- ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు తేల్చినా ఆగని నిర్మాణం
- కూల్చివేతల పేరుతో కాలయాపన.. రాజకీయ నాయకులు సూచించిన వాటిపైనే చర్యలంటూ ఆరోపణలు
- అనుమతులు రద్దుచేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రజాసంఘాల డిమాండ్
సామాన్యుడి అస్త్రం / శేరిలింగంపల్లి : అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నామని అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. భారీ యంత్రాలతో కూల్చివేతలు చేపడుతున్న దృశ్యాలు ప్రచారంలో కనిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వ భూములను ఆక్రమించి, నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్న బడాబాబుల వద్దకు వచ్చేసరికి అధికారుల యంత్రాంగం ఎందుకు ఆగిపోతోందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని రేగులకుంట చెరువు శిఖం భూమిలో కొనసాగుతున్న నిర్మాణమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్ 151లోని 372 గజాల ప్రభుత్వ భూమిని, సర్వే నంబర్ 150లో ఉన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించి జీహెచ్‌ఎంసీ అనుమతులు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద స్థలంలో ఏకంగా ఐదంతస్తుల భారీ భవనం నిర్మాణం కొనసాగుతున్నా అధికారులు అటువైపు చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఆదేశాలున్నా.. అమలెక్కడ?
ఈ భూమి ప్రభుత్వానికి చెందినదేనని రెవెన్యూ యంత్రాంగం గతంలో గుర్తించినట్లు తెలుస్తోంది. 2023లో అప్పటి శేరిలింగంపల్లి మండల డిప్యూటీ కలెక్టర్ నిర్మాణ అనుమతులను రద్దుచేయాలని జీహెచ్‌ఎంసీకి సూచించినట్లు కథనాలు వెలువడ్డాయి. 2026 ఫిబ్రవరిలో హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయని ‘జనం కోసం’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
రెవెన్యూ శాఖ గుర్తింపు, అనుమతుల రద్దుకు సూచనలు, న్యాయస్థానం ఆదేశాలు ఉన్నప్పటికీ నిర్మాణం మాత్రం ఆగకపోవడం వెనుక ఎవరున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. ఒక శాఖ ప్రభుత్వ భూమి అని చెబుతుంటే, మరో శాఖ అదే స్థలంలో నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చింది? ఆ అనుమతులను రద్దుచేయకుండా పట్టణ ప్రణాళిక విభాగం ఎందుకు కాలయాపన చేస్తోంది? క్షేత్రస్థాయి అధికారులు నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు?
ఈ ప్రశ్నలకు సంబంధిత అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
పేదల ఇళ్లకే బుల్డోజర్లా?
నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు పారదర్శకంగా జరగడం లేదనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. సామాన్యులు నిర్మించుకున్న చిన్న గదులు, ప్రహరీ గోడల వద్దకు అధికారులు వేగంగా చేరుకుంటున్నారు. కానీ ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మిస్తున్న భారీ భవనాల విషయంలో మాత్రం నోటీసులు, విచారణలు, సర్వేలు, కోర్టు కేసుల పేరుతో నెలలు, సంవత్సరాల తరబడి కాలయాపన జరుగుతోందని స్థానికులు మండిపడుతున్నారు.
ఏ భవనాన్ని కూల్చాలి? ఏ నిర్మాణాన్ని వదిలేయాలి? అనే నిర్ణయం అధికారిక రికార్డుల ఆధారంగా కాకుండా రాజకీయ నాయకుల సిఫారసుల ఆధారంగా జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకులు ఫిర్యాదు చేసిన లేదా ప్రత్యర్థులకు సంబంధించిన నిర్మాణాలపై మాత్రమే అధికారులు బుల్డోజర్లు పంపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అక్రమ నిర్మాణం ఎవరిదైనా అక్రమమే. అధికార పార్టీకి చెందినవారిదైతే ఒక న్యాయం, సామాన్యుడిదైతే మరో న్యాయం అమలు చేయడం చట్టపాలన కాదని ప్రజాసంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
గతంలో 1,200 గజాలు.. ఇప్పుడు మరో 372 గజాలు!
ఇదే ప్రాంతంలో గతంలో సుమారు 1,200 గజాలకు పైగా చెరువు భూమిని బై నంబర్ల పేరుతో చూపించి అపార్ట్‌మెంట్లు నిర్మించి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వాటి పక్కనే మరో 372 గజాల్లో భారీ భవనం నిర్మాణం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మొదటి ఆక్రమణ సమయంలోనే అధికారులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే ప్రస్తుతం మరో నిర్మాణానికి అవకాశం ఉండేది కాదని స్థానికులు అంటున్నారు. గతంలో జరిగిన ఆక్రమణలపై విచారణ జరపకుండా వదిలేయడమే ఇప్పుడు మరిన్ని అక్రమ నిర్మాణాలకు దారితీసిందని ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ భూముల్లో భవనాలు వెలుస్తున్నప్పుడు పరిశీలించాల్సిన రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, పట్టణ ప్రణాళిక, విజిలెన్స్ విభాగాలు ఏం చేస్తున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
కూల్చివేతల ప్రకటనలు కాదు.. చర్యలు కావాలి
అక్రమ నిర్మాణంపై నోటీసు ఇచ్చామని, పరిశీలిస్తున్నామని, ఉన్నతాధికారులకు నివేదిక పంపామని చెప్పడం అధికారులకు పరిపాటిగా మారిందనే విమర్శలు ఉన్నాయి. నోటీసులు జారీచేయడమే చర్య అయితే, ఏళ్ల తరబడి నిర్మాణాలు ఎలా కొనసాగుతున్నాయి? అనుమతులను రద్దుచేయాలని ఆదేశాలు ఉన్నా విద్యుత్, నీరు, ఇతర సౌకర్యాలు ఎలా అందుతున్నాయి?
‘డెమాలిషన్ చేపడతాం’ అంటూ ప్రకటనలు చేసి కాలయాపన చేయకుండా, వివాదాస్పద అనుమతులను వెంటనే రద్దుచేసి నిర్మాణాన్ని నిలిపివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, భూమి వివరాలతో హెచ్చరిక బోర్డులు పెట్టాలని కోరుతున్నారు.
అధికారుల పాత్రపైనా విచారణ జరగాలి
అక్రమ నిర్మాణం చేసిన వారిపైనే కాకుండా వారికి అనుమతులు ఇచ్చిన అధికారులు, క్షేత్రస్థాయి తనిఖీలు చేయని సిబ్బంది, చర్యలు తీసుకోకుండా ఫైళ్లను తొక్కిపెట్టిన వారిపైనా శాఖాపరమైన విచారణ జరగాలి. తప్పుడు పత్రాలు సమర్పించినట్లు నిర్ధారణైతే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్, భూకబ్జా కేసులు నమోదు చేయాలి.
రేగులకుంట చెరువు శిఖం భూమికి సంబంధించిన పూర్తి సర్వే వివరాలు, ఇచ్చిన నిర్మాణ అనుమతులు, వాటి రద్దుకు జారీచేసిన ఆదేశాలు, అధికారులు తీసుకున్న చర్యలను ప్రజల ముందుంచాలి. అప్పుడే ప్రభుత్వ భూముల పరిరక్షణపై అధికారులకు చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది.
లేకపోతే కూల్చివేతల జాబితాలు ప్రభుత్వ కార్యాలయాల్లో కాకుండా రాజకీయ నాయకుల కార్యాలయాల్లో తయారవుతున్నాయనే ఆరోపణలకు అధికారులే బలం చేకూర్చినట్లవుతుంది.