ఈ సందర్భంగా జోనల్ కమిషనర్‌తోపాటు శేరిలింగంపల్లి జోన్, సర్కిల్ పరిధిలోని ఉన్నతాధికారులు, వివిధ విభాగాల సిబ్బంది జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన తెలంగాణ సమాజానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.
జయశంకర్ సార్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సిద్ధాంత రూపమిచ్చిన గొప్ప మేధావి అని జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అవసరమో గణాంకాలు, చారిత్రక ఆధారాలతో సమాజానికి వివరించిన ఆయన కృషి చిరస్మరణీయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని చెప్పారు.
జయశంకర్ సార్ ఆశయాలను స్మరించుకోవడం అంటే కేవలం ఆయన చిత్రపటానికి పూలమాల వేయడం మాత్రమే కాదని, ప్రజల సమస్యలకు స్పందిస్తూ నిజాయతీగా విధులు నిర్వర్తించడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. జోనల్, సర్కిల్ కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన జయశంకర్ సార్ చూపిన మార్గం ప్రభుత్వ ఉద్యోగులకు బాధ్యతను గుర్తుచేస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను పరిపాలనలో ప్రతిబింబింపజేస్తూ, ప్రజలకు మరింత చేరువగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.