయడం, పునరటవీకరణ కార్యక్రమాలను వేగవంతం చేయడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం ఏపీ గ్రీన్‌ ప్రధాన లక్ష్యాలు. ‘వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌–2047’లో భాగంగా రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, వృక్ష విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేయనుంది. ఏపీ గ్రీన్‌ పాలక మండలికి ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి పవన్‌ కల్యాణ్‌ నేతృత్వం వహిస్తుండగా, కార్యనిర్వాహక కమిటీని నాగబాబు ముందుకు నడిపించనున్నారు. 
నూతన బాధ్యతలు స్వీకరించిన నాగబాబుకు పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి, పర్యావరణంపై నాగబాబుకు ఉన్న ప్రేమ ఏపీ గ్రీన్‌ లక్ష్యాల సాధనకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మలిచి, భవిష్యత్‌ తరాలకు పచ్చని ఆంధ్రప్రదేశ్‌ను అందించే ప్రయత్నంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
నాగబాబుకు కేబినెట్‌ హోదా కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు సహకరించిన కూటమి పక్షాల నాయకులకు పవన్‌ కల్యాణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. పదవి, హోదాతోనే సరిపెట్టకుండా రాష్ట్రంలో పచ్చదనం పెంపు లక్ష్యాన్ని క్షేత్రస్థాయిలో ఎంతవరకు సాధిస్తారన్నదే ఇప్పుడు నాగబాబు ముందున్న అసలైన పరీక్ష.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder