హైదరాబాద్/శేరిలింగంపల్లి:
వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలిగించే వాటర్‌లాగింగ్ సమస్యపై శేరిలింగంపల్లి జోనల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఐఏఎస్, డిప్యూటీ కమిషనర్‌తో కలిసి వర్షపు నీరు నిలిచే అవకాశం ఉన్న పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా మల్కం చెరువు పరిసరాలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రాంతంతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) క్యాంపస్ పరిసరాల్లోని ప్రధాన వాటర్‌లాగింగ్ పాయింట్లను అధికారులు పరిశీలించారు. వర్షం కురిసిన సమయంలో నీరు ఎక్కడి నుంచి వచ్చి చేరుతోంది, నీటి ప్రవాహానికి అడ్డంకులు ఎక్కడ ఏర్పడుతున్నాయి, నాలాలు–వరద కాలువల పరిస్థితి ఎలా ఉందన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలకు ఆనుకుని ఉన్న వరద నీటి మార్గాలపై అధికారులు దృష్టి సారించారు. నీరు నిలిచిపోవడం వల్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తించారు.చిన్న వర్షానికే రహదారులపై నీరు నిలవడం, వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవడం, లోతట్టు కాలనీల ప్రజలు ఆందోళనకు గురికావడం శేరిలింగంపల్లి ప్రాంతంలో కొత్త సమస్యేమీ కాదు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయికి రావడం సమస్య తీవ్రతను అర్థం చేసుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది.
అయితే అధికారుల పర్యటనతోనే సమస్య ముగిసిపోదు. గుర్తించిన ప్రాంతాల్లో నాలాల పూడికతీత, వ్యర్థాల తొలగింపు, వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు అవసరమైన మార్గాల పునరుద్ధరణ వంటి పనులను వేగంగా చేపట్టాల్సి ఉంది. రాబోయే భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు నిజమైన ఉపశమనం లభిస్తుంది.